చిన్న మార్పయినా చాలు.. పెద్ద ఫలితమే చూపిస్తుంది. కరోనా జబ్బు విషయంలోనూ ఇది ముమ్మాటికి నిజం. ఉదాహరణకు గాలి ప్రవాహాన్నే తీసుకోండి. భవనాల్లో గానీ ఇళ్లలో గానీ ధారాళంగా గాలి వచ్చేలా చూసుకుంటే కొవిడ్-19 ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చు. కరోనా వైరస్ గాలిలో కలిసే తుంపర్ల ద్వారానూ వ్యాపించొచ్చు. ఇది వైరస్ వ్యాప్తికి ఎంతవరకు దోహదం చేస్తుందన్నది కచ్చితంగా తెలియదు గానీ ముప్పయితే పొంచి ఉంటుందన్నది మాత్రం ఖాయం. గాలి, వెలుతురు అంతగాలేని చోట్ల ఎవరైనా కరోనా బాధితులు ఉన్నారంటే.. అక్కడ ఎక్కువసేపు గడిపిన ఇతరులకూ వైరస్ అంటుకునే అవకాశం ఎక్కువ. చాలామంది ఉద్యోగులు, కార్మికులు పనిచేసే చోట్ల ఇలాంటి ప్రమాదం లేకపోలేదు. అందుకే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటం, ఇతరులకు దూరాన్ని పాటించటం వంటి వాటితో పాటు గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలన్నది నిపుణుల సూచన.
చిన్న తుంపర్లలోనూ వైరస్..
వైరస్ బయటకు వెళ్లటానికి గాలి ఎంతగానో ఉపయోగపడుతుంది. కరోనా బారినపడ్డవారు దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా, పాడినా, చివరికి శ్వాస వదిలినప్పుడూ తుంపర్లు బయటకు వస్తాయి. వీటిల్లోని వైరస్ గాలిలోనూ కలుస్తుంది. ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ముఖ్యంగా కరోనా బాధితులకు దగ్గరగా ఉన్నవారికి కళ్లు, నోరు, ముక్కు ద్వారా వైరస్ అంటుకునే అవకాశముంటుంది. కరోనా చికిత్స కేంద్రాల్లో బాధితులకు శ్వాసమార్గంలో గొట్టాన్ని అమర్చటం వంటి సందర్భాల్లోనే చిన్న తుంపర్ల ద్వారా వైరస్ గాలిలో కలిసే అవకాశముంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంటోంది. కానీ.. భవనాలు, కార్యాలయాలు, హోటళ్లలోనూ చిన్న తుంపర్లతో వైరస్ వ్యాపించొచ్చు.