తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పిల్లల దంతాల సంరక్షణకు ఇవి తప్పనిసరి!

'తిండి తింటే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌' అన్నది కవి వాక్కు. మరి ఆ తిండి తినాలంటే దంతాలు దృఢంగా ఉండాలి. చిగుళ్లు బలంగా ఉండాలి. అప్పుడే కండ అయినా, మనిషి అయినా. అందుకే నోటి ఆరోగ్యానికి అంత ప్రాధాన్యం. నిజానికి నోటి శుభ్రత అనేది వయసుతో నిమిత్తమైంది కాదు. వీలైనంత త్వరగా ఆరంభించాల్సిన పని. ఆ మాటకొస్తే పాల పళ్లు రాకముందు నుంచే మొదలు పెట్టాల్సిన పని. ఈ నేపథ్యంలో 'బాల దంత' సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ కన్నేద్దాం.

Babies teeth problems and its solution
Babies teeth problems and its solution

By

Published : Jan 5, 2022, 7:09 AM IST

దంతో రక్షతి రక్షితః. కాస్త అతిశయోక్తిలా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. దంతాలను కాపాడుకుంటే అవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మన దేశంలో దంతక్షయం, చిగుళ్ల జబ్బులు చాలా ఎక్కువ. గమనించాల్సిన విషయం ఏంటంటే- ఇవి పూర్తిగా నివారించుకోదగ్గ సమస్యలు! దంతాలను శుభ్రంగా ఉంచుకోవటం, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించటం, క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రతించటం ద్వారా దంత సమస్యలను చాలావరకు దరిజేరకుండా చూసుకోవచ్చు. ఇవి చిన్నప్పట్నుంచే అలవడితే పెద్దయ్యాకా దంత సమస్యల బారినపడకుండా చూసుకోవచ్చనటంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చిన్నప్పట్నుంచే పిల్లలకు నోటి శుభ్రత గురించి తెలియజేయటం, దంతాలను శుభ్రం చేసుకునే పద్ధతులు నేర్పించటం ఎంతైనా అవసరం. మరి మీకు పిల్లల దంత సంరక్షణ పద్ధతుల గురించి తెలుసా? అయితే ఈ ప్రశ్నల్లో ఎన్నింటికి సరైన సమాధానాలు చెప్పగలరో తేల్చుకోండి.

ఎన్నిరోజులకు ఒకసారి టూత్‌బ్రష్‌ మారుస్తున్నారు?

పిల్లలకు వాడే బ్రష్‌ను ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చటం మంచిది. బ్రష్‌ పోచలు పక్కలకు వంగిపోయినా, అడ్డదిడ్డంగా అరిగిపోయినా, మధ్యలో ఎక్కడైనా ఊడిపోయినా వెంటనే దాన్ని పారేసి, కొత్తది ఇవ్వాలి.

ఆటల్లో పళ్లకు దెబ్బలు తగలకుండా చూస్తున్నారా?

పిల్లలు ఆటలాడటం అత్యవసరం. దీంతో పిల్లల శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుంది. అయితే ఒకరినొకరు గట్టిగా తాకటం, కింద పడటం, దెబ్బలు తగిలే అవకాశాలు గల ఆటల్లో తగు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి. నోటికి దెబ్బతగలకుండా మౌత్‌గార్డ్‌ కొనివ్వాలి. రబ్బరు మాదిరిగా ఉండే ఇది చిగుళ్లకు, దంతాలకు అంటుకొని ఉంటూ రక్షణగా నిలుస్తుంది. దెబ్బలు తగిలినా పళ్లు విరిగిపోకుండా, ఊడిపోకుండా కాపాడుతుంది. ఈ విషయంలో అవసరమైతే డాక్టర్‌ను సంప్రతించటం మంచిది. ఎలాంటి ఆటల్లో మౌత్‌గార్డ్‌ అవసరమో తెలుసుకోవాలి. అది అవసరమైతే తప్పకుండా వాడుకునేలా చూడాలి.

తీపి పీకలు, నోట్లో వేలు వేసుకోవటం మాన్పిస్తున్నారా?

