తెలంగాణ

telangana

డ్రైవింగ్‌లో అల్జీమర్స్‌ సూచికలు!

By

Published : Jul 29, 2021, 9:42 AM IST

వృద్ధాప్యంలో ఉన్నవారు మునుపటిలా డ్రైవింగ్ చేయలేకపోతుంటే వారిని ఓ కంట కనిపెట్టుకుని ఉండాల్సిందేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ వయసులో వారు వాహనాలు నడపకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇతర ఆరోగ్య సమస్యల వల్ల వృద్ధులకు అల్జీమర్స్ రావొచ్చని హెచ్చరిస్తున్నారు.

alzheimer
అల్జీమర్స్‌

వయసు మీద పడుతున్నకొద్దీ వాహనాలను నడిపే తీరూ మారుతూ వస్తుంటుంది. చూపు మందగించటం, కండరాలు బిగువెక్కటం వల్ల చురుకుదనమూ తగ్గొచ్చు. వీటితో డ్రైవింగ్‌ తీరు మారటం సహజమే. కానీ వాహనాలను మునుపటి కన్నా తక్కువ వేగంతో నడపటం, రాత్రిపూట తక్కువగా ప్రయాణించటం వంటి మార్పులను గమనిస్తే జాగ్రత్త పడాల్సిందే. ఇవి అల్జీమర్స్‌కు తొలి సంకేతాలు కావొచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో అధ్యయనం పేర్కొంటోంది.

మనం అలవోకగా వాహనాలు నడుపుతుంటాం గానీ ఇందుకు మెదడు, కళ్లు చురుకుగా పనిచేస్తుండాలి. పరిస్థితులకు తగ్గట్టు వేగం తగ్గించటం, పెంచటం వంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మెదడు ఆరోగ్యానికి సూచికలే. ఇవి డ్రైవింగ్‌ తీరులోనూ ప్రతిఫలిస్తాయి. అందుకే 65 ఏళ్లు పైబడిన కొందరిని ఎంచుకొని పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో సుమారు సగం మందిలో మునుపటి కన్నా మరీ నెమ్మదిగా నడపటం.. ఉన్నట్టుండి బ్రేకులు వేయటం, దారి మార్చటం వంటి మార్పులను గుర్తించారు. ఇవి అల్జీమర్స్‌ తొలిదశకు సూచనలు కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

అల్జీమర్స్‌ మరీ తొలిదశలో ఉన్నవారు రాత్రిపూటే కాదు, మొత్తానికే తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నట్టు తేలింది. అంతేకాదు, కొద్ది ప్రాంతాలకే వెళ్తున్నట్టు.. ప్రత్యేకించి కొన్ని దారుల్లోనే ప్రయాణిస్తున్నట్టూ బయటపడింది. విషయ గ్రహణ సామర్థ్యం తగ్గినవారు మార్గ సూచికలను అనుసరించటంలో ఇబ్బంది పడటం, ఆయా ప్రాంతాల్లో తప్పిపోతుండటం దీనికి కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. ఎక్కువసార్లు గట్టిగా బ్రేకులు వేస్తుండటం డిమెన్షియాకు తొలి సంకేతం కావొచ్చని గతంలో కొలంబియా యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనమూ పేర్కొంటోంది.

అందువల్ల పెద్దవారిలో ఇలాంటి మార్పులను కుటుంబ సభ్యులు గమనిస్తే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details