ఎక్కడెక్కడినుంచో ఎంపికచేసుకుని మరీ రప్పించిన స్తపతులు, ఆర్కిటెక్చరర్లు, శిల్పాచార్యులు, శిల్పులు, వివిధ పనివాళ్లు, రకరకాల యంత్రాలు, భారీ యంత్రాలతో పనిచేసే నిపుణులతో ఆలయ నిర్మాణం సాగుతోంది. దాదాపు 1500 మంది శిల్పులు తమ ఉలులకు పని కల్పించారు. అతను, ఆమె... ఎంకటేశో, గుట్టెనక ఏసోబో, పీర్లచావిడి వీధి రెహమానో, పంజాబ్ నుంచి వలసకూలిగా వచ్చిన తన్వీర్‌సింగో, చెన్నై నుంచి సుత్తి-ఉలి చేతపట్టుకుని వచ్చిన తంగవేలో, రాజస్థాన్ గడపదాటి వచ్చిన ఇల్లాలు హీరాబాయి... ఎవరైతేనేం... వారి చేతి ఉలులు, సుత్తులూ రాళ్లపై రాగాలు పలికిస్తున్నాయి.
వీళ్లెవ్వరూ ఏ హిందూ మతగ్రంథాలను చదువలేదు. రెక్కాడితేనే డొక్కాడును అనే జీవిత పాఠాలు మాత్రమే చదివారు. చోళ, పల్లవ, విజయనగర సామ్రాజ్య చరితలను ఎరుగరు. ఎండనక వాననక కష్టంచేస్తే ఆ పూట కంచంలో అన్నం అనే దినసరి చరిత్ర మాత్రమే ఎరుగుదురు. నాగరశైలి గోపురమో, వేసరశైలీ ప్రాకారమో, ద్రావిడశైలీ విమానమో తెలియదు వాళ్లకు. వాళ్లకు తెలిసిందల్లా ఎవరి చెమటబిందువైనా ఉప్పుప్పగానే ఉంటుందని, రాళ్లదెబ్బలకు కారే నెత్తురు ఎవరిదైనా ఎర్రగానే ఉంటుందని. శైవాగమమా, పాంచరాత్రాగమమా, వైఖానసాగమమా… ఏమో ఎప్పుడూ వినని పదాలవి. అయినా స్తపతిగారు చెప్పినట్లు శిల్పం చెక్కడమే వారి పని. మతమేదైనా, కులమేదైనా యాదాద్రిపై ఏ రాయి ముందో ఒంటికాలిపై కూర్చుని సుత్తి శానం ఉలి పట్టుకుంటే చాలు ఆ రాయి వైష్ణవ దేవుడుగానో, శైవ దేవతగానో, శక్తిరూప అమ్మవారుగానో మారిపోతుందంతే.