శృంగారాన్ని చీకటి వ్యవహారంగానే చూస్తున్నాం. చాటుమాటు తంతుగానే దాచేస్తున్నాం. అభంశుభం తెలీని పసిబిడ్డల వయసు నుంచీ ఛీచ్ఛీ అంటున్నాం. నవయవ్వన ఘడియల్లో ఇవ్వాల్సిన విజ్ఞానం ఇవ్వటం లేదు. దాంపత్యంలోనూ దాగుడుమూతలే ఆడుతున్నాం. ఇక మలివయసులో ఇదేం ముచ్చటని (Sexual Interest) ఈసడించేస్తున్నాం. ప్రతి దశలోనూ మన ధోరణి అశాస్త్రీయంగానే సాగుతోంది. శాస్త్రీయమైన అవగాహనతో.. చక్కటి శృంగార జీవితాన్ని బాధ్యతాయుతంగా ఆస్వాదించేలా చెయ్యటం ఒక్కటే దీనికి సరైన విరుగుడు. అందుకే దీనికి సంబంధించిన వివరాలను సరళంగా మీ ముందుకు తెస్తోంది ఈటీవీ భారత్.
మనలో చాలామంది గుండె జబ్బు వచ్చినప్పుడే గుండె గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎముకలు విరిగినపుడే వాటి గురించి పట్టించుకుంటారు. ఏదైనా అంతేగానీ.. ఒక్క శృంగారం విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. చాలామంది ప్రతి రోజూ, రోజులో ఎన్నో సార్లు దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ముఖ్యంగా భాగస్వామితో తన సంబంధాలు బాగానే ఉన్నాయా? సంతృప్తిగానే ఉందా? లేక పరిస్థితి ఎక్కడైనా గాడి తప్పుతోందా అన్న ఆలోచన రోజులో ఎన్నోసార్లు పలకరిస్తూనే ఉంటుంది. మన జీవితంలో శృంగారానికి ఉన్న ప్రాముఖ్యం అంతటిది. కానీ దురదృష్టవశాత్తూ మన సమాజంలో లైంగిక ఆరోగ్యానికి దక్కాల్సినంత గౌరవం, మన్నన దక్కకుండా పోతున్నాయి.
మన సంస్కృతిలో సెక్స్ పట్ల రకరకాల వైరుధ్య భావనలు రాజ్యమేలుతున్నాయి. శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది, అందరూ లైంగిక చర్యల పట్ల అనురక్తి కనబరుస్తూనే ఉంటారు. కానీ శృంగారం గురించి బయటకు మాట్లాడటానికి వచ్చేసరికి మాత్రం అంతా 'ఛీ చ్ఛీ' అంటుంటారు. ఇలా చీదరించుకునే వారు, ముఖం చిట్లించుకునేవారు, ఇటువంటి విరుద్ధ భావాల్లో కొట్టుమిట్టాడుతూ ఉండేవారు... ఎప్పుడూ కూడా లైంగిక జీవితంలో తాము పొందాల్సినంతటి ఆనందాన్ని పొందలేరు. భాగస్వామికీ ఇవ్వాల్సినంతటి తృప్తిని ఇవ్వలేరు. శృంగారాన్ని అపోహల నుంచి బయటకు తీసుకువచ్చి, దీన్నొక శాస్త్రంగా అర్థం చేసుకోవటం చాలా అవసరం. శృంగార వృక్షానికి చిన్నతనం నుంచే బీజాలు పడాలి. నవయవ్వనం నుంచీ వృద్ధాప్యం వరకూ ప్రతి దశలోనూ దాన్ని ఆరోగ్యకరంగా, బాధ్యతాయుతంగా పెంచి పోషించుకుంటూ రావాలి.
పసివయసు ముచ్చట
ఆశ్చర్యకరంగా అనిపించినా.. శృంగార, సాన్నిహిత్య భావనల పట్ల మనిషికి ఆసక్తి పసితనం నుంచే మొదలవుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఒకరినొకరు తాకటం, కౌగిలించుకోవటం వంటివన్నీ పిల్లలు బాల్యం నుంచే ఒక కంట గమనిస్తుంటారు. ఇలాంటి పిల్లల్లో ప్రేమాస్పదనమైన భావనలు సహజంగానే పుట్టుకొస్తుంటాయి. అసలు ఒకరిపై ఒకరు ఎలాంటి ప్రేమలూ ప్రదర్శించని, ఎడమొగం పెడమొగంగా ఉండే తల్లిదండ్రుల మధ్య పెరిగిన పిల్లలు.. పెద్దయ్యాక తామూ అంతే జడంగా తయారవుతుంటారు. కుటుంబంలో స్త్రీపురుషుల మధ్య సంబంధాలు ఎంతటి అన్యోన్యంగా, ఆనందంగా ఉంటాయో తెలియకుండా పెరిగే పిల్లలు.. బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు సరైన ఆలోచనా ధోరణి కొరవడి, ఏం చెయ్యాలో తెలియక.. పెడతోవ పట్టే ప్రమాదం ఉంటుంది. పుస్తకాలను చదివి అరకొర విషయాలను నేర్చుకోవటం, సినిమాలను చూసి అదే నిజమని భావించటం వంటివన్నీ వారిని రకరకాల సాహసాలకు పురిగొల్పుతుంటాయి.
