తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బాదం తినండి.. బరువు తగ్గండి..! - బాదంతో మెరుగైన ఆరోగ్యం

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఈజీగా బరువు పెరిగిపోతున్నారు. సన్నగా మారడం కోసం రకరకాల డైట్ ప్లాన్లను ఫాలో అవుతున్నారు. పొట్ట మాడ్చుకుంటున్నారు. సరైన ఆహరం తీసుకున్నంత వరకూ పర్లేదు కానీ.. డైట్‌లో తేడా వస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకోసమే.. డైట్‌లో ఓ గుప్పెడు బాదం జోడించమంటున్నారు నిపుణులు. దానివల్ల మెరుగైన ఆరోగ్యంతో పాటు బరువూ తగ్గొచ్చని అంటున్నారు. ఎన్నో పోషకాలతో మిళితమైన బాదం పప్పు.. బరువు తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి.

Almonds are good for weight loss says experts
బాదం తినండి.. బరువు తగ్గండి..!

By

Published : Mar 27, 2021, 9:44 AM IST

డ్రైఫ్రూట్స్ విషయంలో చాలామందికి వివిధ అపోహలుంటాయి. ఇవి తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావవుతామని, ఫలితంగా లేనిపోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుందని కొంతమంది భావిస్తారు. అయితే బాదం విషయంలో ఈ అపోహలన్నీ సరికాదని నిరూపించిందో అధ్యయనం. అంతేకాదు.. రోజూ దాదాపు 43 గ్రాముల బాదం పప్పును నూనె లేకుండా వేయించి, కాస్త ఉప్పు చల్లి.. నాలుగు వారాల పాటు తీసుకోవడం వల్ల బరువు పెరగకుండానే, శరీరానికి ఉపయోగపడే విటమిన్ 'ఇ'తో పాటు మోనో అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు, మంచి కొవ్వులు వృద్ధి చెందుతాయని వెల్లడించింది. మహిళల్లో అప్పుడప్పుడు బాదం పప్పు తినే వారి కంటే వారానికి దాదాపు 90 బాదం పప్పుల్ని తినేవారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 35 శాతం తక్కువని కూడా తేలింది. బాదంలో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉండడమే ఇందుకు కారణం.


మంచి స్నాక్
ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా లేదంటే బయటికి వెళ్లినప్పుడైనా సాయంత్రం పూట స్నాక్స్ తినందే కొందరు ఉండలేరు. అందుకే ఈ సమయంలో వారికి నచ్చినవేవో చేసుకొని లేదా బయటికి వెళ్తే కొనుక్కొని ఆరగిస్తుంటారు. ముఖ్యంగా ఇంట్లోనైతే పకోడి, మిర్చి బజ్జీ.. వంటి నూనె సంబంధిత పదార్థాలు తినడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. మరి బయటికెళ్లినప్పుడో.. ఏ చాట్ బండినో ఆశ్రయిస్తుంటారు. అయితే ఇవి అంత ఆరోగ్యకరం కాకపోవచ్చు. కాబట్టి వీటిన్నింటికి బదులు ఓ గుప్పెడు బాదం పప్పుల్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం కడుపు నిండుగా ఉండేలా చేసి ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది. తద్వారా ఇతర ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి సాయంత్రం స్నాక్స్ సమయంలో గుప్పెడు బాదం పప్పుల్ని తినడం అలవాటుగా మార్చుకోండి. ఉద్యోగినులైతే ఓ చిన్న డబ్బాలో ప్యాక్ చేసుకొని వెళ్తే సరి. ఎంచక్కా ఓవైపు పనిచేసుకుంటూనే మరోవైపు బాదం పప్పుల్ని లాగించేయవచ్చు. ఏమంటారు?


