పసి గుడ్డు కుసుమ కోమలం. అప్పటివరకూ ఎలాంటి చీకూ చింతా లేకుండా తల్లి కడుపులో పెరిగిన బిడ్డ కాన్పయిన మరుక్షణం నుంచే బయటి ప్రపంచానికి అలవడే ప్రయత్నం మొదలెడుతుంది. ఏడుపు తప్ప మరేదీ తెలియని శిశు భాషను అర్థం చేసుకోవటం, అవసరమైన రక్షణ కల్పించటం మన బాధ్యతే. ముఖ్యంగా తొలి 28 రోజులు (నియోనేటల్) అతి కీలకం. ఆరు నెలలు నిండేవరకూ కంటికి రెప్పలా చూసుకోవాలి. అనంతరం ఐదేళ్లు పూర్తయ్యేవరకూ ఆలానా పాలనలో ఆద మరవొద్దు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగినా జీవితాంతం దాని పర్యవసానాలు వెంటాడతాయి. వైద్య సదుపాయాల విషయంలో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మనదేశంలో ఐదేళ్ల లోపు మరణిస్తున్న పిల్లల సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉంటోంది. వీరిలో చాలామంది పుట్టిన నెలలోపే.. అదీ పుట్టిన ఒకట్రెండు రోజుల్లోనే కన్ను మూస్తుండటం విచారకరం. శిశు సంరక్షణలో పుట్టిన తొలినాళ్లలో అత్యంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఇది నొక్కి చెబుతోంది. అందువల్ల తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాల విషయంలో ఆచితూచి వ్యవహరించటం మంచిది.
మేలు చేసేవి
తల్లీ బిడ్డను ప్రత్యేక గదిలో ఉంచటం: పసిబిడ్డ సంరక్షణకు ఇది చాలా కీలకం. మన చుట్టూ కనిపించని సూక్ష్మక్రిములు ఎన్నో ఉంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డకు రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల బిడ్డను వీటి బారినపడకుండా చూసుకోవటం మంచిది. అందుకే ఒకప్పుడు పురుడు అయ్యేంతవరకు తల్లీబిడ్డను ప్రత్యేక గదిలోనే ఉంచేవారు. దానిలోకి ఇతరులను రానిచ్చేవారు కాదు. ఒకరో ఇద్దరో తల్లీబిడ్డల అవసరాలను చూసుకునేవారు. ఇది ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడేది. దీన్ని ఇప్పుడు పాటించటమూ మంచిదే. అయితే ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగిపోతున్న తరుణంలో ఇది మరుగున పడిపోయింది. కాన్పయిన మరుక్షణం నుంచే బంధువులంతా ఆసుపత్రికి వస్తుంటారు. చేతులు, కాళ్లు కడుకోకుండానే బిడ్డను ఎత్తుకోవటం, ముద్దులు పెట్టటం చేస్తుంటారు. దీంతో బిడ్డకు ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. తల్లికీ ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. అందువల్ల తల్లీబిడ్డలను కనిపెట్టుకునేవారు తప్ప మిగతావాళ్లంతా దూరంగా ఉండటం మంచిదని గుర్తించాలి. ముఖ్యంగా తొలి 15 రోజుల్లో బాలింతను, బిడ్డను బయటివారు తాకకుండా చూసుకోవటం ఎంతైనా మంచిది.
నూనె మర్దన:నూనెతో మర్దన చేయటం శిశువుకే కాదు, తల్లికీ మేలు చేస్తుంది. ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది. నూనెతో మర్దన చేస్తే పిల్లలు బాగా నిద్ర పోతున్నట్టు, బరువూ పెరుగు తున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మరీ గట్టిగా, బలంగా రుద్దొద్దు. కళ్లు, కనుబొమలు, ముక్కు, బుగ్గలు, బొడ్డు, వెన్నెముక, కాళ్లు చేతులను క్రమబద్ధంగా నెమ్మదిగా, మృదువుగా రుద్దుతూ మర్దన చేయాలి. ఇది బిడ్డకు మంచి విశ్రాంతిని కలిగిస్తుంది. శిశువు శరీరానికి రక్త ప్రసరణ పుంజుకునేలా చేస్తుంది.
