తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri Temple EO: 'మహాకుంభ సంప్రోక్షణకు అందరూ ఆహ్వానితులే'

Yadadri Temple EO: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉద్ఘాటనకు సర్వం సిద్ధమైంది. ఈనెల 28న జరిగే మహాక్రతువుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతారెడ్డి తెలిపారు. 21న అంకురార్పణతో ప్రారంభమై 28న పూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ తర్వాత దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఈవో తెలిపారు. ఆలయ ఉద్ఘాటన సందర్భంగా బాలాయంలో భక్తులకు దర్శనం యధావిధిగా కొనసాగుతుందని 28న మాత్రం మధ్యాహ్నం రెండు గంటల తర్వాతే స్వయంభూల దర్శనానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో స్వామివారి దర్శనం, సేవల కోసం బుకింగ్ చేసుకోవచ్చంటున్న ఈవో గీతారెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

Yadadri
Yadadri

By

Published : Mar 19, 2022, 5:10 AM IST

Updated : Mar 19, 2022, 6:14 AM IST

'మహాకుంభ సంప్రోక్షణకు అందరూ ఆహ్వానితులే'

Yadadri Temple EO: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలకు ఎవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదని, అందరూ ఆహ్వానితులేనని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) గీత వెల్లడించారు. ఎవరైనా ముఖ్యులు వస్తే ఆలయ ప్రొటోకాల్‌ ప్రకారం మర్యాదలు చేస్తామని తెలిపారు. చినజీయర్‌ స్వామి నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ నెల 21న ఉదయం 9 గంటలకు ఉద్ఘాటనకు అంకురార్పణ జరుగుతుందని, 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతారని చెప్పారు. మార్చి 28న ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ అనంతరం... పూజాది కార్యక్రమాల తర్వాత భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పిస్తామన్నారు. దీంతో ఈ మహత్తర ప్రాజెక్టులో తొలి ఘట్టం పూర్తవుతుందని, ఆలయనగరి అభివృద్ధిని త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రధానాలయానికి అనుబంధంగా నిర్మించిన శివాలయాన్ని ఏప్రిల్‌ 25న ప్రారంభించనున్నామని వెల్లడించారు.

పంచకుండాత్మక మహాయాగం...

బాలాలయంలో ఈ నెల 21 నుంచి 27 వరకు పంచకుండాత్మక మహాయాగం జరుగుతుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఈ యాగాన్ని సందర్శించవచ్చు. మార్చి 28న ఉదయం మహాపూర్ణాహుతితో ఇది పూర్తవుతుంది. అక్కడి నుంచి సువర్ణమూర్తులను శోభాయాత్ర ద్వారా ప్రధానాలయంలోకి తీసుకువస్తాం. ఆలయ గోపురాలకు మహాకుంభ సంప్రోక్షణ అనంతరం కలశాలనుబిగించి, ప్రధానాలయంలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ క్రతువు మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతే భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పిస్తాం.

భక్తులకు జియో ట్యాగింగ్‌

వివిధ ప్రాంతాల నుంచి యాదాద్రికి వచ్చే భక్తులు కొండపైకి చేరుకోవడానికి ఆర్టీసీ ఈ నెల 25 నుంచి 75 బస్సులను ఏర్పాటు చేస్తోంది. కొండపైకి చేరిన భక్తులు నేరుగా దర్శన వరుసల సముదాయంలోకి ప్రవేశిస్తారు. ఈ ప్రవేశ ద్వారం వద్దే భక్తులకు జియోట్యాగింగ్‌ చేస్తాం.దర్శనం పూర్తయి కొండ కిందకు వెళ్లే వరకు ప్రతి భక్తుడి పూర్తి సమాచారం మా దగ్గర ఉంటుంది. దీనివల్ల నిత్యం స్వామివారిని ఎంత మంది దర్శించుకున్నారో తెలుస్తుంది. మరో వైపు కొండపైన భక్తుల రద్దీ ఏర్పడితే కిందనే వారిని కొద్దిసేపు ఆపే వెసులుబాటు దీని ద్వారా లభిస్తుంది.

భక్తులకు అన్నప్రసాదం

ఈ నెల 28న కొండ కింద గల కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, వ్రత మండపాలను ప్రారంభిస్తాం.నాటి నుంచే కొండ కింద అన్నప్రసాదాన్ని ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు దేవాలయం తరఫున అందజేస్తాం.ప్రత్యేక దర్శనాలు, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల బుకింగ్‌ సౌకర్యాలన్నీ ఈ నెల 29 నుంచి అందుబాటులోకి వస్తాయి. మరిన్ని వసతుల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

స్వర్ణతాపడానికి విరాళాల వెల్లువ

స్వామివారి విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి ఇప్పటివరకు రూ.17.30 కోట్ల నగదుతో పాటు ఐదు కిలోల బంగారం విరాళంగా వచ్చింది. ప్రస్తుతం రాగి తాపడం పనులు జరుగుతున్నాయి. దీనిపై బంగారు తాపడం పనులు ఈ నెల 27న మొదలవుతాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నాం. దేవాలయ సిబ్బందికి, జర్నలిస్టులకు క్షేత్రంలో ఇళ్ల స్థలాల కేటాయింపు విషయమై మంత్రులు, అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే సమావేశాలు నిర్వహించి విధివిధానాలు వెల్లడిస్తాం.

ఏర్పాట్లు ముమ్మరం

మహాయాగం నిర్వహణ కోసం శుక్రవారం పంచకుండాల నిర్మాణం కొనసాగింది. అవసరమయ్యే ద్రవ్యాలన్నింటినీ సమీకరిస్తున్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తెప్పించారు. ఆలయ సన్నిధిని శుద్ధి చేశారు. ప్రధానాలయ గోపురాలతోపాటు అష్టభుజి మండప ప్రాకారాలు, మాడవీధులనూ శుభ్రం చేశారు. స్వర్ణ తాపడం పనుల్లో భాగంగా ముందుగా ఆలయ విమానానికి కొన్ని రాగి తొడుగులను అమర్చి పరిశీలించారు.

ఇదీ చూడండి: మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం.. ఆ తర్వాతే దర్శనాలకు అనుమతి: ఈవో

Last Updated : Mar 19, 2022, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details