Bacteria in human body: పేగుల్లోని బ్యాక్టీరియా మంచే కాదు, చెడూ చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మన శరీరం మీదే దాడి చేయటం వల్ల తలెత్తే సమస్యలు, పేగుల్లో పూత, జీవక్రియ రుగ్మతలు, కుంగుబాటు వంటి జబ్బులనూ తెచ్చిపెడుతుంది. ఇలాంటి దుష్ప్రభావాలకు బ్యాక్టీరియా పేగులను దాటుకొని రావటం (లీకీ గట్) కారణమని భావిస్తుంటారు.కానీ జబ్బుల ఆనవాళ్లేమీ కనిపించనీయకుండా ఆరోగ్యవంతుల్లో ఈ హానికర బ్యాక్టీరియా ఎలా మనగలుగుతుందనేది అంతు చిక్కని ప్రశ్న.
తాజాగా యేల్ యూనివర్సిటీ పరిశోధకులు దీని గుట్టును ఛేదించారు. పేగుల్లోని బ్యాక్టీరియా క్రమంగా రెండు వేర్వేరు రకాలుగా మారుతున్నట్టు గుర్తించారు. ఒక రకమేమో పాత బ్యాక్టీరియా మాదిరిగానే ప్రవర్తిస్తుండగా.. మరో రకంలో డీఎన్‌ఏ మారిపోతున్నట్టు కనుగొన్నారు. దీంతో ఇది పేగుల్లోని జిగురు పొరల్లో జీవించే సామర్థ్యాన్ని సంతరించుకుంటోంది. అంతేకాదు.. పేగుల్లోంచి బయటపడ్డాక లింఫ్ గ్రంథులు, కాలేయంలోనూ మనగలుగుతోంది. పైగా ఇది తాత్కాలికంగానైనా రోగనిరోధక వ్యవస్థను తప్పించుకొని అవయవాల్లో జీవిస్తుండటం గమనార్హం. క్రమంగా వాపు ప్రక్రియను ప్రేరేపించి స్వీయ రోగనిరోధక సమస్యలను తెచ్చిపెడుతోంది.