Yadadri Temple Reopening: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి.. స్వయంభువుల దర్శనానికి భక్తులకు సమయం ఆసన్నం అవుతోంది. ఈనెల 21న మహాసంప్రోక్షణతో ఈ చారిత్రక ఘట్టానికి యాడా అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా సోమవారం ప్రారంభం కానున్న అంకురార్పణకు పంచనారసింహుల సన్నిధి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. బాలాలయంలో వారంపాటు జరగనున్న పంచకుండాత్మక మహాయాగం కోసం కుండాలు ఏర్పటయ్యాయి. నలువైపులా ప్రవేశ ద్వారాలను శనివారం ఏర్పాటు చేశారు. పంచనారసింహుల గర్భాలయంలో నీటితో శుద్ధి పర్వాలు నిర్వహించారు.
వివిధ వైష్ణవ క్షేత్రాల నుంచి 108 మంది పారాయణికులు, వేదపండితులు ఆదివారం సాయంత్రానికి ఇక్కడికి చేరుకోనున్నారు. కొండపైకి వచ్చి వెళ్లేందుకు కనుమ రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేశారు. కొండ కింద ఆలయ వనరులు, గండి చెరువు, వీవీఐపీల అతిథి గృహాలకు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న పైవంతెన పనులు తుది దశలో ఉన్నాయి. క్షేత్రానికి నిరంతరం విద్యుత్తు సరఫరా అందించాలని ట్రాన్స్‌కో అధికారులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ప్రధానాలయంలోని అష్టభుజ మండప ప్రాకారాలు బంగారు వర్ణంలో మెరిసిపోయేందుకు అవసరమైన విద్యుదీకరణ ఏర్పాట్లను యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ (వైటీడీఏ) పూర్తి చేసింది. స్వామివారి తెప్పోత్సవం జరిపే గండిచెరువుకు మల్లన్నసాగర్ నుంచి శనివారం గోదావరి జలాలు విడుదల కాగా.. ఆదివారం సాయంత్రానికి ఇక్కడకు చేరనున్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
అధర్వణ వేదం ఆధారంగా యాగం
బాలాలయంలో.. జ్వాలా, యోగానంద, గండభేరుండ లక్ష్మీనరసింహస్వామి పేరిట మండపంలో.. తూర్పు వైపు రుగ్వేదం ద్వారా.. దక్షిణాదిన యజుర్వేదం.. పశ్చిమదిశలో సామవేద.. ఉత్తర ముఖంగా కుండం ఏర్పరిచి.. అధర్వణ వేదం ఆధారంగా యాగాన్ని కొనసాగిస్తారు. ఈశాన్యంలో ఏర్పాటైన మహాలక్ష్మీ కుండంతో.. పంచకుండాత్మక సంపూర్ణ మహాయాగం కొనసాగనుందని పండితులు తెలిపారు. ఇప్పటికే అవసరమైన ద్రవ్యాలన్నింటినీ సమీకరిస్తున్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తెప్పించామని ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు.
మరో 8 నెలల పాటు బంగారం తాపడం పనులు
పునర్నిర్మితమైన పంచనారసింహుల ఆలయ ఉద్ఘాటనకు నిర్వహించే మహా సంప్రోక్షణ పర్వంలో పాల్గొనే.. వీవీఐపీలకు దేవస్థానం అందించనున్న ప్రత్యేక జ్ఞాపికలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆలయ సన్నిధిని శుద్ధి చేశారు. ప్రధానాలయ గోపురాలతో పాటు అష్టభుజి మండప ప్రాకారాలు, మాడవీధులనూ శుభ్రం చేశారు. స్వర్ణ తాపడం పనుల్లో భాగంగా ముందుగా ఆలయ విమానానికి రాగి తొడుగులను అమర్చి పరిశీలించారు. బంగారం తాపడం పనులు.. మరో 8 నెలల పాటు కొనసాగనుందని.. ఈవో గీతారెడ్డి తెలిపారు.
భక్తులకు జియో ట్యాగింగ్