Benefits Of Turmeric : పసుపు.. భారత సంప్రదాయంలో ఔషధంగా పేరు పొందింది. చాలా మంది దీన్ని యాంటీ బయోటిక్‌లా ఉపయోగిస్తారు. చిటికెడు పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ మహమ్మారితోనూ ఇది పోరాడుతుందని నిపుణులు అంటున్నారు. మరి అలాంటి పసుపుతో ఇంకా ఏం ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.
ఇది అల్లం జాతికి చెందిన మసాలా ద్రవ్యం లాంటి పదార్థం. మన దేశంలో తయారు చేసే వంటకాల్లో దీన్ని తప్పకుండా ఉపయోగిస్తారు. ఇది అందాన్ని పెంచే సుగంధ ద్రవ్యమే కాకుండా.. ఎన్నో వ్యాధుల్ని ఎదుర్కొనే దివ్య ఔషధం కూడా. శ్వాసకోశ వ్యాధులకు మందులా పనిచేస్తుంది. క్యాన్సర్‌తో పోరాడుతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి వాపులు రాకుండా రక్షిస్తుంది. ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడేవారు.. రోజూ పసుపు తీసుకోవడం మంచిది. దీని వల్ల కీళ్ల నొప్పుల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా జాయింట్లు పట్టేసినట్లు ఉండకుండా ఉంటాయి. నల్ల మిరియాలతో కలిసి పసుపు తీసుకుంటే మరింత ప్రయోజనం కలిగే అవకాశముంది.
Turmeric side effects : ఆయితే పసుపు రోజుకు 2 గ్రాముల చొప్పున మాత్రమే తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు, ఎలర్జీ లక్షణాలు వచ్చే అవకాశముంది. కొందరు ఉన్నది ఉన్నట్లు కాకుండా.. ఉప్పు, కారంలో కలిపి పసుపు వాడతారు. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఇందులో క్రుకుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీర అవయవాలకు హాని చేసే ఫ్రీరాడికల్ లాంటి హానికరమైన కెమికల్స్ తొలగించడంలో తోడ్పడుతుంది.
పసుపు తీసుకున్న వారిలో డీ టాక్సిఫైయింగ్ ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది క్యాన్సర్ ట్యూమర్ సెల్స్ పెరుగుదలను నివారిస్తుంది. దీంతో క్యాన్సర్ కణాలు చనిపోయి.. వ్యాధి ముదరకుండా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి వాపు రాకుండా నిరోధించడమే కాకుండా రక్తంలో చెక్కర స్థాయుల్ని కూడా నియంత్రిస్తుంది. గ్యాస్ట్రిక్, జీర్ణ సంబంధ వ్యాధులను క్రుకుమిన్ తగ్గించడమే కాకుండా మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.
ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డిప్రసెంట్గానూ పనిచేస్తుంది. దీంతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడంలో పసుపు పాత్ర ఉంది. ఇవి నియంత్రణలో ఉండటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులకు, అల్జీమర్స్, మైగ్రేన్ సమస్యలకు ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి పసుపును తగిన మోతాదులో రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు తెలిపారు.