తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి... యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం. రుష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి... ఆంజనేయస్వామి సలహా మీద ఈ కొండపై చాలా కాలం తపస్సు చేశారు. ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి తపస్సులో ఉన్న ఈ రుషిని తినబోయాడు. ఆ విషయం ఎవరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆ విష్ణువు చేతిలోని సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. ఆ సుదర్శనమే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసిందిట. యాద మహర్షి తపస్సుకి మెచ్చి, లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడని స్థలపురాణం. ఆ కొండే రుషి పేరుమీద యాదగిరిగా ప్రసిద్ధికెక్కిందని ఇక్కడివారు చెబుతారు.
యాదా రుషి తపస్సు చేసింది ఇక్కడే...
యాదా రుషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు సమీప్యుడు ఈ దేవుడంటారు. పెద్దపెద్ద కానుకలు, ముడుపులు, భూరివిరాళాలు ఇచ్చిన వారినే కాపాడతాడనేమీ లేదు. భక్తితో చిల్లర నాణేలు వేసినా కరుణిస్తాడని, చిల్లర్ల దేవుడని ఆప్యాయంగా పిలుచుకుంటారు. చాలా సాధారణమైన కోరికలు కూడా నెరవేరక వ్యధ చెందుతున్న సామాన్య భక్త జనం ఎంతో విశ్వాసంతో ఈ క్షేత్రానికి వస్తారు.
కోనేరు ప్రత్యేకతలు...
ఆలయ కోనేరులో స్నానం చేస్తే చాలు భయపీడలు పోతాయని, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ కోనేరుని విష్ణుకుండం అని అంటారని ఆలయ ప్రధానార్చకులు చెబుతున్నారు. రాక్షస సంహారంచేసి లోక కల్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్లని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరిందని అందుకే ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉందంటారు. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయట.
పితృకార్యాలకు అనువైన చోటు...
ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారట. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్లపాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తుంటారు. ప్రదక్షిణలకు కూడా పుష్కరిణి స్నానమంతటి విశేషం ఉంది. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి 16 సార్లు, గర్భాలయం చుట్టూ 16 ప్రదక్షిణలు మొత్తం 32 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఎన్నో మానసిక, శారీరక బాధలు తొలగుతాయని, వైద్యనారసింహుడని భక్తులు నమ్ముతారు.
ఇదీ చూడండి: యాదాద్రి పేరు విశిష్టత ఇదే..!