తెలంగాణ

telangana

ETV Bharat / state

YADADRI: పసిడి వర్ణంలో మెరిసిపోతున్న 'యాదాద్రి' - యాదాద్రి ఆలయం

యాదాద్రి పంచనారసింహుల ఆలయ సన్నిధిలో పసిడి వర్ణంలో వివిధ వనరులను సమకూరుస్తున్నారు. ఈ ఆలయ విశిష్టత నలుదిశలా వ్యాపించేలా వివిధ వనరుల కల్పనకు వైటీడీఏ శ్రమిస్తోంది. మరోవైపు యాదాద్రి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట దేవాలయంలో మూలవర్యులైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు ఇవాళ్టి నుంచి పునఃప్రారంభమయ్యాయి.

YADADRI: పసిడి వర్ణంలో మెరిసిపోతున్న యాదాద్రి పంచనారసింహుల ఆలయం
YADADRI: పసిడి వర్ణంలో మెరిసిపోతున్న యాదాద్రి పంచనారసింహుల ఆలయం

By

Published : Jul 19, 2021, 10:36 AM IST

Updated : Jul 19, 2021, 1:03 PM IST

YADADRI: పసిడి వర్ణంలో మెరిసిపోతున్న 'యాదాద్రి'

కృష్ణశిలతో రూపొందిన యాదాద్రి పంచనారసింహుల ఆలయ సన్నిధిలో పసిడి వర్ణంలో వివిధ వనరులను సమకూరుస్తున్నారు. స్తంభోద్భవుడి సన్నిధి సహజసిద్ధంగా ఆవిష్కృతం కావాలన్నదే సీఎం కేసీఆర్‌ ప్రధానాశయం. ఒకే జాతికి చెందిన కృష్ణశిలతో పంచనారసింహులు కొలువైన ఆలయ ప్రాంగణాన్ని రూపొందించారు. ఇంకెక్కడా లేని తరహాలో అష్టభుజ మండప ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయ విశిష్టత నలుదిశలా వ్యాపించేలా వివిధ వనరుల కల్పనకు వైటీడీఏ(యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ) శ్రమిస్తోంది. అద్దాల మండపం, దర్శన వరుసలతో కూడిన మందిరం, రాజగోపురాల ద్వారాలకు తలుపులు, ప్రత్యేక విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి.

అద్దాల మండపం..

దాత ఆర్థిక సహకారంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రెండో ప్రాకారం లోపల మన్నిక గల అద్దాలతో చుట్టూనే కాకుండా నలువైపులా మండపం సిద్ధమవుతోంది. కృష్ణశిల స్తూపాలను పసిడి వర్ణంతో తీర్చిదిద్దుతున్నారు. మధ్యలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిమూర్తులతో ఊంజల్‌ సేవ నిర్వహణకు బంగారు వర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 12 మంది ఆళ్వారులతో కూడిన ద్వారం సిద్ధమైంది. కృష్ణశిలతో సిద్ధం చేసిన ఐరావతం విగ్రహాలు మండపం ఎదుట స్వాగతించేలా ఆవిష్కృతం కానున్నాయి.

మాడవీధుల్లో..


ప్రధానాలయం మాడ వీధుల్లో ప్రత్యేక ప్రణాళిక ద్వారా దర్శన వరుసలను మందిరం రూపంలో తీర్చిదిద్దుతున్నారు. అల్యూమినియంపై బ్రాస్‌ కోటింగ్‌తో వీటి ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ఆలయ నిర్మాణానికి అనుగుణంగా దర్శన వరుసలు ఆధ్యాత్మికతను పెంపొందించేలా స్వామి భక్తులను అలరించనున్నాయి. దైవ దర్శనాలకు వేచి ఉండే భక్తులకు ఎండ, వానలతో ఇబ్బందులు తలెత్తకుండా పైకప్పుతో నిర్మితమవుతున్నాయి.

పసిడి కాంతులు

ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో బెంగళూరుకు చెందిన నిపుణులతో ఆలయానికి జిగేల్‌ మనిపించేలా లైటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి పర్యవేక్షణలో పసిడి కాంతులతో క్షేత్ర స్థాయికి తగ్గట్లు విద్యుద్దీకరణ పనులు సాగుతున్నాయి.

ఇత్తడి ద్వారాలు

లయ నలువైపులా గత రాజగోపురాలు సహా ఉప ఆలయాలకు ఇత్తడి తొడుగులతో కూడిన తొమ్మిది ద్వారాలను బిగించనున్నారు. మరో నాలుగు వెండి ద్వారాలను పెంబర్తి కళాకారులతో రూపొందిస్తున్నారు. ఆ క్రమంలో ప్రసుత్తం ఆలయ ప్రవేశ మార్గంలోని ద్వారానికి ఇత్తడి తలుపులను బిగించిన విషయం విదితమే.

పాతగుట్టలో మళ్లీ మొదలైన దర్శనాలు

యాదాద్రి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట దేవాలయంలో మూలవర్యులైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం గర్భాలయ ద్వార పునఃప్రతిష్ఠ మహోత్సవం చేపట్టారు. తర్వాత మూలవర్యులను దర్శించుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించారు. ఈ క్రమంలో సంప్రదాయంగా హోమాది పూజలు, సంప్రోక్షణ పర్వం నిర్వహించారు. వేద, మంత్ర పఠనంతో కొనసాగిన విశిష్ట పర్వాల్లో ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తి, పేష్కార్‌ భాస్కర్‌శర్మ, ద్వార ప్రతిష్ఠాపర్వం దాత మురార్జీ, ఆలయోద్యోగులు పాల్గొన్నారు. గర్భగుడిలోని స్వర్ణ కవచమూర్తులు కనపడటం లేదని భక్తుల ఫిర్యాదు మేరకు గర్భాలయ ప్రధాన ద్వారాన్ని విస్తరించారు. ఈ పనుల నిర్వహణకు ఈ నెల 6వ తేదీ నుంచి స్వామివారి దర్శనాలు నిలిపారు.

అష్టోత్తర శతఘటాభిషేకం

ఆదివారం స్వాతి నక్షత్రం కావడంతో స్వామి జయంతి వేడుకను అష్టోత్తర శత ఘటాభిషేకం ద్వారా నిర్వహించారు. ఈ పర్వాలతో స్వామి మూలవర్యుల దర్శనాలకు తెరతీశారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి: త్వరలో కేసీఆర్ మరో కొత్త పథకం.. భారీగా నిధుల కేటాయింపు!

Last Updated : Jul 19, 2021, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details