చనుబాలు పట్టటం:ఒకప్పుడు తల్లికి పాలు పడకపోతే ఇరుగుపొరుగువారిలోనో, బంధువుల్లోనో చనుబాలు పట్టేవారిని తీసుకొచ్చి బిడ్డకు ఇప్పించేవారు. ఇది మంచి పద్ధతి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవచ్చు గానీ వీలైనంత త్వరగా.. అరగంటలోపే తల్లిపాలు పట్టటం ఆరంభించటం మంచిది. చనుబాలలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. మొదటి మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలు (కొలెస్ట్రమ్) చాలా చాలా ముఖ్యం. ఇందులో కొవ్వు పదార్థాలు, రోగనిరోధక కణాలు దండిగా ఉంటాయి. దీనిలోని ఇమ్యునోగ్లోబులిన్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కొందరు ముర్రుపాలు జీర్ణం కావని, బిడ్డకు జబ్బు చేస్తుందని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. ఒకట్రెండు చుక్కలే వస్తున్నాయని, అవి సరిపోవటం లేదని వెంటనే పోతపాలు మొదలెట్టటమూ సరికాదు. పడుతుంటూనే పాలు వస్తుంటాయి. చనుబాలు ఇవ్వటం సులువు. ఇవి పరిశుభ్రంగానూ ఉంటాయి. సూక్ష్మక్రిములకు తావులేదు. అదే పోతపాలతో పిల్లలకు మలబద్ధకం రావొచ్చు. సీసా శుభ్రంగా కడగకపోతే విరేచనాలు, వాంతులు పట్టుకోవచ్చు. ఒకవేళ తల్లిపాలను పిండి పట్టాల్సి వస్తే గోకర్ణ/పాలాదలో పట్టి తాగించాలి. ప్రతి రెండు గంటలకోసారి పాలు పట్టాలి. బిడ్డ బాగా ఏడ్చేంతవరకు ఆగకూడదు. పుట్టిన తొలి రోజుల్లో ఒంట్లోంచి నీరు పోవటం వల్ల బిడ్డ బరువు తగ్గిపోవటం సహజమే. అలాగని మరీ ఎక్కువగా తగ్గకూడదని గుర్తించాలి. బరువు మరీ తగ్గితే పాలు సరిగా పట్టటం లేదని, బిడ్డకు తగినన్ని కేలరీలు లభించటం లేదనే అర్థం. శిశువులు 10% కన్నా ఎక్కువ బరువు తగ్గితే డాక్టర్‌ను సంప్రదించాలి. వీరిలో రక్తంలో గ్లూకోజు తగ్గిపోవచ్చు. సోడియం మోతాదులు బాగా పెరిగిపోవచ్చు. ఇది మున్ముందు పిల్లలకు ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. అందువల్ల బరువు తగ్గటానికి గల కారణాన్ని గుర్తించి, సరిచేస్తే వీటిని ముందుగానే నివారించుకోవచ్చు.
బిడ్డకు తొలి 6 నెలల వరకు చనుబాలు తప్ప మరేదీ ఇవ్వద్దు. ఆరు నెలల తర్వాత ఘనాహారం ఆరంభించాలి. ఘనాహారం ఇస్తున్నా కూడా రెండేళ్లు నిండేవరకూ తల్లిపాలు పట్టాలి. ఇది బిడ్డకు, తల్లికి ఇద్దరికీ మేలు చేస్తుంది.
ఎండ చూపించటం:ఇది శిశు కామెర్లు తగ్గటానికి తోడ్పడుతుంది. ఈ విషయం శాస్త్రీయంగానూ రుజువైంది. అయితే ఎండలోని అతి నీలలోహిత, పరారుణ కిరణాలు కొన్నిసార్లు హాని చేయొచ్చు. అందువల్ల అతి నీలలోహిత కాంతి తక్కువగా ఉండే ఉదయం వేళల్లోనే బిడ్డకు ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగని ఇదేమీ కామెర్లకు ఇచ్చే ఫొటోథెరపీకి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. కళ్లు, చర్మం మరీ పసుపు పచ్చగా ఉంటున్నా.. బిడ్డ చిరాకు పడుతున్నా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఎండకు పెడుతున్నాం కదా, అదే తగ్గిపోతుందని అనుకోరాదు.
హాని చేసేవి