ముమ్మరంగా సాగుతున్న థర్మల్ విద్యుత్కేంద్రం పనులు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి సూపర్ క్రిటికల్ అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్కేంద్రాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. కీలకమైన టర్బైన్ల నిర్మాణంపై దృష్టి సారించింది. టెండర్ పనులు పూర్తి కాగానే నిర్దేశిత స్థలంలో సమాంతరంగా పనులు చేసేందుకు బీహెచ్ఈల్ కసరత్తు చేస్తోంది.
ప్రాజెక్టు ఖర్చు రూ.29,665 కోట్లు తొలుత 25 వేల 99 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు అదనంగా 4 వేల 566 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. పెరిగిన అంచనాలకు థర్మల్ కేంద్రాల నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్ల్యూ గ్యాస్ డీ సల్ఫరైజేషన్ ప్రక్రియను అమలు చేయబోతుండటమే ప్రధాన కారణం.
కాలుష్య నియంత్రణకుపెద్దపీట.... కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రాజెక్టుకు సేకరించిన 5 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు పచ్చదనం కోసం కేటాయించారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును సరఫరా చేయడం కోసం విష్ణుపురం జంక్షన్ నుంచి ప్రత్యేక రైల్వే లైను సర్వే పూర్తి చేశారు. నీటి అవసరాల కోసం 3.1 టీఎంసీ సామర్థ్యం గల జలాశయాన్ని నిర్మించనున్నారు. విద్యుత్కేంద్రం నుంచి విడుదలయ్యే బూడిదను నిల్వ చేయడానికి 420 ఎకరాలు కేటాయించి అందులో యాష్పాండ్ను ఏర్పాటు చేయనున్నారు. యాష్పాండ్, గ్రీన్ బెల్ట్, జలాశయ నిర్మాణం, రైల్వే లైను పనులను సమాంతర పద్ధతిలో చేపడతామని అధికారులు పేర్కొన్నారు.