నడుంనొప్పి బాధిస్తున్నప్పుడు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందనే అనిపిస్తుంది. కానీ కదిలితేనే మంచిది. వీపు, కడుపు, కాలి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు నడుంనొప్పి తగ్గటానికి తోడ్పడతాయి. మొదట్లో కొద్దిగా అసౌకర్యంగా ఉండొచ్చు గానీ కండరాలు బలపడుతున్నకొద్దీ ఇబ్బందేమీ ఉండదు. కానీ వ్యాయామాలు చేస్తున్నప్పుడు కాస్త ఎక్కువగా నొప్పి వస్తున్నా, 15 నిమిషాల కన్నా ఎక్కువసేపు నొప్పి వస్తున్నా వెంటనే ఆపెయ్యాలి. డాక్టర్‌ను సంప్రదించాలి.
Back pain relief exercises at home : నడుంనొప్పి గలవారికి అయితే అన్ని వ్యాయామాలూ పనికిరావు. ముఖ్యంగా ముందుకు వంగే వ్యాయామాలు (చేతులతో పాదాలను తాకటం వంటివి) చేయొద్దు. ఇవి వెన్నెముక డిస్కులు, కండర బంధనాల మీద ఒత్తిడిని పెంచుతాయి వీటికి బదులు పాక్షిక క్రంచెస్ చేయటం మంచిది. ముందుగా వెల్లకిలా పడుకొని, మోకాళ్లను మడిచి, అరి చేతులను మెడ వెనకాల పెట్టుకోవాలి. పొట్ట కండరాలను బిగుతుగా చేసి, శ్వాస వదులుతూ భుజాలను కాస్త పైకి లేపాలి. ఒకట్రెండు సెకండ్ల పాటు అలాగే ఉండి, యథాస్థితికి రావాలి. ఇలా 8 నుంచి 12 సార్లు చేయాలి.