పిల్లలు ఏడ్వకుండా పీకలను నోట్లో పెట్టటం మామూలే. కొందరు పిల్లలైతే నోట్లో వేలు వేసుకొని చీకుతుంటారు కూడా. ఎప్పుడో అప్పుడైతే ఇబ్బందేమీ ఉండకపోవచ్చు గానీ దీర్ఘకాలంగా వీటినిలాగే కొనసాగిస్తుంటే పిల్లల నోరు, దంతాల ఎదుగుదల దెబ్బతింటుంది. చిగుళ్ల మీద ఒత్తిడి పడటం వల్ల పళ్లు వంకరగా రావొచ్చు. ఫలితంగా పళ్లను శుభ్రం చేసుకోవటం కష్టమవుతుంది. కొన్ని శబ్దాలు, పదాలు సరిగా పలకలేకపోవచ్చు. కాబట్టి రెండున్నరేళ్ల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల నోటికి పీకలు అందించకపోవటమే ఉత్తమం. అలాగే నోట్లో వేలు వేసుకుంటుంటే వీలైనంత త్వరగా దాన్ని మాన్పించెయ్యాలి.

పిల్లల నోటి శుభ్రతను ఎప్పుడు ఆరంభించాలి?

నోటి శుభ్రత అనేది పసితనం నుంచే ఆరంభించాల్సిన పని. ఇంకా పళ్లు రాలేదు కదా అని అనుకోవటానికి లేదు. పళ్లు రాకపోయినా చిగుళ్లను శుభ్రం చేయటం తప్పనిసరి. శుభ్రమైన, మెత్తటి తడి బట్టను వేలికి చుట్టుకొని.. లేదా దూదితో గానీ శిశువుల చిగుళ్లను నెమ్మదిగా తుడవాలి. కనీసం రోజుకు రెండు సార్లయినా.. ముఖ్యంగా పాలు పట్టిన తర్వాత, రాత్రిపూట పడుకోబోయే ముందు శుభ్రం చేయటం మంచిది. వీలైతే ప్రత్యేకంగా తయారుచేసిన ప్యాడ్లతోనూ శుభ్రం చేయొచ్చు. అలాగే పాల పళ్లు వచ్చిన తర్వాత కూడా తడిబట్టతో పళ్లను, చిగుళ్లను రుద్ది, శుభ్రం చేయాలి. పోతపాలు పడుతుంటే పడుకునేటప్పుడు విధిగా పాలపీకను నోట్లోంచి తీసేయాలి. నోట్లో పీకతో అలాగే పడుకోబెట్టటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీంతో పళ్లు దెబ్బతింటాయి. శాశ్వత దంతాలు వచ్చేనాటికే దంతాలన్నీ పుచ్చిపోవచ్చు కూడా.

మీ పిల్లలు రోజుకు ఎన్ని సార్లు పళ్లు తోముకుంటున్నారు?

ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకునే ముందు.. ఇలా రోజుకు రెండు సార్లు పళ్లు తోముకునేలా చూడటం తప్పనిసరి. దీంతో పళ్లు పుచ్చిపోవటం, చిగుళ్ల జబ్బుల ముప్పులను తగ్గించుకోవచ్చు. పళ్లను తోముకోవటానికీ ఒక పద్ధతుంది. ఎలా పడితే అలా కాకుండా బ్రష్‌ను పళ్ల మీద గుండ్రంగా తిప్పుతూ తోముకునేలా ముందు నుంచే నేర్పించాలి. పళ్లు తోముకున్నాక వేలితో చిగుళ్లను నెమ్మదిగా మర్దన చేయటం అలవాటు చేయాలి. తమకు తాముగా పళ్లను సరిగా శుభ్రం చేసుకోవటం అలవడేంతవరకు ఇలా పిల్లలను ఓ కంట కనిపెడుతూ.. సరిగా తోముకుంటున్నారో లేదో చూడాలి. ఒకసారి సరిగా పళ్లు తోముకోవటం అలవడితే అది జీవితాంతం తోడుంటుంది. రాత్రిపూట పళ్లు తోముకున్నాక మరేదీ తినకుండా చూసుకోవటాన్నీ మరవద్దు.

పిల్లలకు బ్రష్‌ మీద ఎంత టూత్‌పేస్ట్‌ పెడుతున్నారు?

