Yadadri Temple Hundi income : ప్రముఖ దివ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కించారు. 34 రోజులకు గాను కోటి 29లక్షల 60వేల 607 రూపాయల నగదు, 148 గ్రాముల బంగారం, 4 కిలోల 820 గ్రాముల వెండిని భక్తులు స్వామి వారికి సమర్పించారు. గుడి కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి, ఆలయ ఛైర్మన్ నరసింహ మూర్తి పర్యవేక్షణలో హరితహోటల్‌లో హుండీ లెక్కింపు చేపట్టారు.
ఆధ్యాత్మికం.. హరితమయం..
మరోవైపు పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆధ్యాత్మికతతో పాటు పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఆహ్లాదం పంచడానికి పెద్దగుట్టను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. రకరకాల పూల మొక్కలు, చక్కటి అమరికతో రహదారులు, కూడళ్లు, వలయాలు కనువిందు చేస్తున్నాయి.
ఊటీని తలపిస్తున్న యాదాద్రి
ఎత్తైన కొండలు, పచ్చని మొక్కలు, నిండుగా పరుచుకున్న మంచు దుప్పటి... వెరసి ఉదయం వేళ ఈ క్షేత్రం ఊటీని తలపిస్తోంది. నారసింహుని దర్శనానంతరం భక్తులు ముచ్చటగొలిపే ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
కృష్ణ శిలకు రంగులహంగులు...
యాదాద్రి పుణ్యక్షేత్రంలోని విష్ణు పుష్కరిణిని కృష్ణశిల రంగులతో తీర్చిదిద్దుతున్నారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండపై గల ఈ పుష్కరిణిని పునరుద్ధరించే పనులు చేపట్టిన విషయం తెల్సిందే. గతంలోని పుష్కరిణిని కుదించి... ఆలయ కైంకర్యాల కోసమే సదరు పుష్కరిణిని తీర్చిదిద్దుతున్నారు. క్రమంలో చుట్టూ మెట్లకు రంగులను వేస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవం వరకు అన్ని హంగులతో విష్ణు పుష్కరిణి ఆవిష్కృతంకానుందని అధికారులు చెబుతున్నారు.
పూల మొక్కలతో సుందరంగా ముస్తాబు శరవేగంగా పనులు
Yadadri Temple News: మహాదివ్య క్షేత్రంగా పునర్నిర్మితమవుతోన్న యాదాద్రి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మార్చి 28 న మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా.. పనుల్లో వేగం పెరిగింది. ఆలయ గోపురాలు, దివ్య విమానంపై స్వర్ణ కలశాల ఏర్పాట్లకు యాడా చర్యలు చేపట్టింది. ఎత్తైన ఆరు రాజగోపురాల పైన, దివ్య విమానంపై శ్రీ సుదర్శన చక్రం ప్రతిష్ఠించనున్నారు. ప్రస్తుతం గోపురాలపై కలశాల స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తయిన అనంతరం కలశాల స్థాపన జరగనుంది.
బ్రహ్మోత్సవాలకు వేళాయే..
Yadadri brahmotsavam 2022 dates : రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి 14 వరకు జరగనున్నాయి. పదకొండు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవం దగ్గరపడుతోంది . మరోవైపు పంచ నారసింహుల ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా నిలిచిపోయిన గర్భాలయంలోని మూలవర్యుల నిజ దర్శనాలకు తెర తీసేందుకు 'మహాకుంభ సంప్రోక్షణ'... తొలుత శ్రీ సుదర్శన మహా యాగం నిర్వహించనున్నారు. ఈ మహాక్రతువులకు రెండు వారాల ముందే వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
వార్షిక బ్రహ్మోత్సవాలు
ఈ మహాదివ్య పుణ్యక్షేత్రం ఖ్యాతి నలుదిశలా వ్యాపించేలా బాలాలయంలోనే వార్షిక ఉత్సవాలను 2017 నుంచి కొనసాగిస్తున్నారు. ఏటా ఫాల్గుణ మాసంలో నిర్వహించే స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి మార్చి4 నుంచి మొదలవుతాయని దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీస్వామి, అమ్మవార్ల తిరు కల్యాణమహోత్సవం అదే నెల 11(నవమి)న నిర్వహిస్తారు. మార్చి 14న ఏకాదశి రోజున ఉత్సవాలు ముగుస్తాయి.
ఇదీ చదవండి:వైష్ణవతత్వం ఉట్టిపడేలా ముస్తాబవుతున్న పంచ నారసింహుల దివ్యక్షేత్రం