yadadri temple: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మార్చి 4వ తేదీ నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలను ముగించారు. ఈ సందర్భంగా బాలాలయంలో 108 కలశాలను వరుసగా పేర్చి.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 108 కలశాల్లో ఉన్న జలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించి.. స్వామి అమ్మవార్లను గర్భాలయంలోకి తీసుకెళ్లారు. అంతకు ముందు దాదాపు 2 గంటల పాటు శాస్త్రోక్తంగా హోమం నిర్వహించారు. పండితులు, పారాయణ దారులను సన్మానించారు.
గర్భాలయ మహాద్వారము చుట్టూ గల రాతి గోడకు కు పుత్తడి మెరుగులు
పంచనారసింహుల గర్భాలయ మహాద్వారాము పక్కన గల రాతి గోడను స్వర్ణమయం చేసేందుకు యాడాఅధికారులు చర్యలు చేపట్టారు. మహాద్వార తలుపులను స్వర్ణ కవచాలతో గతంలోనే అమర్చారు. స్వర్ణ కలశాలతో ఆలయ గోపురాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించనున్నాయి. కృష్ణశిలతో నిర్మితమైన ఆలయ ప్రాకారాలపై గల విమానాలపై రాగి కలశాలను ఇప్పటికే బిగించారు. ఆరు రాజగోపురాలు, ఒక విమానంపై స్వర్ణ కలశాల ఏర్పాట్లు మొదలయ్యాయి. పనులను ఈనెల 28లోగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.