కడుపు నిండుగా..
కొంతమంది ఉదయం పూట సమయం సరిపోక బ్రేక్‌ఫాస్ట్ మానేయడం లేదంటే తక్కువగా తినడం.. వంటివి చేస్తుంటారు. ఫలితంగా మధ్యాహ్న భోజన సమయం కంటే ముందుగానే ఆకలేస్తుంటుంది. దాంతో భోజనానికి ముందు ఏ చిప్సో, బిస్కట్లో.. లాగించేస్తుంటారు. తద్వారా లంచ్ సమయానికి ఆకలేయదు సరికదా.. వీటితో బరువు పెరిగే అవకాశమూ లేకపోలేదు. అందుకే ఉదయాన్నే కాస్త కడుపు నిండుగా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌ని తీసుకుంటే సరిపోతుంది కదా.. అదెలా అనుకుంటున్నారా..? మీరు తినే ఉప్మా, ఓట్‌మీల్, కిచిడీ, నూడుల్స్.. వంటి బ్రేక్‌ఫాస్ట్‌లో బాదం పప్పును చల్లుకోవడం లేదంటే బ్రేక్‌ఫాస్ట్ పూర్తయిన తర్వాత కొన్ని బాదం పప్పుల్ని తినడం వల్ల కడుపు నిండుగా అనిపించి చాలా సేపటి వరకు ఆకలేయకుండా ఉంటుంది. తద్వారా ఏది పడితే అది తినకుండా ఉండి.. బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.


పొట్ట తగ్గాలంటే..!
'నాకీ మధ్య పొట్ట విపరీతంగా పెరిగిపోతోంది.. రోజూ రాత్రి పూట అన్నం మానేసి చపాతీ తినాలి..' అనుకుంటారు చాలామంది. ఇలా ఇంట్లో, ఆఫీసులో ఎక్కువ సమయం కూర్చొనే ఉండడం వల్ల ప్రస్తుతం చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి దీన్ని తగ్గించుకునే క్రమంలో వివిధ వ్యాయామాలు చేసే వారూ లేకపోలేదు. దాంతో పాటు రోజూ బాదం పప్పుల్ని కూడా తినడం అలవాటు చేసుకుంటే పొట్ట భాగంలో పెరిగిపోయిన కొవ్వుల్ని ఇట్టే తగ్గించుకోవచ్చు. దీనికి ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ కొవ్వులే కారణం. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలపై దాడి చేసి దాన్ని క్రమంగా తగ్గించేస్తాయి. ఈ క్రమంలో పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వులు కూడా కరిగి.. నాజూకైన నడుమును సొంతం చేసుకోవచ్చు.


ఎలాగైనా తినచ్చు..
బాదం పప్పు మామూలుగా తింటేనే బరువు పెరుగుతామనుకుంటారు చాలామంది. అలాంటిది వేయించుకుని తింటే.. అంటారా? వేయించుకొని తిన్నా బరువు తగ్గుతారంటున్నారు నిపుణులు. అయితే అది కూడా నూనె లేకుండానే..! ఈ క్రమంలో నూనె లేకుండా వేయించిన బాదం పప్పైనా, నానబెట్టినవైనా, నేరుగా తిన్నా.. ఇలా ఎలా తీసుకున్నా.. వాటిలోని క్యాలరీల్లో ఎక్కువ, తక్కువలేమీ ఉండవు. కాబట్టి ఎలాంటి సంకోచాలూ లేకుండా బాదం పప్పుని ఈ మూడు పద్ధతుల్లో మీకు నచ్చినట్లుగా తినొచ్చు అంటున్నారు నిపుణులు. తద్వారా అందులోని పోషకాలతో ఆరోగ్యాన్ని పొందచ్చు. అంతేకాదు.. ఈ తక్కువ క్యాలరీలున్న పదార్థంతో బరువూ తగ్గచ్చు.

ఇవి కూడా..

* బాదంలోని మెగ్నీషియం రక్తంలోని చక్కెరల్ని అదుపు చేస్తుంది. తద్వారా ఆహారం ఎక్కువగా తినాలన్న కోరిక తగ్గుతుంది.
* శరీరంలోని చెడు కొవ్వుల్ని తగ్గించి, మంచి కొవ్వుల్ని పెంచే శక్తి బాదం పప్పుకి ఉంది. తద్వారా బరువు అదుపులో ఉండడంతో పాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
* రాత్రంతా నానబెట్టిన బాదం పప్పుల్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. బాదం నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తవుతుంది. ఇది మన ఆహారం ద్వారా తీసుకున్న కొవ్వులు కరిగేందుకు దోహదపడుతుంది.

ఇదీ చదవండి:'రాష్ట్రంపై సూర్యుడి సెగ.. రానున్న 3 రోజులు భగభగలే..'

ABOUT THE AUTHOR

...view details