ఈ మధ్యకాలంలో చాలామందిలో థైరాయిడ్ సమస్యలు కనిపిస్తున్నాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాల వల్ల కలుగుతున్న సమస్యల (Thyroid Symptoms) కోసం ఆసుపత్రికి వెళ్తే.. అసలు విషయం బయటపడుతున్న సందర్భాలు అనేకం. మెడ భాగంలో ముందువైపు సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్ శరీరంలోని ప్రతి కణంపైనా తన ప్రభావాన్ని చూపి ఎన్నో పనులు సవ్యంగా జరిగేలా చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ, తక్కువ కాకుండా తగినంత ఉండాలి. అలా జరగనప్పుడు దాని పనితీరులో లోపాల వల్ల అనేక సమస్యలు (Thyroid Problems) చుట్టుముడతాయి. అందులో బరువు పెరుగుదల ఒకటి.
థైరాయిడ్‌కు, బరువు పెరగడానికి సంబంధమేంటి? - హైపోథైరాయిడ్‌కు కారణాలు
థైరాయిడ్ సమస్య ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తోంది. అధిక బరువు వంటి సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళితే థైరాయిడ్ లోపం అంటున్నారు. అసలు.. థైరాయిడ్‌కు అధిక బరువుకు (thyroid weight) సంబంధం ఏంటి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
అవసరమైన దాని కంటే.. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నప్పుడు అలాంటి పరిస్థితిని హైపర్ థైరాయిడిజమని (Hyperthyroidism), సాధారణ స్థాయి కంటే తక్కువగా థైరాయిడ్ హార్మోన్ ఉన్నప్పుడు హైపో థైరాయిడిజమని (Hypothyroidism) అంటారు. థైరాయిడ్ హార్మోన్ శరీరంలో ప్రతి అవయవానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో జీవక్రియలు సవ్యంగా సాగుతాయి. హైపో థైరాయిడిజం వల్ల హార్మోన్ లోపించి జీవక్రియలు దెబ్బతింటాయి. ఆ కారణంగా శరీర బరువు (thyroid weight gain) పెరుగుతుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్స్ను వాడటం ద్వారా ఈ సమస్యను జయించవచ్చు. హైపో థైరాయిడ్ సమస్య లేకుండా బరువు పెరిగితే.. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. తినే ఆహారం, సరిగా నిద్రపోకపోవటం వంటి జీవనశైలి కారణాలుండవచ్చు.