వైష్ణవ పీఠాధిపతి త్రిదండి చిన్న జీయర్ స్వామి సలహా సూచనలతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని యాదాద్రిగా నామకరణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పూర్తిస్థాయిలో తెలంగాణకు మకుటంలా నిలిచేలా క్షేత్రాభివృద్ధి చేపడుతున్నారు. ఆధార శిల నుంచి శిఖరం వరకు ఏకజాతికి చెందిన కృష్ణశిలను వినియోగించడం అత్యంత విశేషమని చెప్పుకోవచ్చు. నాలుగున్నర ఏళ్లలో స్తంభోద్భవుని సన్నిధితో పాటు అనుబంధ శివాలయం పునర్నిమితమై, ఆకర్షణీయం, అద్భుతంగా మారాయి.
కాకతీయ కళాతోరణాలు, దేవతామూర్తులు, అష్టలక్ష్మి రూపాలతో సాలాహారాలు, వైష్ణవతత్వాన్ని నలుదిశలా చాటిన ఆళ్వారుల విగ్రహాలు.. భక్తజనులను అబ్బురపరిచేలా, జగమంతా అభివర్ణించేటట్లు యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంగా ఆవిష్కృతమవుతోంది. దాదాపు ఆలయాల కట్టడాలు పూర్తయి చిట్టచివరి పనులతో తుదిమెరుగులు దిద్దుకుటోంది. ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా రూ. రెండు వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన అభివృద్ధి పనులు ఇప్పటివరకు రూ. 780 కోట్లు అయినట్లు ప్రాధికార సంస్థ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు ఈటీవీ భారత్‌కు తెలిపారు.
యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులు పూర్తి కావాల్సిన కట్టడాలు ఇవే
ప్రధాన ఆలయాన్ని 4.03 ఎకరాలకు విస్తరించి మాడ వీధులు, అష్టభుజ మండప ప్రాకారాలు.. తూర్పున బ్రహ్మోత్సవ మండపం, పశ్చిమ దిశలే వేంచేపు మండపంతో తీర్చిదిద్దారు. ఆలయ ప్రవేశ మార్గాన ఇరువైపులా భక్తితత్వాన్ని పెంచే ప్రతిమలు, పడమర తూర్పు రాజగోపురాల వద్ద ఐరావతం, దక్షిణ, ఉత్తరాన సింహం, రాతి విగ్రాహాలు ఏర్పాటయ్యాయి.
యాదాద్రి దేవస్థానం ప్రహరీగోడ ప్రధానాలయ తొలి ప్రాకారంలో 12 అడుగుల ఎత్తులో 12 మంది ఆళ్వారుల ప్రతిమలు.. ఆపైన కాకతీయ కళాశిల్పాలు నిర్మించారు. ద్వితీయ ప్రాకారంలో లోపలివైపు యాలీ స్తూపాలు, బాహ్య మండపం ప్రాకారంలో ఏకశిల స్తంభాలను వివిధ ఆకృతులతో తీర్చిదిద్దారు. రాజ గోపురాలు, గర్భాలయానికి టేకు ద్వారాలు బిగించారు..శివాలయం పునర్నిర్మాణం పూర్తి కావొస్తోంది.
ఇంకా జరగాల్సినవి....
- ఆలయ గోపురాల పై కలశ ప్రతిష్ఠ
- ముఖమండపంలో ధ్వజస్తంభం ఏర్పాటు
- ఆలయ ప్రహరీ గోడలకు సంప్రదాయ హంగులు
- ఆలయ విమానానికి బంగారు తొడుగులు
- దర్శన వరుసల సముదాయం
- ప్రసాదాల తయారీ, విక్రయశాల
- విష్ణు పుష్కరణి గ్రీనరీ ఏర్పాట్లు
- కొండ కింద మౌలిక వసతులు