Yadadri Temple Works: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు సులువుగా చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తోంది. కొండ చుట్టూ రూ.143 కోట్ల ఖర్చుతో 5.09 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో చేపట్టిన వలయ రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చే దారులు కలిసే చోట కూడళ్లు నిర్మిస్తున్నారు. వలయ రహదారికి ఇరువైపులా, విభాగినులు, కూడళ్ల మధ్యలో మొక్కలు పెంచుతున్నారు. వలయ దారి ద్వారా కొండపైన స్వామి సన్నిధికి.. కింద భక్తులు తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట, పుణ్యస్నానాలు ఆచరించేలా లక్ష్మీ పుష్కరిణి, దీక్షాపరుల మండపం, ఆ పక్కనే వ్రత మండపం, అన్నప్రసాద మండపం, ఆ సమీపంలో ఆలయ నగరికి చేరుకోవచ్చు.
ధ్వజస్తంభానికి బంగారు కవచాలు...
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ మహా ముఖమండపం పసిడి కాంతులతో మెరువనుంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానాలయంలో ధ్వజస్తంభానికి బంగారు తొడుగు పనులను వైటీడీఏ అధికారులు ప్రారంభించారు. సుమారు 1,785 గ్రాముల మేలిమి బంగారంతో చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ ద్వారా ధ్వజస్తంభానికి స్వర్ణ తాపడాలు తయారు చేయించారు.