Yadadri Brahmotsavalu: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై బాలాలయ మండపంలో ఊరేగుతూ కనువిందు చేశారు. వజ్రవైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ ధగధగ మెరిసిపోయారు. గరుడ వాహనంపై కొలువుదీరిన నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
శ్రీ మహా విష్ణు అలంకారంలో మెరిసిపోతున్న యాదగిరీశుడు స్వర్ణ రథంపై రథోత్సవం
కాసేపట్లో బాలాలయంలో మొదటిసారిగా స్వర్ణ రథంపై స్వామివారిని ఊరేగిస్తూ రథోత్సవం నిర్వహించనున్నారు. దివ్యవిమాన రథోత్సవ వేడుక కార్యక్రమంలో భాగంగా స్వామివారిని ఈ స్వర్ణరథంపై వైభవంగా ఊరేగించనున్నారు. ఈ బంగారు రథం ఆలయంలో భక్తులను, చూపరులను ఆకట్టుకుంటోంది.
యాదాద్రీశుని స్వర్ణ విమాన గోపురానికి విరాళం అందిస్తున్న భక్తుడు దాతల సహకారంతో
పంచనారసింహుల దివ్య సన్నిధానంలో, యాదాద్రి ఆలయ దివ్యరథాన్ని స్వర్ణమయంగా మార్చేందుకు చెన్నై నుంచి బంగారు కవచాలు 2 రోజుల క్రితం ఆలయానికి వచ్చాయి. దాతల సహకారంతో హైదరాబాద్లోని శ్రీలోగిళ్లు, లాండ్మార్క్కు చెందిన ఎండీలు ఈ ఆలయానికి చెందిన టేకు రథాన్ని స్వర్ణ రథంగా రూపొందించేందుకు ముందుకొచ్చాయి. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ నిపుణులు తయారుచేసిన కవచాలకు ఇటీవల పూజలు నిర్వహించి బిగింపు పనులు పూర్తిచేశారు.
విద్యుద్దీపాల వెలుగులు
11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 14 న ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. బాలాలయ ప్రాంగణం, పరిసరాలలో రాత్రి వేళలో కాంతులు విరజిమ్మేలా విద్యత్ దీపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొండకింద పట్టణంలో ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. వెలుగులు సంతరించుకొని చూపరులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి:Yadadri Golden chariot: యాదాద్రిలో పూర్తయిన స్వర్ణరథం