మూత్ర సంబంధ వ్యాధుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మూత్రాశ్మరి.. అదే కిడ్నీ రాళ్ల గురించే. అశ్మ అంటే రాయి, అరి అంటే శత్రువు అని అర్థం. శత్రువు మాదిరిగా కిడ్నీ రాయి లోలోపలే తెగ వేధిస్తుంది కాబట్టే మూత్రాశ్మరి అని పేరు. మూత్రం తయారీలో కిడ్నీల కన్నా జీర్ణకోశ వ్యవస్థే (మహాస్రోతస్సు) కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణకోశం బాగుంటేనే మల విసర్జన ప్రక్రియ బాగుంటుంది. ఒక్క మలమే కాదు.. మూత్రం, చెమట కూడా మలాలే. ఇవన్నీ ఒక దానిపై మరోటి ప్రభావం చూపేవే. ఒంట్లో నీరు తగ్గితే చెమట, మూత్రం తగ్గుతాయి. మలమూ ఎండిపోయి, గట్టిపడుతుంది. మనం ఆహారం, నీరు రూపంలో తీసుకునే ద్రవాలు పేగుల ద్వారానే రక్తంలోకి చేరుకుంటాయి. జీర్ణమైన ఆహారం పేగుల్లో సారం, కిట్టంగా విడిపోతాయి. కిట్టం మలంగా, సారం మూత్రంగా మారతాయి. అంటే మూత్రం తయారీకి పేగుల్లోనే బీజం పడుతుందన్నమాట. మన ఒంట్లో రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర అని ఏడు ధాతువులుంటాయి. వీటిల్లో ముఖ్యమైంది రస ధాతువు. ఇది రక్త ప్రసరణ ద్వారా మిగతా అన్ని ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. ధాతు పరిణామ క్రమంలో కొన్ని మాలిన్యాలూ పుట్టుకొస్తుంటాయి. ఇవీ రసధాతువులోనే కలిసిపోయి మూత్రం, చెమట ద్వారా విసర్జితమవుతాయి. ధాతు మాలిన్యాలు తగు స్థాయిలో ఉంటే ఇబ్బందేమీ కలగదు. కానీ ఇవి ఎక్కువగా ఉత్పత్తి కావటం, లేదూ వీటిని ఇముడ్చుకునేంత స్థాయిలో ద్రవాంశం అందకపోయినా కిడ్నీల్లో మేట వేయొచ్చు. రాళ్లకు బీజం వేసేది ఇదే. ఇవి ముందు చిన్న నలుసుగానే పురుడు పోసుకుంటాయి. కదలకుండా అక్కడే స్థిరపడిపోయినా, గట్టిగా అంటుకుపోయినా వీటిపై మాలిన్యాలు మరింతగా పోగుపడుతూ. చివరికి గట్టిపడి, రాయిలా మారతాయి. వీటికి తోడు ఎండకాలంలో మనకు తెలియకుండానే చెమట రూపంలో ఒంట్లో నీరు ఇగిరిపోవటం రాళ్లు ఏర్పడటానికి మరింత ఆజ్యం పోస్తుంది.
కారణాలు రకరకాలు..
ఒంట్లో నీటి శాతం తగ్గటం:నీళ్లు తక్కువగా తాగటం, వేడి వాతావరణంలో నివసించటం.. ఇలా ఏ కారణంతో నీటిశాతం తగ్గినా మూత్రం ఉత్పత్తి పడిపోతుంది. గాఢంగా, చిక్కగా అవుతుంది. దీంతో మాలిన్యాలు (క్యాల్షియం ఆక్జలేట్లు, యూరిక్ యాసిడ్, ఫాస్ఫరస్ వంటివి) పేరుకోవటం మొదలవుతుంది.
మూత్రాన్ని ఆపుకోవటం: జబ్బులు పుట్టుకొచ్చేలా చేసే ప్రధాన కారణాల్లో మల, మూత్ర విసర్జన వంటి సహజ వేగాలను ఆపుకోవటం ఒకటని ఆయుర్వేదం చెబుతుంది. మూత్ర విసర్జనను ఆపితే గాఢత పెరుగుతుంది. ఇది రాళ్లు ఏర్పడే ప్రక్రియను ప్రేరేపిస్తుంది.
