Walking Doubts: నడక అనగానే చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. సాధారణంగా ఉదయం పూట నడవటం మంచిదని, ఎందుకంటే ఉదయం వేళ కాలుష్యం తక్కువగా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. చల్లటి, తాజా గాలి మనసుకు ఉత్తేజం కలిగిస్తుందని కూడా అంటారు. అయితే పరగడుపున నడవాలా? లేక ఏదైనా తిన్నాక వాకింగ్ చేయాలా? వంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి. వీటిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.
"పరగడుపున నడవాలా అంటే అవసరం లేదు. చిన్న బ్రెడ్డు ముక్కలాంటిది తిని నడవొచ్చు. మధుమేహంతో బాధపడేవారికిది మరీ ముఖ్యం. ఇలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పడిపోతాయనే భయం ఉండదు. అలాగని ఎవరైనా సరే కడుపు నిండా తిని నడవటం మంచిది కాదు. భోజనం చేసినప్పుడు జీర్ణకోశ వ్యవస్థకు రక్త ప్రసరణ బాగా జరగాలి. కడుపు నిండా తిని వడివడిగా నడిస్తే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది మంచిది కాదు. సాయంత్రం పూట నడవకూడదనేమీ లేదు. ఇదేమీ నిషిద్ధం కాదు. కాకపోతే పొద్దుట్నుంచీ పనిచేసి ఉండటం వల్ల శరీరం అలసిపోయి ఉంటుంది. దీంతో నడక అంత ఉత్సాహంగా సాగదు."
-- డా. ఎ.అశ్వినీ కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్