బ్రష్‌ మీద టూత్‌పేస్ట్‌ ఎంత పెట్టుకోవాలో కూడా చూస్తారా ఏం? ఇదేం చోద్యం? అని చాలామంది విస్తుపోవచ్చు. కానీ ఇదీ ముఖ్యమే. మూడేళ్ల లోపు పిల్లలకైతే బియ్యపు గింజంత టూత్‌పేస్ట్‌ సరిపోతుంది. మూడేళ్లు దాటిన పిల్లలైతే బఠానీ గింజంత పేస్ట్‌ పెట్టుకోవచ్చు. కానీ మనలో చాలామంది బ్రష్‌ నిండా పేస్ట్‌ పెట్టి ఇచ్చేస్తుంటారు. ఇది మంచిది కాదు. అలాగే పళ్లు తోముకునేటప్పుడు వచ్చే నురగను పూర్తిగా ఉమ్మేసేలా చూడాలి. పిల్లల్లో చాలామంది బ్రష్‌ మీద పెట్టిన పేస్టును మింగేయటం చూస్తూనే ఉంటాం. ఇదేమీ పెద్ద ప్రమాదకరం కాకపోవచ్చు గానీ పేస్టులో ఫ్లోరైడ్‌ శాతం నిర్ణీత మోతాదులో కన్నా ఎక్కువుంటే కొన్నిసార్లు ఇబ్బందికరంగా పరిణమించొచ్చు.

క్రమం తప్పకుండా దంత వైద్యుడికి చూపిస్తున్నారా?

తొలి పన్ను మొలిచిన తర్వాత ఒకసారి దంత వైద్యుడికి చూపించటం మంచిది. ఒకవేళ అది కుదరకపోతే తొలి పుట్టినరోజు లోపున అయినా డాక్టర్‌ను సంప్రతించాలి. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా పరీక్ష చేయించాలి. మిగతా జబ్బుల మాదిరిగానే దంత సమస్యల నివారణ కూడా చాలా కీలకం. ఒకవేళ సమస్య మొదలైతే వెంటనే గుర్తించటం, వీలైనంత త్వరగా చికిత్స చేయించటం అత్యవసరం. అప్పుడే మెరుగైన ఫలితం కనబడుతుంది. దంత, చిగుళ్ల జబ్బుల ముప్పును.. వాటితో ముడిపడిన ఇతరత్రా సమస్యల ముప్పులను తగ్గించుకోవటం సాధ్యమవుతుంది. అందువల్ల పిల్లలను క్రమం తప్పకుండా దంత వైద్యుడికి చూపిస్తే ఇలాంటి ముప్పులు దరిజేరకుండా కాపాడుకోవచ్చు.

తీపి పదార్థాలు, పానీయాలు తగ్గిస్తున్నారా?

చక్కెర ఎక్కువగా ఉండే మిఠాయిలు, చాక్లెట్లు, తీపి పానీయాలు.. అలాగే బాగా పొట్టుతీసిన ధాన్యాల్లోని పిండి పదార్థాలు పళ్లకు హాని చేస్తాయి. వీటిల్లోని చక్కెర అలాగే ఉండిపోతే పంటి మీదుండే గట్టి పింగాణీ పొర (ఎనామిల్‌) అరిగిపోతుంది. అక్కడ బ్యాక్టీరియా పెరిగి పళ్లు పుచ్చిపోవచ్చు. అందువల్ల చాక్లెట్లు, మిఠాయిల వంటివి అతిగా తినకుండా చూసుకోవాలి. అలాగే ఏది తిన్నా కూడా వెంటనే నీటితో పుక్కిలించి నోరు శుభ్రం చేసుకోవటం నేర్పించాలి. సీసాతో ద్రవాలు పట్టేవాళ్లు సీసాలో పోత పాలు, ఆవుపాలు, నీరు మాత్రమే పోసి ఇవ్వాలి. పాలలో చక్కెర కలపటం మంచిది కాదు. అలాగే చక్కెర నీళ్లు, పళ్ల రసాలు, తీపి పానీయాలు సీసాలో పోసి ఇవ్వటం తగదు. ఇక తొలి పుట్టినరోజు నుంచి కప్పులో లేదా గ్లాసులో నీళ్లు, పాలు తాగటం అలవడేలా చూసుకోవాలి.

