"యాదాద్రి ఆలయాన్ని పునః ప్రారంభించాలంటే మహాకుంభ సంప్రోక్షణ చేయాలి. విద్వత్‌సభ, సిద్ధాంతుల సభను సమావేశపరిచిన అనంతరం చినజీయర్ స్వామి వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించాలని ముహూర్తం నిర్ణయించారు. అంతకు వారం రోజుల ముందు మార్చి 21న 108 కుండాలతో మహా సుదర్శన యాగానికి అంకురార్పణ జరుగుతుంది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు పునః ప్రారంభమవుతాయి" అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.
ఈ క్రతువుకు 1.50 లక్షల కిలోల నెయ్యి వినియోగిస్తామన్నారు. దేశంలోని వివిధ ప్రసిద్ధ క్షేత్రాలు, వైష్ణవ పీఠాధిపతులు, అమెరికా తదితర దేశాల నుంచి అర్చకులు, అయిదారు వేల మంది రుత్విక్కులు, వారి సహాయకులు రానున్న దృష్ట్యా కొండ కింద ఉన్న 200 ఎకరాల్లో యాగం నిర్వహిస్తామన్నారు. ఆలయ పునఃప్రారంభం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేయాలన్న జీయర్‌స్వామి సూచన మేరకు ఈ ముహూర్త నిర్ణయం జరిగిందన్నారు. ‘చినజీయర్ స్వామి హైదరాబాద్ సమీపంలోని తమ ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒకే కాలంలో రెండు పెద్ద క్రతువులు నిర్వహించడం సులభం కాదు కనుక, యాదాద్రి ఉద్ఘాటన మార్చి 28న నిర్వహిస్తు’న్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో క్షేత్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్... పనులను పరిశీలించారు.
సమైక్య పాలనలో ఆధ్యాత్మికంగానూ నిర్లక్ష్యమే
"సమైక్య పాలనలో తెలంగాణ ఆధ్యాత్మికంగానూ నిరాదరణకు గురైంది. శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారికి గతంలో ప్రాధాన్యమివ్వలేదు. స్వరాష్ట్రంలో అమ్మవారి ఖ్యాతిని ప్రాచుర్యంలోకి తెచ్చాం. మహోత్కృష్టమైన ఆలయాల్లో ఒకటైన యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేలా పునర్నిర్మాణం చేపట్టాం. చినజీయర్ స్వామి సూచనలతో ఆలయ పనులు జరిగాయి. పునఃప్రారంభం తర్వాత కూడా తదుపరి నిర్మాణాలు కొనసాగుతాయి." - కేసీఆర్, సీఎం
విమాన గోపురానికి వెల్లువెత్తిన విరాళాలు..
"యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తిరుమల తరహాలో స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరమవుతోందన్నారు. ఈ పవిత్ర కార్యానికి తొలి విరాళంగా తమ కుటుంబం తరఫున ఒక కిలో 16 తులాల బంగారం ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి తొలి విరాళం ప్రకటించిన కొన్ని గంటల్లోనే తామూ బంగారం ఇస్తామంటూ పలువురు దాతలు ముందుకొచ్చారు. వీరిలో కొందరి పేర్లను ముఖ్యమంత్రి మంగళవారం యాదాద్రి పర్యటన సందర్భంగా స్వయంగా ప్రకటించారు. ఒక్కరోజులోనే సుమారు 22 కిలోల పసిడి విరాళంగా సమకూరింది. హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ పార్థసారథిరెడ్డి 5 కిలోల బంగారాన్ని విరాళమివ్వనున్నట్లు ప్రకటించారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరఫున కిలో బంగారం ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. చినజీయర్ స్వామి పీఠం నుంచి కిలో బంగారం, మంత్రి మల్లారెడ్డి కుటుంబం తరఫున కిలో, మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తరఫున కిలో, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి తన రెండు వస్త్ర సంస్థల తరఫున రెండు కిలోలు, కావేరి సీడ్స్ అధినేత భాస్కర్‌రావు కిలో, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు కిలో బంగారం, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, ఏపీలోని కడప జిల్లా చిన్న మండెం జడ్పీటీసీ సభ్యురాలు, వ్యాపారవేత్త మోడెం జయమ్మ ఒక్కొక్కరు కిలో బంగారం చొప్పున ఇస్తామని ప్రకటించారు.
ప్రతి గ్రామం భాగస్వామి కావాలి
బంగారు తాపడానికి రూ.65 కోట్ల వరకు ఖర్చవుతుందని సీఎం తెలిపారు. ఇది ప్రభుత్వానికి పెద్ద భారం కాదని... కానీ ఈ బృహత్ కార్యంలో ప్రతి గ్రామం భాగస్వామి అయి యాదాద్రి తమదే అనే భావన రావాలంటే ఎంతో కొంత విరాళం ఇచ్చేలా కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు. రిజర్వు బ్యాంకు నుంచి 125 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని కొని స్వర్ణతాపడానికి ఉపయోగిస్తామన్నారు. ఈ క్రతువుకు ఒక కమిటీని నియమిస్తామని వెల్లడించారు.