air pollution during Diwali festival: దీపావళి పండగంటే ఇంటిల్లిపాదికీ ఆనందమే. మిఠాయిలు చేసుకోవడంతో పాటు టపాసులు కాల్చుతూ పిల్లలు, పెద్దలూ ఎంతో సందడి చేస్తుంటారు. అయితే, ఈ పండుగ హడావుడిలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అధిక మోతాదులో బాణసంచా పేల్చడం, బయట తిరగడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీపావళి కాలుష్యంతో ఆస్తమా రోగులకే కాదు.. మామూలు వారిలోనూ కొన్ని శ్వాససంబంధమైన సమస్యలు తప్పవంటున్నారు. దగ్గు, శ్వాస పీల్చుకోలేకపోవడం, గురక, ఆస్తమా వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
మాస్క్ తప్పనిసరి:ప్రతిఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. తద్వారా కరోనా వైరస్‌ని నియంత్రించడంతో పాటు కాలుష్యం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంటినుంచి బయటకు వెళ్లినప్పుడు మాస్కును తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీనివల్ల గాలిలో ఉన్న చిన్న చిన్న కణాలు మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.
విటమిన్ సి:విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి మరింత బలోపేతమవుతుంది. రోజూ నిమ్మరసం తీసుకోవడం ద్వారా ‘విటమిన్ సి’ సులభంగా పొందొచ్చు. ఇదే కాకుండా ఉసిరి కచ్చితంగా తినేలా చూసుకోండి. చట్నీ, క్యాండీ, ఊరగాయ.. ఇలా ఏ రూపంలోనైనా ఉసిరి తీసుకోవడం ద్వారా ‘విటమిన్ సి’ పొందొచ్చు.