ఒకవైపు రోజురోజుకీ ఎక్కువవుతున్న కొవిడ్-19 కేసులు. మరోవైపు పెరిగిపోతున్న మరణాలు. ఆసుపత్రుల్లో రద్దీ పెరగటం.. సదుపాయాలు, చికిత్సలు సత్వరం అందకపోవటం వంటి దృశ్యాలు భయానక పరిస్థితికే అద్దం పడుతున్నాయి. ఇంతటి భీతావహ వాతావరణంలోనూ టీకా ఒక్కటే ఆశాజనకంగా, తిరుగులేని బ్రహ్మాస్త్రంలా అభయమిస్తోంది. నిజానికి టీకా సైతం కొవిడ్-19 కారక సార్స్-కోవీ2 లాంటిదే. కాకపోతే ప్రమాదకరం కాదు. ఎలాంటి హాని చేయకుండానే మనలో రోగనిరోధకశక్తిని ఉత్తేజితం చేస్తుంది. యాంటీబాడీలు పుట్టుకొచ్చేలా చేసి మున్ముందు ఇన్‌ఫెక్షన్ బారినపడకుండా.. ఒకవేళ ఇన్‌ఫెక్షన్ తలెత్తినా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా కాపాడుతుంది.
టీకాపై సందేహాలా? ఇవిగో సమాధానాలు... - కరోనా టీకాలపై సందేహాలు
అందరూ కోరుకున్నట్టుగానే, అనతికాలంలోనే 18 ఏళ్లు పైబడ్డవారికీ కొవిడ్-19 టీకా అందుబాటులోకి వచ్చింది. కరోనా మీద వీలైనంత త్వరగా, సమర్థంగా విజయం సాధించటంలో ఇది అత్యంత కీలక పరిణామం అనటం నిస్సందేహం. మన దేశంలో యువతీ యువకుల సంఖ్య ఎక్కువ. ఇలాంటి చిన్న వయసు వారంతా టీకాలు తీసుకుంటే కరోనా పీచమణచటానికి ఎంతో సమయం పట్టదు. సరైన అవగాహనతో, తగు జాగ్రత్తలతో టీకా తీసుకోవటమే ఇప్పుడందరి కర్తవ్యం కావాలి. కాకపోతే తెలిసో తెలియకో కొందరు కొవిడ్-19 టీకా విషయంలో ఇప్పటికీ అనేక రకాలుగా సందేహిస్తుండటం విచారకరం. ఇది తగదు. తప్పుడు ప్రచారాల మూలంగా భయాల్లో మునిగిపోవటం ఎంతమాత్రం మంచిది కాదు.
కరోనా టీకా, సందేహాలు
అయితే ఆరోగ్యవంతుల దగ్గర్నుంచి మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా, అలర్జీల వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారి వరకూ అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న. టీకా తీసుకోవాలా? వద్దా? తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పటికే మన దగ్గర దాదాపు 16 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. అయినా ఇంకా సందేహాలు ఎందుకు? ఏదైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకొని, ముందుకు సాగటమే తక్షణం చేయాల్సిన పని.