తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బట్టతలకు ఇక గుడ్​బై! త్వరలోనే అద్భుతమైన ట్రీట్​మెంట్​!!

Bald head treatment : బట్టతల మీద వెంట్రుకలు మొలిస్తే? ఆ మాటకొస్తే అసలు బట్టతల రాకుండానే చేయగలిగితే? యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, రివర్‌సైడ్‌ (యూసీఆర్‌) పరిశోధకుల అధ్యయనం ఇలాంటి ఆశలే కల్పిస్తోంది. వెంట్రుకల కుదుళ్లలోని కణాలు వృద్ధి చెందటానికి, కొత్త కణాలు ఏర్పడటానికి.. అవి వాటంతటవే చనిపోవటానికి కారణమవుతున్న టీజీఎఫ్‌-బీటా అనే ప్రొటీన్‌ గుట్టును రట్టు చేయటం ఇందులోని కీలకాంశం.

bald head treatment
బట్టతలకు ఇక గుడ్​బై! త్వరలోనే అద్భుతమైన ట్రీట్​మెంట్​!!

By

Published : Aug 3, 2022, 3:29 PM IST

Bald head treatment : మన శరీరంలోని చాలా కణాలు ప్రత్యేకమైనవే. ఆయా పనులు మాత్రమే చేస్తాయి. ఉదాహరణకు- రక్తకణాలు నాడీకణాలుగా మారవు. అలాగే నాడీకణాలు ఎన్నటికీ రక్తకణాలుగా మారవు. కానీ మూలకణాలు అలా కాదు. ఎలాంటి కణాలుగానైనా మారగలవు. దెబ్బతిన్న కణజాలం, అవయవాలు మరమ్మతు కావటానికి తోడ్పడేవి ఇవే. కొంత క్షీణించినా కాలేయం తిరిగి కోలుకోవటం తెలిసిందే. అయితే యూసీఆర్‌ పరిశోధకులు విభిన్నంగా వెంట్రుకల కుదుళ్ల మీద అధ్యయనం నిర్వహించారు. ఎందుకంటే దెబ్బలు తగిలినా, తగలకపోయినా తమకుతామే పునరుత్తేజితమయ్యేవి వెంట్రుకల కుదుళ్లు మాత్రమే.

ఇందులో టీజీఎఫ్‌-బీటా ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుండటం గమనార్హం. ఇది రెండంచుల కత్తిలా పనిచేస్తుంది. ఒకవైపేమో కొత్త వెంట్రుకలు పుట్టుకొచ్చేలా కుదుళ్లలోని కణాలను ప్రేరేపిస్తుంది. మరోవైపేమో కుదుళ్ల కణాలు వాటంతటవే చనిపోయేలా (అపాప్టోసిస్‌) పురికొల్పుతుంటుంది. ఈ ప్రక్రియ టీజీఎఫ్‌-బీటా మోతాదుల మీద ఆధారపడి ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇది తగినంతగా ఉత్పత్తి అయినప్పుడు కుదుళ్ల కణాలు విభజన చెందుతుండగా.. మరీ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు వాటంతటవే చనిపోతున్నాయి. అంటే కుదుళ్ల కణాలు ఎప్పుడు వృద్ధి చెందాలో, ఎప్పుడు మరణించాలో అనే ప్రక్రియను ఇదే నియంత్రిస్తోందన్నమాట.

Hair on bald head naturally : అసలు వెంట్రుకల కుదుళ్లు వాటంతటవే ఎందుకు చనిపోతాయి? దీని గురించి కచ్చితంగా తెలియదు. కానీ ఇవి చనిపోయినా వీటి మూలకణాల నిల్వ మాత్రం అలాగే ఉంటుంది. తిరిగి మొలవాలనే సంకేతం జన్యువుల నుంచి అందగానే ఇవి వృద్ధి చెంది, కొత్త కణాలు ఏర్పడతాయి. చివరికి కొత్త కుదుళ్లుగా మారతాయి. అందుకే ఈ కణ విభజన ప్రక్రియను టీజీఎఫ్‌-బీటా ఎలా నియంత్రిస్తోంది? ఇతర ముఖ్యమైన జన్యువులతో ఎలా సమాచారం నెరపుతోంది? అనేది కచ్చితంగా తెలుసుకోగలిగితే కుదుళ్లు మూలకణాలను ప్రేరేపించటం, కొత్త వెంట్రుకలు మొలిచేలా చేయటం అసాధ్యమేమీ కాదని పరిశోధకులు చెబుతున్నారు. టీజీఎఫ్‌-బీటా మోతాదులను నియంత్రించే విధానాన్ని గుర్తిస్తే ఏదో ఒకనాడు బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్టేనని గట్టిగా విశ్వసిస్తున్నారు. బట్టతలతో సతమతమవుతున్న కోట్లాది మందికి ఇంతకన్నా కావాల్సిందేముంది?

ABOUT THE AUTHOR

...view details