ఆరోగ్య ప్రదాయిని అరటి.. అందుకే డైట్‌లో భాగం చేసుకోండిలా!
సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండే ఆహారమేదంటే వెంటనే గుర్తుకొచ్చేది అరటి పండే. తక్కువ ధర, తినడానికి సౌలభ్యం, అధిక ప్రయోజనాలు... వెరసి అరటి పండు ప్రత్యేకతలెన్నో. తక్షణ శక్తికి, తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావడంలో భేషుగ్గా పనిచేసే ఈ మ్యాజికల్ ఫ్రూట్ను సమ్మర్ డైట్‌లో భాగం చేసుకుంటే మరీ మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.
అరటి ఉపయోగాలు, ఆరోగ్యం కోసం అరటి పండు
By
Published : Mar 30, 2021, 8:31 AM IST
తిన్న ఆహారం సులువుగా జీర్ణమయ్యేందుకు కొందరు అరటి పండును తీసుకుంటారు. మరికొందరు భోజనం చేయలేని పరిస్థితుల్లో తక్షణ శక్తి కోసం దీనిని ఆహారంగా తీసుకుంటారు. ఇంకొందరు పాలతో కలిపి మిల్క్‌షేక్ చేసుకుని తాగుతారు. ఇలా దీన్ని కేవలం పండు రూపంలోనే కాకుండా అరటికాయ, అరటి పువ్వు, అరటికాయతో తయారుచేసిన పిండి (బనానా ఫ్లోర్) సహాయంతో రుచికరమైన కూరలు, ఆహార పదార్థాలు తయారుచేసుకునే వాళ్లు కూడా ఉన్నారు. మరి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే అరటి పండును వేసవిలో ఎలా తినాలో తెలుసుకుందాం రండి.
రోజును ప్రారంభించండిలా!
సమయాభావం వల్ల చాలామంది బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడానికి బద్ధకిస్తుంటారు. అలాంటివారికి అరటి పండు చాలా చక్కని పరిష్కారం. ఆమ్లతత్త్వ గుణాలు తక్కువగా ఉండే ఈ పండును ఉదయం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందడమే కాకుండా ఎసిడిటీ, మైగ్రెయిన్, తిమ్మిర్లు వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇక ఉదయాన్నే వర్కవుట్ చేసేముందు, వర్కవుట్ పూర్తయిన తర్వాత కూడా అరటి పండును తీసుకోవచ్చు. దీనివల్ల మరింత ఉత్సాహంగా వ్యాయామాలు చేయవచ్చు.
లంచ్ ఆలస్యమైతే..
పని ఒత్తిడి లేక ఇతర కారణాల వల్ల మధ్యాహ్న వేళల్లో చాలామంది ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. దీనివల్ల కడుపు నొప్పి, ఎసిడిటీ, అజీర్తి, కడుపుబ్బరం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అరటి పండును తింటే సాధ్యమైనంతవరకు జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇక హైపోథైరాయిడిజంతో బాధపడే మహిళలు ఒక్కోసారి చాలా నిస్తేజంగా, నీరసంగా కనిపిస్తుంటారు. అలాంటివారు అరటి పండును తీసుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. హైపోథైరాయిడిజం వల్ల కలిగే లక్షణాల తీవ్రతను తగ్గించే గుణాలు అరటి పండులో పుష్కలంగా ఉంటాయి.
అరటి పండుతో ముగించండి!
రాత్రి భోజనం చేసిన తర్వాత చాలామంది అరటి పండును తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అరటి పండులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను బాగా నివారిస్తుంది. ఇందులో తక్కువ పరిమాణంలో ఉండే ఫ్రక్టోజ్ ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ సమస్యను బాగా నియంత్రిస్తుంది. తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇక అరటి పండును తినడం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు కూడా బాగా తగ్గిపోతాయి.
బనానా మిల్క్ షేక్!
పరీక్షల కోసమో, అసైన్‌మెంట్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతోనో చాలామంది అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటారు. నిద్రను అధిగమించేందుకు మధ్యమధ్యలో కాఫీ, టీలను తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల నిద్ర దూరమవుతుందేమో కానీ కాఫీలోని కెఫీన్ మాత్రం శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి చేస్తుంది. దీనివల్ల త్వరగా అలసట, నీరసం వస్తుంది. ఇలాంటి సమయాల్లో బనానా మిల్క్‌షేక్ మంచి ప్రత్యామ్నాయమంటున్నారు పోషకాహార నిపుణులు. గంటల తరబడి కంప్యూటర్ ముందు గడిపే వారికి కూడా ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. ఇక అధిక సమయం పాటు వ్యాయామాలు చేసిన తర్వాత ఆకలి బాగా వేస్తుంది. ఇలాంటి సమయాల్లో బనానా మిల్క్‌షేక్‌ను తీసుకుంటే శరీరంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
తేలికగా జీర్ణమయ్యేందుకు!
షిక్రన్ పోలి... పేరు వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా మహారాష్ట్రతో పాటు మరాఠీ కుటుంబాల్లో ఈ వంటకం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. మరాఠీల సంప్రదాయ వంటకంగా గుర్తింపు పొందిన దీనిని అక్కడి ప్రజలు ఇష్టపడి మరీ తింటారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలకు తరచుగా దీనిని వండి పెడుతుంటారు. ఈ వంటకంలోని పోషక గుణాలు మైగ్రెయిన్ తలనొప్పిని నివారించడంలో బాగా సహాయపడతాయి. మరి అరటి పండ్లతో ఎంతో సులభంగా చేసే షిక్రన్ పోలి తయారీ గురించి మనమూ తెలుసుకుందాం రండి.
షిక్రన్ పోలి
కావాల్సిన పదార్థాలు! * అరటి పండ్లు (బాగా మగ్గినవి)- 2 * పాలు - ఒక కప్పు * రోటీలు లేదా చపాతీలు - 2 నుంచి 3 * చక్కెర- సరిపడినంత (తియ్యదనం కోసం)
తయారీ
ముందుగా ఫోర్క్ సహాయంతో అరటి పండ్లను ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి పాలను తీసుకుని అరటి పండ్ల ముక్కలను అందులో వేయాలి. తియ్యదనం కోసం ఈ మిశ్రమానికి కొంచెం చక్కెరను జోడించాలి. ఇప్పుడు వేడి వేడి రోటీలు లేదా చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పాలు-అరటి పండ్ల మిశ్రమంలో వేయాలి. గరిటె సహాయంతో ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. రోటీ లేదా చపాతీ ముక్కలు పాలు-అరటి పండ్ల మిశ్రమంలో నానేలా సుమారు 5-6 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పిల్లలకు వడ్డించాలి.
పలు ఆరోగ్య ప్రయోజనాలున్న అరటి పండును వేసవిలో ఎలా తినచ్చో తెలుసుకున్నారుగా! మరి మీరు కూడా అరటి పండును ఆహారంలో భాగం చేసుకోండి. చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.