ప్రపంచవ్యాప్తంగా సుమారు 24 కోట్ల మంది ఆస్థమాతో బాధపడుతుండగా.. వీరిలో 12-13శాతం మంది మనవాళ్లే. అంతేకాదు.. ఆస్థమాతో మరణిస్తున్నవారిలో 42శాతం మంది మనవాళ్లే ఉంటుండటం మరింత విషాదకరం. సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నా కూడా ఆస్థమాను కట్టడి చేయటంలో విఫలమవుతున్నామనటానికి ఇదే నిదర్శనం.
సమస్యను సరిగా నిర్ధారించలేకపోవటం, వేరే సమస్యలుగా పొరపడటం, సరైన చికిత్స తీసుకోకపోవటం, ఇన్‌హేలర్ల మీద లేనిపోని అనుమానాల వంటివన్నీ ఇందుకు దారితీస్తున్నాయి. అందుకే ఆస్థమా మీద అవగాహన పెంచుకోవటం అత్యవసరమని ప్రపంచ ఆస్థమా దినం నినాదిస్తోంది. లక్షణాలను విశ్లేషించుకోవటం, అలర్జీ ప్రేరకాలను గుర్తించటం, సమస్య తీవ్రతను మదింపు వేయటం, అవసరమైన మేరకు చికిత్సలను మార్చుకోవటం ద్వారా ఆస్థమాకు పూర్తిగా కళ్లెం వేయొచ్చని సూచిస్తోంది.
ఆస్థమా గురించి అవగాహన అవసరం..
ఆస్థమా దీర్ఘకాల శ్వాసకోశ సమస్య. ప్రత్యేకించి ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలకు సంబంధించిన సమస్య. దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాలకు వెళ్లినపుడు ఎవరికైనా దగ్గు రావటం సహజమే. నిజానికిది హాని కలిగించేవాటిని బయటకు నెట్టివేయటానికి శరీరం చేసే ప్రయత్నమే. అయితే ఆస్థమా వచ్చే స్వభావం (అటోపీ) గలవారికి ఇలాంటి పరిస్థితులు విపరీతంగా పరిణమిస్తుంటాయి. దుమ్ము ధూళి వంటివి తగిలినపుడు ఉన్నట్టుండి అలర్జీ ప్రేరేపితమై గాలిగొట్టాలు అతిగా స్పందిస్తుంటాయి. ఆస్థమాకు మూలం ఇదే. మనం పీల్చుకునే గాలి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల లోపలికీ, బయటకూ వస్తుంది కదా. ఈ శ్వాసనాళం పైనుంచి రెండుగా చీలుతూ వచ్చి.. మళ్లీ చిన్నచిన్న గొట్టాలుగా విడిపోతూ.. సూక్ష్మమైన గాలిగదుల్లోకి గాలిని చేరవేస్తుంది. గాలి ప్రవాహాన్ని నియంత్రించటంలో గాలి గొట్టాల చుట్టూ ఉండే మృదువైన కండరం కీలక పాత్ర పోషిస్తుంది. కండరం వదులైనప్పుడు గొట్టాలు విప్పారతాయి, బిగుసుకుపోతే సంకోచిస్తాయి. అలాగే గొట్టాల లోపల జిగురుపొరలోని కణాలు చిక్కటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఇది గొట్టాలు ఎండిపోకుండా, దుమ్ముధూళి వంటివి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది.
మరోవైపు రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్ వంటివి లోనికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది. వీటి పనితీరు ఎక్కడ అస్తవ్యస్తమైనా సమస్యకు దారితీస్తుంది. ఆస్థమా వచ్చే స్వభావం గలవారిలో గాలిగొట్టాలకు అలర్జీ కారకాలు తగిలినప్పుడు రోగనిరోధక కణాలు అతిగా స్పందిస్తాయి. దీంతో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) తలెత్తుతుంది. ఫలితంగా గాలిగొట్టాల గోడలు ఉబ్బిపోయి లోపలి మార్గం సన్నబడుతుంది. జిగురుద్రవం ఉత్పత్తీ ఎక్కువై.. అది లోపలే చిక్కుకు పోతుంది. అంతేకాదు.. రోగనిరోధక వ్యవస్థలో భాగమైన మాస్ట్ కణాలు హిస్టమిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇది గాలిగొట్టాల కండరం సంకోచించేలా చేస్తుంది. దీంతో శ్వాస తీసుకోవటం, వదలటం కష్టమైపోతుంది. దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటివన్నీ మొదలవుతాయి. కొందరిలో ఇలాంటి లక్షణాలు కొద్దిసేపే ఉండొచ్చు. మందులు తీసుకోకపోతే గంటలకొద్దీ వేధించొచ్చు. సమస్య మరీ తీవ్రమైతే ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. కాబట్టి ఆస్థమాపై అవగాహన పెంచుకోవటం అత్యవసరం.
ఎక్కడివీ అలర్జీ కారకాలు?
అలర్జీ కారకాలు ఎక్కడైనా ఉండొచ్చు. దుమ్ము ధూళి, పుప్పొడి, కాలుష్యం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, వాతావరణ మార్పుల వంటివన్నీ అలర్జీని తెచ్చిపెట్టొచ్చు. పెంపుడు జంతువుల బొచ్చు, మెత్తటి బొమ్మలు, తివాచీల్లో పోగుపడే దుమ్ము, చెమ్మ ఉన్నచోట పెరిగే ఫంగస్, బొద్దింకల వంటి కీటకాలు, తవిటి పురుగులు, బట్టల సబ్బులు, ఆహార పదార్థాల నిల్వకోసం వాడే ప్రిజర్వేటివ్‌లు, అగరుబత్తీలు, దోమల బత్తీలు, సిగరెట్ల నుంచి వెలువడే పొగలు, ఆస్ప్రిన్ వంటి కొన్నిరకాల మందులు, మానసిక ఒత్తిడి.. ఇలా ఏదైనా ఆస్థమాను ప్రేరేపించొచ్చు.
నిర్ధారణ-పరీక్షలు
స్పైరోమెట్రీ: ఆస్థమా నిర్ధారణకు ఇది ప్రామాణిక పరీక్ష. ఇందులో శ్వాసను గట్టిగా తీసుకొని స్పైరోమీటర్ గొట్టంలోకి బలంగా ఊదాల్సి ఉంటుంది. బయటకు వచ్చే గాలి పరిమాణాన్ని బట్టి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఈ పరీక్షను శ్వాసనాళాలను విప్పార్చే మందును ఇచ్చి మరోసారి కూడా చేస్తారు. మందు తీసుకున్న తర్వాత గాలి పరిమాణం 12శాతం మెరుగుపడితే ఆస్థమాగా నిర్ధారిస్తారు.
పీక్‌ఫ్లో మీటర్: దీని గొట్టంలోకి గట్టిగా గాలిని ఊదినపుడు పరికరం మీదుండే ముల్లు కదులుతుంది. నిర్ణీత మోతాదు కన్నా ముల్లు తక్కువగా కదిలితే ఆస్థమాగా భావిస్తారు. దీన్ని 24 గంటల వ్యవధిలో చాలాసార్లు చేయిస్తారు కూడా.
బ్రాంకియల్ ప్రొవొకేషనల్ టెస్ట్: ఆస్థమా తొలిదశలో కొందరికి స్పైరోమెట్రీ, పీక్‌ఫ్లో మీటర్ పరీక్షల్లో సమస్య తేలకపోవచ్చు. వీరికి అలర్జీ కారకాలను ఇచ్చి (హిస్టమిన్ ఛాలెంజ్) పరీక్షిస్తారు.
స్కిన్ ప్రిక్ టెస్ట్:ఇందులో అలర్జీ కారకాలను చర్మంలోకి ఇచ్చి వేటితో అలర్జీ వస్తుందో గుర్తిస్తారు.
ఎక్స్‌రే:క్షయ, సీవోపీడీ, న్యుమోనియా, క్యాన్సర్ వంటి ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుసుకోవటానికి ఇది తోడ్పడుతుంది.
రక్తపరీక్ష: ఆస్థమాలో అలర్జిక్, నాన్ అలర్జిక్ అని రెండు రకాలున్నాయి. అలర్జిక్ ఆస్థమాలో ఈస్నోఫిల్ కణాల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి దీన్ని తెలుసుకోవటానికిది ఉపయోగపడతుంది.
ఐజీఈ పరీక్ష: ఇందులో 'ఇమ్యునోగ్లోబులిన్ ఈ' అనే యాంటీబాడీ స్థాయులు బయటపడతాయి.
ఇన్‌హేలర్లపై అపోహలు వద్దు
ఇన్‌హేలర్‌లో మందుల మోతాదు మైక్రోగ్రాముల్లో ఉంటుంది. ఇవి నేరుగా శ్వాసనాళం మీద పనిచేస్తాయి. వెంటనే ఉపశమనం కలిగిస్తాయి. దుష్ప్రభావాలు కూడా ఉండవు. కానీ మనదగ్గర 40శాతం మందికి ఇన్‌హేలర్ సరిగా వాడుకోవటమే తెలియటం లేదు. ఆస్థమాకు ఇన్‌హేలర్ మందులే ప్రధాన చికిత్సని గుర్తించాలి. వీటిపై అపోహలు, భయాలు పెట్టుకోవటం తగదు.
- ఇన్‌హేలర్లు చివరిదశలో మాత్రమే ఇస్తారన్నది కొందరి అపోహ. ఇందులో ఏమాత్రం నిజం లేదు. నిజానికి ఆస్థమాకు తొలి చికిత్స ఇన్‌హేలర్లే.
- ఒకసారి ఇన్‌హేలర్ మందు మొదలుపెడితే దానికి అలవాటు పడిపోతామన్నది మరికొందరి భయం. ఇన్‌హేలర్‌లో వాడుకునేవి మాదకద్రవ్యాలు కావు. శరీరానికి మేలు చేసే మందులు. ఇవేవీ వ్యసనానికి దారితీయవు. కాబట్టి భయాలు అక్కర్లేదు.
- ఇన్‌హేలర్ల ఖరీదు ఎక్కువన్నది మరికొందరి అభిప్రాయం. వీటితో ఒనగూడే లాభాలతో పోలిస్తే అయ్యే ఖర్చు ఒక లెక్కలోకే రాదు. ఆస్థమా నియంత్రణలో లేక ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చుతో పదేళ్లకు సరిపడిన ఇన్‌హేలర్ మందులు కొనుక్కోవచ్చు.
- బయటకు వెళ్లినా కూడా ఇన్‌హేలర్ వెంట తీసుకెళ్లాలి.
- వ్యాయామం చేసేటప్పుడు ఆస్థమా తలెత్తే వాళ్లు ముందుగానే ఇన్‌హేలర్ మందు తీసుకోవాలి. వ్యాయామాన్ని క్రమంగా పెంచుకుంటూ రావాలి.
నివారణ ఉత్తమం
ఆస్థమాను పూర్తిగా నయం చేయలేం. దీన్ని నియంత్రించుకోవటం ఒక్కటే మార్గం. కొన్ని జాగ్రత్తలతో దీన్ని కచ్చితంగా సాధించొచ్చు. అలర్జీ కారకాలను గుర్తించి దూరంగా ఉండటం అన్నింటికన్నా ముఖ్యం
- వీలైనంత వరకు దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ వెళ్తే ముక్కుకు, నోటికి రుమాలు కట్టుకోవాలి. వీలైతే మాస్క్ ధరించాలి.
- ఎక్కువసేపు ఉండేది ఇంట్లోనే కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి.
- దోమల బత్తీలు వాడుకోవద్దు.
- నేలను చీపురుతో చిమ్మకుండా గుడ్డతో తుడుస్తూ శుభ్రం చేసుకోవటం మంచిది.
- దిండు కవర్లు, దుప్పట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీటిని వారానికోసారి ఎండలో పెట్టాలి.
- గోడలకు చెమ్మ పట్టకుండా చూసుకోవాలి.
- బొద్దింకల వంటి కీటకాలు లేకుండా చూసుకోవాలి.
- ఆస్థమాతో పాటు ఇతరత్రా సమస్యలేవైనా ఉంటే వాటికి చికిత్స తీసుకోవాలి.
- యోగా, ధ్యానం చేయటం మంచిది. వీటితో మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది.
- వైరల్ ఇన్‌ఫెక్షన్ల మూలంగా ఆస్థమా దాడి చేయటం ఎక్కువ. కాబట్టి ఫ్లూ, న్యుమోనియా టీకా విధిగా తీసుకోవాలి.