'దంత బల' ఆహారం!

దంత సంరక్షణ, నోటి శుభ్రత అనగానే పళ్లు తోముకోవటం, గార పట్టకుండా చూసుకోవటమే ముందుగా గుర్తుకొస్తాయి. కానీ దంతాలు, చిగుళ్లు.. మొత్తంగా నోటి ఆరోగ్యం విషయంలో ఆహారం కూడా చాలా కీలకపాత్ర పోషిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభించేది ఆహారం ద్వారానే. కాబట్టి ఆహారం పరిశుభ్రంగా, పుష్టికరంగా ఉండేలా చూసుకోవటం తప్పనిసరి.

పాల పళ్లయినా, శాశ్వత దంతాలైనా ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత క్యాల్షియం తప్పనిసరి. వయసు పెరుగుతున్నకొద్దీ పిల్లలకు క్యాల్షియం అవసరాలూ ఎక్కువవుతుంటాయి. అందువల్ల క్యాల్షియం ఎక్కువగా లభించే పాలతో పాటు పెరుగు, పన్నీరు, ఛీజ్‌, కోవా వంటివి ఇవ్వాలి. మునగ, మెంతి, తోటకూర వంటి ఆకు కూరల్లోనూ క్యాల్షియం దండిగా ఉంటుంది. వీటితో పాటు నువ్వులు, పల్లీల వంటి నూనె గింజలు.. శనగలు, పెసలు, అలసందల వంటి ముడి పప్పు దినుసులతో చేసిన పదార్థాలు చేసి ఇవ్వాలి. అలాగే పాల కన్నా ఎక్కువ క్యాల్షియంతో నిండిన రాగులనూ ఆహారంలో చేర్చటం మంచిది. అనుబంధ ఆహారంలో రాగిపిండిని కలుపుకోవచ్చు. కాస్త పెద్ద పిల్లలైతే రాగిలడ్డు, రాగిదోశ, రాగి అంబలి వంటివి చేసి ఇవ్వొచ్చు. రాగి పిండిని ఆవిరి మీద ఉడికించి.. బెల్లం పాకంలో వేసి లడ్డూగా చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో నువ్వులు గానీ పల్లీలు గానీ వేయించి పొడి చేసి కలిపితే మరింత రుచిగా ఉంటాయి. నువ్వులతోనూ క్యాల్షియం ఎక్కువగానే లభిస్తుంది. రాగి పిండి, పచ్చి కొబ్బరి తురుముతో చేసే రాగి పిట్టు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని కేరళ వాళ్లు ఎక్కువగా చేసుకుంటుంటారు.

చిన్న వెదురుగొట్టంలో నీళ్లు చిలకరించిన రాగి పిండిని, దాని మీద కొంత కొబ్బరి తురుమును.. మళ్లీ రాగి పిండి, కొబ్బరి తురుము.. ఇలా పొరలు పొరలుగా పరచి ఆవిరి మీద ఉడికించి పిట్టు తయారుచేస్తారు. దీన్ని ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. రాగిపిండిని బియ్యంతో కలిపి దోశలు.. రాగి అటుకులతో ఖీర్‌ చేసి ఇవ్వచ్చు. కావాలనుకుంటే కేకుల్లో మైదాపిండిని కాస్త తగ్గించి ఆ మేరకు రాగిపిండిని కలుపుకోవచ్చు. దంతాల ఆరోగ్యానికి క్యాల్షియంతో పాటు విటమిన్‌ డి కూడా అవసరమే. కాబట్టి విటమిన్‌ డి లభించే పాలు, గుడ్లు, మాంసాహారులైతే కార్జం ఇవ్వటం మంచిది. పాలు, గుడ్లలో దంతాల తయారీకి అవసరమైన ఫాస్ఫరస్‌ కూడా సరిపడా ఉంటుంది. ఒంటికి ఎండ తగిలేలా ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహిస్తే విటమిన్‌ డి తయారు కావటానికి తోడ్పడుతుంది. దంతాలు పటుత్వానికి చిగుళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. విటమిన్‌ సి లోపిస్తే చిగుళ్ల నుంచి రక్తం రావటం వంటి సమస్యలు తలెత్తొచ్చు. కాబట్టి విటమిన్‌ సితో కూడిన పుల్లటి పండ్లు.. ముఖ్యంగా నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి పండ్లు తినేలా చూసుకోవాలి. ఉసిరికాయ, జామ పండ్లలోనూ విటమిన్‌ సి దండిగా ఉంటుంది. ఇవి రోగనిరోధకశక్తిని పెంచి ఇతరత్రా జబ్బుల బారినపడకుండానూ కాపాడతాయి. పండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది. వీటిని కొరికి తింటే పళ్ల మీద ఎక్కడైనా గార ఉన్నా తొలగిపోతుంది. నమలటం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది సహజంగానే దంతాలను, నోటిని శుభ్రం చేస్తుంది. జీర్ణక్రియ కూడా ఊపందుకుంటుంది.

