తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

45+ లోనూ ఫిట్‌నెస్‌.. వ్యాయామాల్లో లేడీస్ ఫస్ట్ - నడి వయసు నారి.. వ్యాయామ దారి

మహిళ జీవితం.. నిత్యం పరుగులమయం. చదువు.. ఆపై కొలువు.. లేదా కుటుంబ బాధ్యతలు. ఇంటిని చక్కదిద్దుతూ.. ఉద్యోగ/వ్యాపార బాధ్యతలు నిర్వర్తిస్తుండగానే వయసు మీద పడుతుంది. నలభై ఏళ్లు దాటాక శారీరక, మానసిక సమస్యలు తొంగిచూస్తాయి. మెనోపాజ్‌ దశలో తలెత్తే చికాకులు.. సున్నితమైన ఇబ్బందులు. పంటిబిగువున వీటిని భరిస్తూనే కుటుంబానికి సేవలు. పిల్లల చదువులు, ఇతర బాధ్యతలు. ఇన్ని చిక్కుముడుల మధ్య గృహిణికి శారీరక, మానసిక బలం.. ఆరోగ్యవంతమైన జీవితం వ్యాయామంతోనే సాధ్యమంటున్నారీ ధీరలు.

50+ women are hardworking for their fitness in different ways
50+ women are hardworking for their fitness in different ways

By

Published : Feb 28, 2021, 7:39 AM IST

45 ఏళ్లు దాటిన కొందరు మహిళామణులు.. ఫిట్‌నెస్‌ కోసం తమకు ఆసక్తికరమైన రంగాన్ని ఎంచుకుని రాణిస్తున్నారు. వయసును జయిస్తున్నారు. సాహస క్రీడలు.. కసరత్తులు.. యోగాసనాలు వంటివి జీవితంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. సాధన చేస్తే ప్రతి యువతి /మహిళ ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోగలరని సూచిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఎంచుకున్న ఫిట్‌నెస్‌ అంశాల్లో రాణించటం వెనుక పట్టుదల, సాధన గురించి తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.


సాహసం చేయరా.. ఈత కొట్టరా
సికింద్రాబాద్‌లోని సైనిక కుటుంబానికి చెందిన మహిళ ఆమ్రపాలి పట్నాయక్‌. 55 ఏళ్ల వయసులోనూ ఈత పోటీల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చాటుకుంటున్నారు. యువతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆరేళ్ల వయసులోనే ఈతలో శిక్షణ పొందిన ఈమె పాఠశాల, కళాశాల స్థాయిల్లో జాతీయ పోటీల్లో పతకాలు సాధించారు. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలు మీదపడినా ఏ రోజూ శారీరక వ్యాయామం నిర్లక్ష్యం చేయలేదంటారామె. పారాసైలింగ్‌, స్కై డైవింగ్‌, పరుగు పోటీల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. రెండుసార్లు జాతీయస్థాయిలో బంగారుపతకాలు సాధించటం ఆనందంగా ఉందాంటారామె. పెళ్లయ్యాక పిల్లలు ఎదిగే సమయంలో చాలామంది మహిళలు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేస్తారు. తీరికలేదంటూ వ్యాయామాన్ని వాయిదా వేస్తుంటారు. ప్రతి మహిళ.. సానుకూల ఆలోచనలతో ఉండాలి. కనీసం గంట వ్యాయామం అలవాటుగా మార్చుకోవాలి. యోగ, ధ్యానం, జిమ్‌, ఏరోబిక్స్‌, ఈత ఆసక్తిగల ఏ అంశమైనా మిమ్మల్ని ఆరోగ్యంగా మార్చుతుందని గుర్తించాలని ఆమె సూచించారు. మితమైన ఆహారం, సమయపాలన, సరైన నిద్ర, సానుకూల దృక్పథం ఇవన్నీ శరీరాన్ని.. మనసును ఉత్సాహంగా ఉంచుతాయి.

ఆమ్రపాలి పట్నాయక్

పరుగు.. ఆరోగ్యం మెరుగు
హైదరాబాద్‌తో సహా మెట్రో నగరాల్లో ఎక్కడ మారథాన్‌ పోటీలు జరిగినా ఆమె పాదాలు పరుగులు తీస్తుంటాయి. సంప్రదాయ చీరకట్టులో కిలోమీటర్ల దూరం పరుగెత్తటమే కాదు.. పతకాలను దక్కించుకోవటం తన ప్రత్యేకత. జయంతి సంపత్‌కుమార్‌ 47 ఏళ్ల వయసు. ఐటీ సంస్థలో ఉన్నతస్థాయి ఉద్యోగి. కుటుంబం, విధులు రెండింటినీ సమన్వయం చేసుకునేందుకు శారీరక వ్యాయామమే మార్గమని భావించినట్టు చెబుతారామె. సైక్లింగ్‌, మారథాన్‌ రెండు అంశాల్లోనూ ఇప్పటికీ రోజువారీ చేస్తుంటారు. సాధన, సంకల్పం రెండూ 40, 50 కిలోమీటర్ల దూరం సునాయాసంగా పరుగెత్తేందుకు కారణమని తెలిపారు. వయసు పెరిగే కొద్దీ చాలామంది గృహిణులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిస్తుంటారు. మనసు ప్రశాంతంగా ఉండేందుకు వ్యాయామమే ఉత్తమ మార్గం. దీనికోసం రోజూ కొద్ది సమయం కేటాయించాలి. ఆసక్తి, శరీరానికి అనుకూలమైన అంశాలను ఎంచుకుని సాధన చేయటం ద్వారా ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చనేది జయంతి సంపత్‌కుమార్‌ సూచన.

జయంతి సంపత్‌కుమార్

సవాల్‌కు.. సైకిల్‌తో సమాధానం
సైకిల్‌ తొక్కటం ఆషామాషీ కాదు. అదీ వందల కిలోమీటర్లు ప్రయాణించటం అంతటి సులువైనది కానేకాదు. అయినా ఆమె సాధించారు. ట్యాంక్‌బండ్‌ చుట్టూ ఒక్కసారి చుట్టి వచ్చేందుకు ఇబ్బంది పడిన ఆమె.. ఇప్పుడు అలవోకగా చుట్టొస్తున్నారు. సంకల్పం ఉన్నపుడు సాధ్యం కానిదంటూ ఏదీ లేదంటారు అపోలో ఆసుపత్రుల వైస్‌ ఛైర్మన్‌ శోభన కామినేని. 60వ పుట్టినరోజు వేళ తాను చేసిన సాహసం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఏటేటా వయసుతో పాటు పెరిగేది కేవలం అంకెలు మాత్రమే అని గుర్తుంచుకోవాలని ఆమె మహిళలకు సూచించారు. హైదరాబాద్‌-చెన్నై సైక్లింగ్‌ చేస్తానన్నపుడు అమ్మో ఈ వయసులో ఎందుకు అన్నారు. కానీ మా శ్రీవారి ప్రోత్సాహం.. వెన్నంటి ఉంటూ ఉత్సాహం నింపిన ఉపాసన దీనికి కారణమంటూ చెప్పారు. 6 రోజులపాటు రోజూ 100-120 కి.మీ. ప్రయాణిస్తూ 600 కి.మీ. గమ్యం చేరానంటారు శోభన కామినేని. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లటం వల్లనే ఇది సాధ్యమైందని వివరించారు. వ్యాయామం ద్వారా చాలా శక్తి వస్తుందనేది స్వయంగా అనుభూతి చెందుతున్నా. ఆరోగ్యం కోసం 10 శాతం శ్రమిస్తే 20 శాతం ప్రయోజనం ఉంటుంది. వారంలో మూడ్రోజులు బంధువులతో కలసి లాంగ్‌డ్రైవ్‌ సైక్లింగ్‌ చేస్తుంటా. ప్రతి మహిళ తన జీవితంలో వ్యాయామం భాగంగా మలచుకోవాలి. ఇంట్లో ఉంటూ యోగ సాధన చేయవచ్చు. గోల్ఫ్‌, సైక్లింగ్‌, ఏరోబిక్స్‌ ఇలా నచ్చిన వ్యాయామంతో మానసిక ప్రశాంతత, మధుమేహం, అధికరక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులకు చెక్‌ చెప్పవచ్చు.

అపోలో ఆసుపత్రుల వైస్‌ ఛైర్మన్‌ శోభన కామినేని

ప్రమీల యోగ ప్రతిభ
వారాసిగూడకు చెందిన జి.ప్రమీల మామూలు గృహణి. 2007లో అనారోగ్య సమస్యను అధిగమించేందుకు యోగాలో శిక్షణ పొందేందుకు వెళ్లారు. ప్రస్తుతం తానే శిక్షణనిచ్చే స్థాయికి చేరారు. కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూనే యోగాను దైనందిన చర్యల్లో భాగంగా చేసుకున్నారు. 46 ఏళ్ల వయసులో జాతీయస్థాయిలో యోగాసనాల పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. ఇప్పటి వరకూ సుమారు 50 వరకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు అందుకున్నారు. తనకు ఆరోగ్యాన్ని పంచిన యోగను చుట్టూ ఉన్నవారికీ పంచాలనే సంకల్పంతో యోగా థెరపీ కోర్సులు పూర్తిచేశారు. ఇంటా బయటా భిన్నపాత్రలు పోషించే మహిళలు కుటుంబ బాధ్యతల్లో మునిగి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటారామె. 30-40 వయసులోనే వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా యోగా సాధనతో ఈ సమస్యలను అధిగమించినవాళ్లు ఎందరో ఉన్నారని వివరించారు. 40 ఏళ్ల వయసులోనే మహిళలకు ఎక్కువ బాధ్యతలుంటాయి. అప్పుడే ఆరోగ్యంగా ఉండాలని, రోజూ కనీసం గంట సమయం యోగా, ధ్యానం వంటివాటికి కేటాయించాలని సూచిస్తున్నారు.

జి.ప్రమీల

ఇదీ చూడండి:పెద్దగట్టు జాతర సందడికి వేళైంది..

ABOUT THE AUTHOR

...view details