తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నానో కారులో బిస్కెట్లు .. రూ. 12 కోట్లు! - a lady sold biscuits in nano car and earned 12 crores

విదేశాల్లో బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకుని ఎవరైనా రోడ్డు మీద బిస్కెట్లు అమ్ముకుంటారా? నేహా ఆర్యసేథి అలానే చేసింది. ఏదో ఒక ఉద్యోగం చేయడం కాదు... అభిమానించే రంగంలో అడుగుపెడితే విజయం తథ్యం అని నిరూపించింది. తన వ్యాపారాన్ని 12 శాఖలకు విస్తరించి.. ఏటా రూ.12 కోట్ల ఆదాయంతో యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది...

mumbai woman earned crores of money by selling them in nano car
నానో కారులో బిస్కెట్లు .. రూ. 12 కోట్లు!

By

Published : Aug 28, 2020, 12:30 PM IST

అమెరికాలోని వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో చదివి... అక్కడే బ్యాంకు ఉద్యోగాన్ని సాధించింది నేహా. ఏడాది తరువాత తన లక్ష్యం అదికాదనుకుంది. సమయాన్ని వృథా చేయకుండా ఆ ఉద్యోగాన్ని వదిలేసి భారతదేశానికి తిరుగు ప్రయాణమైంది. ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచించినప్పుడు చిన్నప్పుడు తాను ఇష్టంగా తిన్న బిస్కెట్లు గుర్తొచ్చాయి. వాటి తయారీనే మొదలుపెట్టింది. నిజానికి అంతవరకూ బేకింగ్‌ గురించి ఏబీసీడీలు కూడా రాని నేహా యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ ఆ పని నేర్చుకుంది. వాటిని స్నేహితులకు, తెలిసినవారికి పంపిస్తే ‘'బాగున్నాయ్‌.. వ్యాపారం పెట్టవోయ్‌' అని చెప్పడంతో రూ. ఐదు లక్షల పెట్టుబడితో ముంబయిలో బిస్కెట్ల తయారీని ప్రారంభించింది.

నానో కారులో అమ్మకాలు..

తయారుచేసిన బిస్కెట్లని దుకాణంలో కాకుండా వినూత్నంగా నానో కారులో అమ్మాలనుకుంది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో 'మా నానో కారుని చేరుకుంటే రుచికరమైన కుకీస్‌ మీ సొంతం' అనే పోస్టు పెట్టింది. ఈ పోస్ట్‌ బిస్కెట్‌ లవర్స్‌ని బాగా ఆకర్షించింది. క్రమంగా వినియోగదారులు నేహా తయారుచేసే కుకీస్‌ రుచి పట్ల ఆకర్షితులయ్యారు. ఆ తరువాత ప్రజలు కోరిన చోటుకే కారుని తీసుకెళ్లి అమ్మకాలు మొదలుపెట్టింది. కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయేవి. అలా వాటికి ప్రజల్లో 'నానోకుకీస్‌' అనే పేరొచ్చింది.

ఏడాదిపాటు నానోలో కుకీస్‌ను విక్రయించిన నేహా చిన్న బేకరీ తెరవాలనుకుంది. ఆరేళ్ల క్రితం ముంబయిలో 'స్వీటిష్‌ హౌస్‌ మాఫియా' పేరుతో బేకరీ తెరిచింది. 'ఓసారి బ్రీచ్‌క్యాండీలో డెలివరీకి చేరిన ఒకావిడ నానో కుకీస్‌ను తినాలని ఉందని అడిగిందట. ఆమె భర్త నాకు ఫోన్‌ చేసి ఆసుపత్రికే మీ కుకీస్‌ని పంపిస్తారా అని అడిగారు. ఇంతకంటే ప్రశంస ఏముంటుంది? ప్రజలు ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టే మా వ్యాపారం ముంబయి, పుణె, కోల్‌కతా, బెంగళూరుతో సహా 12 చోట్ల విస్తరించింది' అని అంటోంది నేహా.

ఇదీ చూడండి:కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు

ABOUT THE AUTHOR

...view details