కరోనా ప్రభావంతో యాదాద్రి ఆలయానికి భక్తుల సందర్శన నిలిపివేయడం వల్ల ఆదాయానికి గండి పడింది. ఆలయ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకు ప్రతినెల రూ.2 కోట్లు అవసరం. ప్రస్తుతం ఆలయానికి ఆదాయం లేకపోవడం వల్ల వీటిని రిజర్వ్ ఫండ్ నుంచి తీసుకుంటున్నారు.
భక్తుల ద్వారా ఏటా యాదాద్రి ఆలయానికి రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోవడం వల్ల వేసవిలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా ఆదాయం అధికంగా వస్తుందని అధికారులు అంచనా వేశారు. కరోనా వ్యాప్తితో అంతా తలకిందులైపోయింది. ఆన్లైన్ సేవల ద్వారా ఆదాయం సమకూరుతున్నా అది అంతంత మాత్రమే.
కరోనా కట్టడికి పటిష్ఠ నిబంధనలు అమలు చేసి భక్తులకు దర్శనం కల్పించే యోచనలో యాదాద్రి ఆలయ నిర్వాహకులున్నారు. ఈనెల 8 నుంచి ఆలయాలు తెరుచుకోనున్న నేపథ్యంలో సమాలోచనలు చేస్తున్నారు. వారం రోజులపాటు ప్రయోగాత్మకంగా భక్తులను కొండపైకి అనుమతించే ప్రక్రియపై యోచిస్తున్నారు.
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, నిత్య కల్యాణోత్సవం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిజాభిషేకం, తులసి అర్చనలు నిర్వహించేందుకు దేవస్థానం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కొండ కింద కనుమ దారి ప్రవేశం చెంత థర్మల్ స్కానింగ్ నిర్వహిస్తారు. ఆర్జిత పూజలో పాల్గొనే భక్తులకు అక్కడే టికెట్లు విక్రయించేలా ఏర్పాట్లు చేయదలిచారు. స్వామి అమ్మవార్ల సన్నిధిలోకి భక్తులను ఉచిత దర్శనం ద్వారానే పంపించాలని అధికారులు భావిస్తున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులను కొండపైకి చేర్చే రవాణా సదుపాయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండ కిందే భక్తులను కట్టడి చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ సూచనలకు అనుగుణంగా అనుమతించాలని అనుకుంటున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు.