Yadadri Thermal Power Plant: యాదాద్రి విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతిపై కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈసీ జారీ చేయాలంటే ఈ కేంద్రం నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనేది తెలుసుకునేందుకు మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనని కేంద్ర పర్యావరణశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతి అంశంలో మరోసారి చిక్కుముడి పడింది.
Yadadri Thermal Power Plant Environmental Issues: క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామ సభలు పెట్టాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి అనుమతించాలంటూ రాష్ట్ర జెన్‌కో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ని ఆశ్రయించింది. ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు గతంలో కేంద్ర పర్యావరణశాఖ జారీచేసిన మార్గదర్శకాలున్నందున ఎన్జీటీ కూడా సానుకూలంగా స్పందించవచ్చన్న ఆశాభావంతో జెన్‌కోఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ కేంద్రం నిర్మాణం అనుకున్న గడువుకన్నా రెండేళ్లు దాటడంతో అంచనా వ్యయం 29 వేల 500 కోట్ల నుంచి 34 వేల 500 కోట్లకు పెరిగింది.
Yadadri Power Plant TOR Issue : వాస్తవానికి యాదాద్రి ప్లాంటుకు గతంలోనే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు జారీచేసింది. దాని ప్రకారం విద్యుత్ కేంద్రం నిర్మాణం కూడా చాలామేర పూర్తయింది. అయితే ఈ కేంద్రం నుంచి వెలువడే కాలుష్యం వల్ల ఆమ్రాబాద్ అభయారణ్యంలో వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం పడుతుందని, కేంద్రం జారీచేసిన ఈసీని రద్దుచేయాలంటూ ముంబయికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ గత ఏడాది ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. బొగ్గును మండించి విద్యుదుత్పత్తి చేసే థర్మల్ కేంద్రం అభయారణ్యానికి కనీసం 10 కిలోమీటర్ల ఎయిర్ డిస్టెన్స్‌లో ఉండాలని కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలున్నాయి.
అంతకన్నా తక్కువ దూరంలోనే నిర్మిస్తున్నట్లు ఆ సంస్థ ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ గతంలో జారీచేసిన అనుమతులను రద్దుచేసి మరోసారి అధ్యయనం చేసి 9 నెలల్లోగా కొత్తగా జారీచేయాలని గత ఏడాది సెప్టెంబరులో తీర్పు చెప్పింది. ఆ గడువు ఈ ఏడాది జూన్‌తో ముగిసినా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వలేదంటూ అక్టోబరులో జెన్‌కో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించించింది.