తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చలికాలంలో ఈ పండ్లు తింటే.. ఇన్ని ప్రయోజనాలా? - dates uses

Benefits of Dates: కాలాలను బట్టి తినాలని చెబుతుంటారు. ఒంట్లో శక్తి పెరగటానికి, జబ్బుల బారినపడకుండా ఉండటానికిది అత్యవసరం. ఇందుకు చలికాలంలో ఖర్జూరం ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరానికి అత్యవసరమైన విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, రాగి, మెగ్నీషియం వంటి పోషకాల్లో ఇందులో దండిగా ఉంటాయి. ఇవన్నీ తక్షణ సత్తువను ప్రసాదిస్తూనే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

dates
ఖర్జూరం

By

Published : Jan 22, 2022, 7:06 AM IST

Benefits of Dates: చలికాలం ఖర్జూరం తింటే ఎన్నో ఉపయోగాలున్నాయి. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, దండిగా లభిస్తాయి.

ఎముక పుష్టి

ఎముక ఆరోగ్యానికి విటమిన్‌ డి కీలకం. చలికాలంలో శరీరానికి తగినంత ఎండ తగలక పోవటం వల్ల ఇది లోపించే అవకాశముంది. ఫలితంగా ఎముకల ఆరోగ్యమూ దెబ్బతినొచ్చు. క్యాల్షియంతో నిండిన ఖర్జూరంతో దీన్ని నివారించుకోవచ్చు. ఎముకలు, దంతాలు బలంగా ఉండేలా చూసుకోవచ్చు. పొటాషియం, ఫాస్ఫరస్‌, రాగి, మెగ్నీషియం వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముక సమస్యల నివారణకూ ఉపయోగపడతాయి.

నొప్పుల నుంచి ఉపశమనం

చలికాలంలో నొప్పులు, బాధలు ఎక్కువవుతుంటాయి. కీళ్లనొప్పులతో బాధపడేవారికిది ఏటా అనుభవమే. ఖర్జూరంలోని నొప్పి నివారణ గుణాలు వీటిని కొంతవరకు తగ్గిస్తాయి. మెగ్నీషియం సైతం నొప్పులు, బాధలు తగ్గటానికి తోడ్పడుతుంది.

గుండె పోటు దూరం

చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. దీంతో గుండెపోటు ముప్పూ పెరుగుతుంటుంది. ఖర్జూరం తినటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు, అధిక రక్తపోటు ముప్పులూ తగ్గుముఖం పడతాయి.

శరీరం వెచ్చగా

ఖర్జూరం చలికాలంలో శరీరం వెచ్చగా ఉండటానికి అవసరమైన వేడిని అందిస్తుంది. సహజ చక్కెర రూపంలో దీన్ని చాలా పదార్థాలు, పానీయాల్లో ఉపయోగించుకోవచ్చు. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమూ సొంతమవుతాయి.

రక్తహీనత తగ్గుముఖం

ఖర్జూరంలో ఐరన్‌ దండిగా ఉంటుంది. దీంతో హిమోగ్లోబిన్‌ స్థాయులు మెరుగవుతాయి. రక్తహీనత తగ్గుముఖం పడుతుంది. మహిళల్లో ఐరన్‌ లోపం తరచూ చూసేదే. దీంతో నిస్సత్తువ, హార్మోన్‌ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గటం, జుట్టు రాలటం, చర్మం పాలిపోవటం, గర్భిణుల్లో గర్భస్రావం కావటం వంటి ఇబ్బందులెన్నో చుట్టుముడతాయి. వీటి నివారణకు ఖర్జూరం ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భిణుల్లో ఐరన్‌ లోపం తలెత్తకుండా ఖర్జూరం తినాలని సూచిస్తుంటారు. ఇది పిండం ఎదుగుదలకూ తోడ్పడుతుంది. శరీరం ఐరన్‌ను గ్రహించుకోవటానికి సాయం చేసే రాగి సైతం ఖర్జూరంలో దండిగా ఉంటుంది.

జీర్ణ సమస్యలు దూరం

ఖర్జూరంలో నీటిలో కరిగే, కరగని.. రెండు రకాల పీచూ ఉంటుంది. చలికాలంలో జీవక్రియలు మందగించే తరుణంలో ఇదెంతో మేలు చేస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి, మలబద్ధకం దరిజేరకుండా ఉండటానికి తోడ్పడుతుంది. ఇలా పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పునూ తగ్గిస్తుంది. తిన్న ఆహారం సరిగా ఒంట పట్టటానికి తోడ్పడే జీర్ణ రసాలు ఉత్పత్తయ్యేలానూ ఖర్జూరం ప్రేరేపిస్తుంది.

హుషారు కోసం

రాత్రిపూట బాగా నిద్రపోయినా ఉదయం లేవగానే అలసటగా, నిస్సత్తువగా, మందకొడితనంగా అనిపిస్తోందా? అయితే రెండు, మూడు ఖర్జారాలు తిని చూడండి. వీటిల్లోని తేలికైన పిండి పదార్థాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అందుకే ఇవి వ్యాయామాలకు ముందు చిరుతిండిగానూ బాగా ఉపయోగపడతాయి. ఎక్కువసేపు వ్యాయామాలు చేస్తున్నట్టయితే ఖర్జూరంతో పాటు బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులనూ కాసిన్ని తినటం మంచిది. ఇవి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తూ త్వరగా అలసిపోకుండా కాపాడతాయి.

చర్మ సౌందర్యానికి

చలి గాలికి చర్మంలోని సహజ నూనెలు తగ్గుతాయి. తరచూ ఖర్జూరం తింటుంటే చర్మానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. తేమ శాతం తగ్గకుండానూ ఉంటుంది. ఖర్జూరం విశృంఖల కణాల ప్రభావాన్ని నిరోధిస్తుంది కాబట్టి చర్మం కళకళలాడేలా చేస్తుంది. విశృంఖల కణాలతో దెబ్బతిన్న చర్మం మరమ్మతు కావటానికి తోడ్పడుతుంది.

ఇదీ చదవండి:

ఊబకాయంతో మరిన్ని జబ్బులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details