తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కళ్ల కింద నల్లటి వలయాలా? ఇలా చేస్తే మాయం! - Ayurveda tips

కళ్ల కింద నల్లటి వలయాలు జీవన విధానంతో పాటు ఆరోగ్యం గురించి కూడా తెలియజేస్తాయి. గుంతకల్ ఆయుర్వేద కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న డా. ఎస్. యాస్మిన్ కళ్ల కింద వలయాల గురించి వివరిస్తూ కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.

dark circles under eyes
కళ్ల కింద నల్లటి వలయాలకు ఆయుర్వేద చిట్కాలు..!

By

Published : Jun 9, 2021, 5:05 PM IST

కళ్ల కింద నల్లటి వలయాలకు ఎన్నో కారణాలుంటాయి. వేళకు ఆహారం తీసుకోకపోవటం, అనారోగ్యకర జీవన విధానం, దీర్ఘకాలం పాటు ఉన్న అనారోగ్యం, జన్యువుల కారణాలు ఉండవచ్చు. కారణం ఏదైనా అవి ముఖాన్ని అందవిహీనం చేస్తాయి కాబట్టి వాటిని నివారించాలని అనుకుంటారు. వీటి నివారణకు, చికిత్సకు ఆయుర్వేదం పలు చిట్కాలను సూచిస్తోంది. వీటిలో కొన్నింటిని ఇంట్లోనే చేసుకోవచ్చు. నస్యకర్మ, నేత్రతర్పణం మొదలైన వాటిని ఆయుర్వేద నిపుణులే నిర్వహించాల్సి ఉంటుంది.

నిదాన పరివర్జన:

వ్యాధిని కలిగించే కారణాన్ని లేదా హేతువును నిదానం అంటాం. పరివర్జన అనగా వదిలివేయటం. కళ్ల కింద నల్లటి వలయాలను నివారించటానికి ఆహారం, దినచర్య విషయంలో మార్పులు తెచ్చుకోవాలి. పుష్టికర ఆహారాన్ని తీసుకోవటం, వేళకు నిద్రించటం, కంప్యూటర్, టీవీ లాంటి తెరలను చూసే సమయాన్ని తగ్గించుకోవటం, అవసరమైనంత నీరు తాగటం, పొగ తాగటం మానివేయటం చేయాలి. ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి వచ్చినా రంగుల కళ్లజోడు వాడటం మంచిది.

  1. కీరదోస:రెండు లేత కీరదోస వలయాలను రెండు కళ్లపై 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. దీనివల్ల కళ్లకింద ఉబ్బు తగ్గుతుంది. కీరదోసలో చర్మపు బిగుతును పెంచే కొలాజన్ సిలికా, సల్ఫర్/భాస్వరం, అనేక విటమిన్​లు ఉంటాయి. ఇవి రక్త నాళాల బిగువును పెంచి నల్లటి వలయాలను తగ్గిస్తాయి.
  2. ప్రలేపం:ముఖంపై మలాముల(క్రీములు)ను పూయటాన్ని ప్రలేపం అంటాం. ఒక చెంచా కరక్కాయ చూర్ణం, అర చెంచా కలబంద గుజ్జు, రెండు చుక్కల బాదాం నూనె కలిపి కళ్ల చుట్టూ రాసి 15 నిమిషాలు ఆగి చల్లని నీటితో కడగాలి. చందనం, అతిమధురం, మంజిష్ట, తేనె కలిపి కూడా కళ్ల కింద రాయవచ్చు.

ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఆచరించాల్సిన చిట్కాలు:

  • అభ్యంగం: రక్త ప్రసరణలో లోపం వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కొబ్బరినూనె, ఆముదం, కుంకుమాది తైలం, శతధౌత ఘృతం, పచ్చి పాలు వీటిలో ఏదైనా తీసుకొని కళ్ల కింద మర్ధన చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ పెరిగి కార్బన్ డై ఆక్సైడ్ కలసిన రక్తం వల్ల కలిగే కాంతి తగ్గి నలుపు తగ్గుతుంది. తేనెను కూడా ఇందుకోసం వాడవచ్చు. దీన్నే అభ్యంగం అంటాం.
  • నస్య కర్మ: ఔషధ తైలాన్ని ముక్కు ద్వారా ఎక్కించటాన్ని నస్య కర్మ అంటారు. సాధారణంగా మెడ, గొంతు ఆరోగ్య సమస్యలకు నస్యకర్మ ఉపయోగపడుతుంది. అణుతైలం లేక కుంకుమాది తైలం వెచ్చటి నీటితో కొద్దిగా వేడి చేసి రెండు చుక్కలను ముక్కులో ఇరువైపులా వేయాలి.
  • నేత్ర తర్పణం:కళ్లకు పోషణను అందించటమే నేత్ర తర్పణం. ఉద్ది పప్పు (మినపప్పు), బార్లీ పిండి, నెయ్యి కలిపి ముద్దగా చేసి కళ్ల చుట్టూ చిన్న గోడలా పెట్టాలి. నెయ్యి కానీ, ఔషధ తైలం కానీ కంటి చుట్టూ ఉన్న పిండితో చేసిన వలయంలో పోసి కాసేపు అలాగే ఉంచాలి. తరువాత పిండిని, తైలాన్ని తీసివేయాలి. ఈ పద్ధతులను పంచకర్మ నిర్వహించే ఆసుపత్రులలోనే చేయాలి.

ఇదీ చదవండి:అప్పుడే జుట్టు తెల్లపడిపోతోందా.. మరేం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details