Amla Health Benefits In Telugu :ఉసిరి- మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న కాయల్లో ఒకటి. ఇది మనకు విరివిగా దొరుకుతుంది. కానీ దీనిని మాత్రం చాలా తక్కువగా తింటుంటాం. ఎప్పుడూ మనకు అందుబాటులో తక్కువ ధరలో ఉండే ఈ ఉసిరిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఉసిరి చూడటానికి చిన్నగా ఉన్నా కానీ ఇందులోని పోషకాహార విలువలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటి ఉసిరిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మలబద్ధకం దూరం!
చలికాలంలో ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. 100 గ్రాముల తాజా ఉసిరి కాయలు 20 నారింజ పండ్లతో సమానం. ఉసిరి పండ్లలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్- సి ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి అనారోగ్యాల నుంచైనా సులువుగా కోలుకోవచ్చు. ఇందులోని ఫ్లావనాయిడ్స్ రసాయనాలు జ్ఞాపక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. వీటిలో నీటిలో కరిగే కొవ్వు ఉండటం వల్ల అది రక్తంలో చక్కెర తొందరగా కరగకుండా చేస్తుంది. దీంతో రక్తంలో షుగర్ స్థాయులు అదుపులో ఉంటాయి. ఉసిరిలో ఉండే పీచు పదార్థం మలబద్ధకం సమస్యనూ దూరం చేస్తుంది.
ఎన్నో ఆరోగ్య లాభాలు!
నారింజతో పోలిస్తే- ఉసిరిలో విటమిన్- సి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్, ఇతర కణాల్ని తొలగించడంలో ఉసిరి సాయపడుతుంది. శరీరం లోపల జరిగే నష్టాల నుంచి కోలుకోవడానికి ఉసిరి సాయం చేస్తుంది. ఉసిరిలో ఉండే పీచు పదార్థం జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఎండు ఉసిరి లేదా పౌడర్ రూపంలో ఉన్న ఉసిరి సైతం తీసుకోవచ్చు. రోజూ ఉసిరిని తినడం వల్ల మనకు సి-విటమిన్ లోపం రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా కళ్లు, జుట్టు, చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది.