తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పీచు పదార్థాలతో... కొలెస్ట్రాల్‌ బయటకు...

రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులపై ఆహారం పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ముఖ్యంగా పిండి పదార్థాలు, కొవ్వులు కీలకపాత్ర పోషిస్తాయి. మాంసం, ఛీజ్‌, వెన్న, ఐస్‌క్రీమ్‌ల వంటివి తక్కువగా తినటమే కాదు.. వీటి స్థానంలో అసంతృప్త కొవ్వులతో కూడిన వంటనూనెలు, చేపల వంటివి తీసుకోవటమూ ముఖ్యమే. అలాగే బాగా శుద్ధిచేసిన ధాన్యాలకు బదులు పొట్టుతీయని ధాన్యాల పిండి పదార్థాలు తీసుకోవాలి. శుద్ధిచేసిన పిండి పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. మరింత ఎక్కువగా తినేలా చేస్తాయి. వీటితో మరో పెద్ద సమస్యేంటంటే పీచు తక్కువగా ఉండటం. పీచు మన శరీరంలోంచి కొలెస్ట్రాల్‌ బయటకు వచ్చేలా చేస్తుంది మరి.

benefits of Fiber food in telugu
పీచు పదార్థాలతో... కొలెస్ట్రాల్‌ బయటకు...

By

Published : Aug 11, 2020, 12:27 PM IST

పీచును మన శరీరం విడగొట్టలేదు. అందువల్ల ఇది జీర్ణం కాకుండానే బయటకు వచ్చేస్తుంది. పీచులో రెండు రకాలు.

  1. నీటిలో కరగనిది.
  2. నీటిలో కరిగేది.

నీటిలో కరగని పీచు నేరుగా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించదు గానీ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఇలా కొలెస్ట్రాల్‌ను పెంచే ఇతరత్రా పదార్థాలు ఎక్కువెక్కువ తినకుండా కాపాడుతుంది, బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. ఇక నీటిలో కరిగిపోయే పీచేమో జిగురు ద్రవంగా మారుతుంది. ఇది ఒంట్లోని కొలెస్ట్రాల్‌ను ఒడిసి పట్టేస్తుంది. దీన్ని వ్యర్థ పదార్థంగా బయటకు పంపించేస్తూ రక్తనాళాల్లో పేరుకుపోవటాన్ని నివారిస్తుంది. అంతేకాదు, నీటిలో కరిగే పీచు పైత్యరస ఆమ్లాలతోనూ జతకూడుతుంది. ఇలా కొవ్వును చిన్న పేగుల నుంచి పెద్ద పేగుల్లోకి చేర్చి విసర్జితమయ్యేలా చేస్తుంది. దీంతో కాలేయం మరింత ఎక్కువగా పైత్య రసాన్ని ఉత్పత్తి చేయటం ఆరంభిస్తుంది.

ఇందుకు కొలెస్ట్రాల్‌ అవసరమవుతుంది. కాలేయంలో కొలెస్ట్రాల్‌ తగినంతగా లేకపోతే రక్తంలోంచి దాన్ని తీసుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇదీ చెడ్డ కొలెస్ట్రాల్‌ తగ్గటానికి తోడ్పడేదే. నీటిలో కరిగే కొన్నిరకాల పీచులు (ఒలిగోశాక్రైడ్లు) పేగుల్లో పులిసిపోయి పొట్టి గొలుసు కొవ్వు ఆమ్లాలుగా మారతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ ఉత్పత్తి కాకుండానూ అడ్డుకుంటాయి. అంటే కొలెస్ట్రాల్‌కూ పిండి పదార్థాలకూ పెద్ద పీచు సంబంధమే ఉంటోందన్నమాట. అందువల్ల పొట్టుతీయని ధాన్యాలు, కూరగాయలు, పండ్లపై దృష్టి సారించటం మంచిది. వీటిల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. గింజపప్పులు (నట్స్‌), గింజలు, విత్తనాలతో బహుళ అసంతృప్త కొవ్వులు లభిస్తాయి. ఓట్స్‌, బార్లీ గింజలు, వంకాయలు, క్యారెట్లు, గోబీపువ్వు, బాదం, పిస్తా, అక్రోట్లు, సోయాబీన్స్‌, సోయాతో తయారుచేసే పాలు, టోఫు వంటివన్నీ కొలెస్ట్రాల్‌ తగ్గటానికి తోడ్పడతాయి. సాల్మన్‌, టూనా వంటి చేపలతో మంచి కొవ్వులు లభిస్తాయి.

ఇదీ చదవండి:పదవుల కోసం వెంపర్లాడటం లేదు: పైలట్​

ABOUT THE AUTHOR

...view details