ఆడ, మగ, వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికి నచ్చే అంశం కేశ సౌందర్యం. కొన్నిసార్లు ఆరోగ్యం ఎలా ఉన్నా.. జుట్టు బాగుంటే చాలని కొందరు అనుకుంటున్న వారూ ఉన్నారు. జుట్టు పొడవుగా, నల్లగా, షైనింగ్‌గా ఉండాలని ఎంతోమంది కోరుకుంటారు. అయితే జుట్టు సంరక్షణ అనేది రెండు రకాల కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి చిన్నతనం నుంచి ఆహారపు అలవాట్లు, జుట్టు కోసం ప్రత్యేక సంరక్షణతో పాటు జీన్స్ ప్రభావం కూడా దీనిపై పడుతుంది. ఈ నేపథ్యంలో జుట్టు కోసం తీసుకోవాల్సిన రోజువారి జాగ్రత్తలేవో ఒకసారి తెలుసుకుందాం.
పోషక విలువలు తప్పనిసరి
జుట్టు రాలిపోకుండా ఉండాలంటే.. ఆహారంలో పోషక విలువలు, ప్రొటీన్లు బాగా ఉండేవి తీసుకోవాలి. ఐరన్ ఉండే పదార్థాలు జుట్టుకు మంచి చేస్తుంది. ఎర్రని క్యారెట్, బీట్రూట్తో పాటు పండ్లలో విటమిన్స్, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఐరన్, విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం జుట్టుకు మంచి రంగుతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మరీ మంచిది.
ఆహారపు అలవాట్లు
మాంసం, గుడ్డు తినడం వల్ల ప్రొటీన్లు పొందవచ్చు. శాకాహారులు పప్పు ధాన్యాలు తినడం వల్ల ప్రొటీన్స్ లభిస్తాయి. అన్ని రకాల పప్పు దినుసులు తినడం లేదా రెండు, మూడు రకాలను కలిపి వండి తినడం ద్వారా జుట్టుకు మరింత శక్తి లభిస్తుంది. వీటితో పాటు మొలకెత్తిన విత్తనాలతో ప్రొటీన్లతో పాటు అవసరమైన విటమిన్లు లభిస్తాయి.