మనుషులను ప్రశాంతంగా ఉండనివ్వదు ఎసిడిటీ. భోజనం చేయబుద్ధి కాదు, ఒకవేళ తిన్నా అది అరగదు. ఎసిడిటీ బాధితులు అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. అలాంటి ఈ సమస్యను పూర్తిగా తొలగించలేం. కానీ కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం వంటివి చేస్తూ ఉండాలి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న కొన్ని చిట్కాలు పాటిస్తే ఎసిడిటీ నుంచి మీకు తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
అల్లం
అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎసిడిటీ వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించే శక్తి అల్లానికి ఉంది. రోజూ ఒక అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమలాలి. లేదా దీన్ని టీలో కలుపుకుని అయినా తీసుకోవాలి.
కలబంద రసం
ఎసిడిటీ వల్ల కలిగే చికాకు తదితర సమస్యలను తగ్గించే సామర్థ్యం కలబందకు ఉంది. రోజూ భోజనానికి ముందు ఒక కప్పు కలబంద జ్యూస్ తీసుకుంటే ఎసిడిటీని తరిమికొట్టొచ్చు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అరటి పండ్లు
అరటి పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఆమ్లత్వాన్ని తగ్గించే సహజ గుణాలు అరటిలో ఉన్నాయి. కాబట్టి రోజూ ఒకట్రెండు అరటి పండ్లు తినాలి. నేరుగా తినకున్నా జ్యూస్‌గా చేసుకుని తాగినా మంచిదే.
సోంపు గింజలు
ఎసిడిటీతో బాధపడేవారు సోంపును తరచూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత చెంచాడు సోంపు గింజలను నోట్లో వేసుకుని నమలాలి. వీటితో టీ చేసుకుని తాగినా మంచి ఫలితాలు కనిపిస్తాయి.