దంతాలు, చిగుళ్లు మాత్రమే కాదు.. నాలుక, పెదాలు, అంగిలి వంటివి ఆరోగ్యంగా ఉండటమూ కీలకమే. ఇందుకు బి విటమిన్లు ఎంతగానో తోడ్పడతాయి. వీటిల్లో రైబోఫ్లేవిన్‌ (బి2), నయాసిన్‌ (బి3) చాలా ముఖ్యం. రైబోఫ్లేవిన్‌ తగ్గితే నాలుక మీద నంజు పొక్కుల వంటివి పుట్టుకొస్తాయి. దీంతో నాలుక మంట పుడుతుంది. ఆహారం తీసుకోవటానికీ ఇబ్బంది పడతారు. రైబోఫ్లేవిన్‌ లోపంతో పెదాల చివర్లలో చర్మం చిట్లిపోయి.. తెల్లటి పూతలాంటిదీ మొదలవ్వొచ్చు. ఇది బడికి వెళ్లే పిల్లల్లో ఎక్కువ. పాలు, పొట్టుతీయని ధాన్యాలు, చిక్కుళ్లలో రైబోఫ్లేవిన్‌, నయాసిన్‌ ఎక్కువగా ఉంటాయి. దంతాల పటుత్వానికి ఫ్లోరైడ్‌ కొంతవరకు అవసరం. అయితే మనదగ్గర కొన్నిచోట్ల నీటిలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువ. దీంతో పళ్ల మీద పసుపుపచ్చ గీతలు, మచ్చలు ఏర్పడతాయి. పళ్ల పటుత్వమూ దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి చోట్ల ఫ్లోరైడ్‌ తొలగించిన, సురక్షిత నీటిని వాడుకోవటం ఉత్తమం. బాగా వేడిగా, బాగా చల్లగా ఉండే పదార్థాలు పంటి మీదుండే పింగాణి పొరను దెబ్బతీస్తాయి. అందువల్ల సాధారణ ఉష్ణోగ్రతలో ఉండే పదార్థాలు ఇవ్వాలి. ఇలా ఆహారం మీద కాసింత దృష్టి పెడితే పిల్లలను 'దంతబలులు'గా తీర్చిదిద్దుకోవచ్చు.

దంతాల పుట్టుకకు, వాటి పటుత్వానికి పునాది తల్లి కడుపులో ఉన్నప్పుడే పడుతుంది! గర్భిణుల్లో క్యాల్షియం లోపిస్తే దాని ప్రభావం పుట్టబోయే పిల్లల మీదా పడుతుంది. అందువల్ల గర్భిణులు క్యాల్షియంతో కూడిన ఆకుకూరలు, పాలు, గుడ్ల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే అదనంగానూ క్యాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు.. అలాగే కాన్పు తర్వాతా రోజుకు 1200 మి.గ్రా. క్యాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే తల్లిపాల నుంచి శిశువుకు తగినంత క్యాల్షియం లభిస్తుంది. లేకపోతే దంతాలు రావటం ఆలస్యం కావొచ్చు. ఒకవేళ వచ్చినా అంత బలంగా ఉండకపోవచ్చు.

ఇదీ చూడండి:పుట్టుకతో అంగ సమస్యలు.. పట్టించుకోకపోతే ప్రమాదమే!

ABOUT THE AUTHOR

...view details