Vitamn B For Brain Health : మెదడు ఆరోగ్యానికి సమతులాహారం తినటం అత్యవసరం. అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు లభించినప్పుడు మెదడు చురుకుగా, సమర్థంగా పనిచేస్తుంది. అయితే అన్నింటిలో కెల్లా బి విటమిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కుంగుబాటు, మతిమరుపు, మానసిక స్థిరత్వం కోల్పోవటం వంటివాటికీ బి విటమిన్ల లోపానికీ సంబంధం ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో 8 రకాల విటమిన్లు ఉన్నాయి. అన్నీ ప్రత్యేకమైనవే. ఇవి మెదడుకు ఎలా మేలు చేకూర్చుతాయో చూద్దాం.
శక్తిని పెంచుతూ
విటమిన్ బి1 (థయమిన్) కణాలు పనిచేయటంలో, పోషకాల నుంచి శరీరం శక్తిని గ్రహించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో జీవక్రియల పరంగా అత్యంత చురుకుగా ఉండే అవయవాల్లో మెదడు ఒకటి. అంటే నాడీ సమస్యలకు దారితీసే లోపాలు తగ్గటానికి థయమిన్ తోడ్పడుతుందన్నమాట.
కొవ్వు ఆమ్లాలకు బాసట
విటమిన్ బి5 (పాంటోథెనిక్ ఆమ్లం) కోఎంజైమ్ ఎ అనే అణు సమ్మేళనం తయారీకి అత్యవసరం. కొవ్వు ఆమ్లాలు ఏర్పడటానికి, శక్తి కోసం వీటిని విడగొట్టటానికి ఎంజైమ్‌లకు తోడ్పడేది ఇదే. అవసరమైన కొవ్వులు ఉత్పత్తి కావటానికి తోడ్పడే అసీల్ క్యారియర్ ప్రొటీన్ల తయారీలోనూ విటమిన్ బి5 పాలు పంచుకుంటుంది. మన మెదడు ప్రధానంగా కొవ్వే. అందువల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
జబ్బులతో పోరాటం
విటమిన్ బి6 (పైరిడాక్సిన్) జబ్బుల నివారణకు పెట్టింది పేరు. ఎందుకంటే ఇది తగు మోతాదుల్లో ఉంటే పలు క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. మెదడు ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థకు బాసటగా నిలిచే పలు రసాయనిక ప్రతిచర్యలకూ పైరిడాక్సిన్ తోడ్పడుతుంది.
ఎంజైమ్‌లకు సహాయంగా
విటమిన్ బి2 (రైబోఫ్లావిన్) కణాల్లోని ఎంజైమ్‌లకు సహాయకారిగా పనిచేస్తుంది. ఇలా మెదడు వంటి భాగాల్లో కీలకమైన ప్రతిచర్యల నిర్వహణలో తోడ్పడుతుంది. ఇది కణాలు వృద్ధి చెందటానికి, శక్తి ఉత్పన్నం కావటానికి.. కొవ్వులు, మందుల వంటివి విచ్ఛిన్నం కావటానికీ దోహదం చేస్తుంది.