పసిబిడ్డలు తమ శరీరంలో ఇతరత్రా భాగాలను తాకినట్లుగానే జననాంగాల మీదా చేతులు పెట్టుకోవటం సహజం. అందులో పెద్ద తప్పేమీ లేదు. కానీ దాన్ని చూస్తూనే ఇంట్లో పెద్దవాళ్లు 'చ్ఛీ చ్ఛీ' అంటూ చటుక్కున చెయ్యి తీసేయిస్తుంటారు. పసివయసులో ఎదురయ్యే ఇలాంటి అసాధారణ అనుభవాల ప్రభావం- పిల్లల మీద బలంగా ఉంటుంది. ఇది మున్ముందు వాళ్ల లైంగిక ధోరణులను, ఆలోచనలను ఎంతో ప్రభావితం చేస్తుందని గుర్తించాలి. అందుకని ఇలాంటి విషయాల్లో పెద్దలు అవగాహనతో మెలుగుతూ.. పిల్లలను చక్కటి 'రేపటి' కోసం సంసిద్ధం చెయ్యటం చాలా అవసరం.
యవ్వన ఘడియలు
యుక్తవయసులో అడుగుపెట్టే తరుణంలో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు వస్తుంటాయి. కానీ మన సమాజంలో- ఈ మార్పుల గురించి పిల్లలను ఏ రకంగానూ సన్నద్ధం చెయ్యటం లేదు. దీనివల్ల ఏదో ఒక రోజు ఉన్నట్టుండి అబ్బాయి అంగం నుంచి తెల్లటి స్రావం వస్తుంటే చూసి గాభరా పడిపోవటం, ఆడపిల్లలైతే ఉన్నట్టుండి రుతుస్రావం జరిగితే తమకేదో జరిగిపోయిందని బెంబేలెత్తిపోవటం వంటి అనుభవాలు సర్వసాధారణమవుతున్నాయి. అప్పటి వరకూ కేవలం మూత్ర విసర్జన మాత్రమే జరుగుతుండే అవయవం నుంచి తెల్లటి, చిక్కటి స్రావం వస్తుంటే ఎవరు మాత్రం కంగారుపడరు? వీటి గురించి ముందే పిల్లలను మానసికంగా కొంత సంసిద్ధులను చేస్తే ఈ గందరగోళాలుండవు. జననాంగాల వద్ద సన్నటి రోమాలు మొలుస్తుండటం, అమ్మాయిల్లో రొమ్ములు పెరగటం.. ఇలాంటివన్నీ సహజమైన మార్పులని పిల్లలకు కాస్తముందు నుంచే అవగాహన ఉండాలి. అబ్బాయిలకు ఉదయాన్నే నిద్రలేవటానికి ముందు అంగం గట్టిపడుతుండొచ్చు.
ఆడపిల్లలకు తమ జననాంగాలను ముట్టుకోవాలని అనిపిస్తుండొచ్చు. ఇలాంటి మార్పులను చూసి పిల్లలు ఆశ్చర్యానికి, భయభ్రాంతులకు, లేదంటే సిగ్గుపడే పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి పిల్లలు యుక్తవయసుకు దగ్గర అవుతున్న దశలోనే తల్లిదండ్రులు వారితో అనునయంగా మాట్లాడుతూ- మీ శరీరాల్లో మున్ముందు ఇలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది, ఇవి ప్రకృతి సహజమైన మార్పులే, మనల్ని పునరుత్పత్తి, సంతానం కోసం.. సరికొత్త పాత్రల కోసం సంసిద్ధం చేసే మార్పులివి.. అని వివరిస్తే పిల్లల మనసుల్లో గందరగోళాలకు ఆస్కారం ఉండదు. అమ్మాయిలకు రుతుక్రమం గురించి, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించటం చాలా అవసరం. తల్లిదండ్రులీ పని చెయ్యకపోతే.. వాళ్లు స్నేహితుల ద్వారానో, పుస్తకాలు చదివో ఏవేవో అరకొర విషయాలు తెలుసుకుని, అవే నిజమనుకొని భ్రమల్లోనూ, భయాల్లోనూ కూరుకుని తమ విలువైన సమయాన్ని వృథా చేసుకునే ప్రమాదముంది. ఇవన్నీ మున్ముందు లైంగిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని గుర్తించాలి.
ఈ రెండూ పోవాలి!
'శృంగారం అనగానే దాన్నో మురికిపనిలా చూస్తూ 'ఛీ చ్ఛీ' అనటం.. లేదంటే దాన్నో 'మజా, థ్రిల్లు' వ్యవహారంగా చూడటం.. ఈ రెండు ధోరణులూ తప్పే. ఈ రెండూ పోవాలి. ఏ నాగరీక సమాజమూ కూడా శృంగారాన్ని ఛీఛీ అనదు. దాన్ని మానవ జీవితాల్లో అత్యంత కీలకమైన అంశంగా స్వీకరిస్తుంది. అంతేకాదు, దాన్ని సామాజిక జీవితంలోనూ ముఖ్యమైన అంశంగా గుర్తిస్తుంది. మన పూర్వీకులు కూడా శృంగారాన్ని ఓ అత్యద్భుత కార్యంగా భావించారు. దాన్నో శాస్త్రంలాగా, మానవ మనుగడకు అవసరమైన గౌరవప్రదమైన విజ్ఞానంగా గుర్తించారు. కామసూత్రమే ఇందుకు తార్కాణం. ఇంతటి విశాల దృక్పథం కాస్తా కాలక్రమంలో కుచించుకుపోయి.. క్రమేపీ అపోహల్లోకీ, అర్థరహిత భావనల్లోకీ జారిపోయింది. దీంతో శృంగారమన్నది అన్యోన్యమైన ఆనందాన్నిచ్చే అంశమని కూడా చాలామంది తెలుసుకోవటం లేదు. అదేదో హడావుడిగా చీకట్లో ముగించెయ్యాలన్న తొందరపాటు ధోరణిలో కొట్టుకుపోయే వారూ ఉన్నారు. నిజమైన శృంగారం ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలను ప్రోత్సహిస్తుంది!