Banana Health Benefits In Telugu :అరటిపండు.. పెద్దగా పరిచయం అవసరం లేని ఫలం. తక్కువ ధరలో అన్ని చోట్లా, అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. చిన్న పిల్లలు మొదలు పండు ముసలి వాళ్లు తినేందుకు అనువుగా ఉంటుంది. ఇది మనకు ఆరోగ్య పరంగా చాలా మేలు చేస్తుంది. అయితే అరటిపళ్లు ఎవరు తీసుకోవచ్చు? రోజుకు ఎన్ని తినొచ్చు? వాటి ఆరోగ్య ప్రయోజనాలేంటి?
గుండెకు మేలు
అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఆరోగ్యకరమైన చక్కెరలతో పాటు సహజసిద్ధమైన పోషకాలు ఉంటాయంటున్నారు. ఆహార అరుగుదలలో సమస్యలు లేకుండా చూస్తాయని చెబుతున్నారు. కొన్నిరకాల అనారోగ్యాల సమస్యలకు మందుల కంటే అరటిపళ్లు తీసుకోవటమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. రక్తపోటు, గుండె సంబంధ సమస్యలను దూరం చేసే శక్తి అరటిపండ్లకు ఉంటుందని చెబుతున్నారు.
"అరటిపళ్లలో చాలా పోషక విలువలు ఉన్నాయి. సమాజంలో కొంతమందికి వీటిపై అపోహాలు ఉన్నాయి. ఈ పళ్లు తింటే జలుబు చేస్తుందని కొద్దిమంది చెబుతుంటారు. ఇది అవాస్తవం. అరటిపళ్లులో పొటాషియం ఉంటుంది. అధిక రక్తపోటుకు కారణమయ్యేటువంటి సోడియం స్థాయిలను తగ్గించడానికి అరటిపళ్లలో ఉండే పోటాషియం చాలా ఉపయోగపడుతుంది. వీటిలో పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే మధమేహం పేషెంట్లు మాత్రం అరటిపళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి."