తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

సీజనల్ వ్యాధులా? ‘ఆయుష్’ మార్గదర్శకాలు ఇవిగో!

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దీనికి తోడు అసలే వర్షా కాలం. ఈ కాలంలో వివిధ వ్యాధుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మోదీ కూడా ఇటీవలే తన ప్రసంగంలో వివరించారు. కరోనాకు తోడు సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాలి.ఈ క్రమంలోనే- కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కాలంలో సాధారణంగా వచ్చే ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లను ఇంట్లోనే ఉండి నివారించడానికి అవసరమైన కొన్ని చిట్కాలను వివరిస్తూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో చూద్దాం రండి.

ayush guidelines to relief from seasonal flu in telugu
సీజనల్ వ్యాధులా? ‘ఆయుష్’ మార్గదర్శకాలు ఇవిగో!

By

Published : Jul 10, 2020, 2:48 PM IST

గోల్డెన్‌ మిల్క్...
పసుపు కలిపిన పాలను 'గోల్డెన్ మిల్క్' అంటారు. పసుపులో యాంటీ సెప్టిక్‌, యాంటీ బయోటిక్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి రోజూ కాచిన పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి. రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా పసుపు వివిధ ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.

ఆవిరి పట్టాలి...

ఆవిరి పట్టడం గురించి మనకు తెలిసిందే. ఆవిరి పట్టడం ద్వారా ముక్కు రంధ్రాలు శుభ్రపడడంతో పాటు జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం పొందచ్చు. దీనికోసం నీళ్లను బాగా మరిగించి దానిలో ఎస్సెన్షియల్ ఆయిల్స్, టీ ట్రీ ఆయిల్, జండూబామ్, పసుపు, పుదీనా ఆకులు వంటి వాటిని వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా వస్త్రాన్ని తలపై కప్పుకొని గిన్నె నుంచి వచ్చే ఆవిరి బయటకు వెళ్లకుండా ముక్కుతో గట్టిగా పీల్చాలి. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు వంటివి తగ్గడమే కాదు.. ఊపిరి తీసుకునేటప్పుడు రిలీఫ్‌గా అనిపిస్తుంది.

అలాగే పుదీనా, నీలగిరి, వాము ఆకులను పేస్ట్‌లాగా తయారు చేసి, దీనిని మెడ దగ్గర అప్లై చేయడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చని ఆయుష్ మంత్రిత్వ శాఖ చెబుతోంది.

మామూలు ఫ్లూనా ? కరోనానా?

కరోనా వైరస్ దేశమంతటా వ్యాపించింది. ఇలాంటి పరిస్థితుల్లో సీజనల్ ఫ్లూ వచ్చినా సరే... కరోనానేమో అన్న భయం చాలామందిని వెంటాడుతోంది. ఎందుకంటే సాధారణ ఫ్లూలో ఉండే లక్షణాలే కరోనా వైరస్ సోకినప్పుడు కూడా ఉండడం ఇందుకు కారణం. కాబట్టి ఈ సమయంలో ఏవిధమైన ఆరోగ్య సమస్య తలెత్తినా మరింత జాగ్రత్తగా ఉండాలంటోందీ ఆయుష్. ఈ క్రమంలో సీజనల్ ఫ్లూలో ఉండే కొన్ని సాధారణ లక్షణాల గురించి సరైన అవగాహన ఉండడం అవసరం.

సీజనల్ ఫ్లూ లక్షణాలు:

  1. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
  2. ముక్కు దిబ్బడ
  3. దగ్గు
  4. ఒళ్లునొప్పులు
  5. తల నొప్పి

ఈ లక్షణాలను గమనించినట్లయితే- మామూలు ఫ్లూనే కదాని అశ్రద్ధ చేయకూడదు. అలాగని అతిగా ఆందోళనా చెందకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో- ఈ లక్షణాలు రెండు మూడు రోజులైనా తగ్గకపోతే మాత్రం వెంటనే ఓ సారి వైద్యుని సంప్రదించడం తప్పనిసరి.


మరి- ఇటు సీజనల్ వ్యాధులతో పాటు కరోనా కూడా విజృంభిస్తున్న ఈ తరుణంలో - పైన చెప్పిన చిట్కాలను పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ఇదీ చూడండి:దీర్ఘాయువులో 'ప్రాణవాయువు' కీలకపాత్ర

ABOUT THE AUTHOR

...view details