అపథ్య ఆహారం: ముఖ్యంగా వేపుళ్ల వంటివి ఎక్కువగా తినటమూ రాళ్లకు దారితీయొచ్చు. వేపుళ్లు దాహాన్ని పెంచుతాయి. వీటిని జీర్ణం చేసుకోవటానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. దీంతో జీర్ణాశయం రక్తం నుంచి ఎక్కువ నీటిని గ్రహిస్తుంది. తగినంతగా నీరు తాగకపోతే మూత్రం ఉత్పత్తి పడిపోతుంది. మాలిన్యాలు బయటకు పోవటమూ తగ్గుతుంది.
కొన్నిరకాల జబ్బులు: గుండె, కాలేయం, జీర్ణకోశ సమస్యల వంటివీ కిడ్నీ రాళ్లకు కారణం కావొచ్చు. ఇలాంటి జబ్బులు గలవారిలో ధాతు పరిణామ ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. రక్తంలో నీటిశాతం తగ్గే ప్రమాదముంది. ద్రవాంశం తగ్గినప్పుడు విసర్జక అవయవ వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా మూత్రకోశంలో వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. వ్యర్థాలు పోగుపడే ముప్పు పెరుగుతుంది.
మూత్ర ఇన్‌ఫెక్షన్లు:మూత్రం ఆపుకోవటం, తగినంతగా నీరు తాగకపోవటం వల్ల మూత్ర స్వభావం మారిపోయి, ఇన్‌ఫెక్షన్లకు ఆస్కారం కలిగించొచ్చు. మూత్రం కాస్త ఆమ్ల స్వభావాన్ని కలిగుంటుంది. గాఢంగా అయినప్పుడు క్షార గుణంలోకి మారుతుంది. మూత్రంలో ఆమ్లం లేదా క్షార గుణాలు అతిగా పెరిగినప్పుడు మూత్రకోశంలోకి క్రిములు ప్రవేశించే అవకాశముంది. జననాంగ శుభ్రత కొరవడినప్పుడు దీని ముప్పు మరింత ఎక్కువ. సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశించినప్పుడు శరీర రక్షణ వ్యవస్థ ప్రేరేపితమై వాటిని నిర్వీర్యం చేయటానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా పుట్టుకొచ్చిన మృతకణాలు సైతం రాయి ఏర్పడటానికి బీజం వేయొచ్చు.
చికిత్స- మూలికలతోనూ ఉపశమనం
కిడ్నీ రాళ్లకు ఆయా సందర్భాలు, లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు. ఇందులో మూలికలు సైతం ఎంతగానో ఉపయోగపడతాయి.
పాషాణభేది: దీన్నే పిండికూర మొక్క అంటారు. ఇది రాళ్లను విడగొట్టటానికి బాగా ఉపయోగపడుతుంది. దీని ఆకులను దంచి, రసం తీసి తాగొచ్చు. కూరగానూ వండుకోవచ్చు. ఆకులను ఎండబెట్టి, పొడిచేసి నీళ్లలో కలిపి అయినా తీసుకోవచ్చు.
చిల్ల గింజలు: వీటిని పొడిచేసి, నీటిలో కలిపి తాగొచ్చు. కొబ్బరినీరుతో తీసుకుంటే ఇంకా మంచిది. ముందుగా కొబ్బరికాయ రంధ్రం నుంచి చెంచాడు పొడిని పోసి.. బట్టతోనో, పిండితోనో మూసేయ్యాలి. రాత్రంతా అలాగే ఉంచి మర్నాడు కొబ్బరి నీటిని తాగాలి. దీంతో చిల్లగింజల పొడి త్వరగా జీర్ణమవుతుంది. ఒంటికి బాగా పడుతుంది.
రణపాల: దీని ఆకులు రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి.