Benefits of Outdoor Playing :ప్రస్తుతం పిల్లలంతా దసరా సెలవులతో ఇంటివద్దే ఉన్నారు. అయితే చాలా మంది పిల్లలు ఈ సెలవులను ఆటలతో ఎంజాయ్ చేయకుండా.. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కే అతుక్కుపోతున్నారు. శరీరానికి కాస్త కూడా అలసట ఇవ్వకుండా వీడియో గేమ్‌లు, టీవీలతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో పిల్లలకు చిన్న వయసులోనే పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా దృష్టి లోపం, డయాబెటిస్తో ఎక్కువ శాతం మంది పిల్లలు బాధపడుతున్నారు.
పిల్లలో డిప్రెషన్, ఊబకాయం వంటి సమస్యలు పెరగడానికి కారణం వీడియోగేములు ఆడటం, టీవీలకు అతుక్కుపోవడం. ఈ సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళితే.. ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయాలని చెబుతున్నారు. దీంతో పాటు కొత్తగా ఇప్పుడు ఇందులో మరో అంశాన్ని కూడా చేర్చుతున్నారు. అదే రోజూ కొంత సేపు ఆరుబయట ఆడుకోవడం. కొంత సమయం ప్రకృతిలో గడపడం.. దాన్ని ఆస్వాదించడం. ఆరుబయట ఆటల్లో, బయట పచ్చదనంలో గడిపే పిల్లల్లో.. మానసిక పరిపక్వత ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ విషయం పలు అధ్యయనాల్లోనూ వెల్లడైందని అంటున్నారు.
ఈ మధ్యకాలంలో పిల్లల్లో కనబడుతున్న కొన్ని సమస్యలకు.. నేచర్ డెఫిసిట్ డిజార్డర్ అనే పేరు పెట్టారు వైద్య నిపుణులు. ప్రకృతితో గడపకపోవడం వల్ల వస్తున్న సమస్యగా దీన్ని అభివర్ణిస్తున్నారు. పిల్లల్ని బయటకు తీసుకెళ్లి తిరిగి వచ్చిన తర్వాత.. వారు చదువుకోవడం, క్రమశిక్షణగా ఉండటం మీద అధ్యయనం చేసినప్పుడు కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో వారి ఏకాగ్రత పెరిగింది. అంతేకాకుండా.. పచ్చదనం, నీళ్ల ప్రవహం, పక్షుల కిలకిల మధ్య కొంత సేపు గడిపిన తర్వాత జ్ఞానేంద్రియాలు చురుగ్గా పనిచేస్తున్నాయని గ్రహించారు.
ఈ రోజుల్లో 70 శాతం మంది పిల్లలు సెల్ ఫోన్, ట్యాబ్స్, వీడియో గేములపై అధికంగా సమయం వెచ్చిస్తున్నారు. దీని వల్ల వచ్చే నష్టాలు తల్లిదండ్రులకు తెలిసినా ఏం చేయలేకపోతున్నారు. దీని వల్ల పిల్లలు బరువు పెరుగుతారు. ఏకాగ్రత లోపిస్తుంది. ఎందుకంటే.. అప్పటిదాకా ఫోన్లో వీడియోలు చూసి చూసి సడెన్‌గా కదలని అక్షరాలపై దృష్టి పెట్టలేరు. ఇది ఇలాగే కొనసాగితే.. రాను రాను డల్‌గా తయారవుతారు.
ఫీల్డ్ ట్రిప్పుల్లో భాగంగా అడవికి వెళ్లివచ్చిన పిల్లల్లో గుండె దడ తగ్గడం, ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగినంత స్థాయిలోనే ఉండటం, ఆతృత తగ్గడం గమనించారు. ఇలా తరచూ వెళ్లే వారిలో బరువు కూడా నియంత్రణలో ఉండటం కనుగొన్నారు. విశాలమైన పార్కునకు దగ్గరల్లో ఉంటూ రోజూ పచ్చదనంలో గడిపే పిల్లలో ఊబకాయం లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండటం కూడా చూశారు. దాదాపు 3 వేల మంది విద్యార్థుల మీద జరిపిన పరిశోధనలో వెల్లడైన ఫలితాలివి.