తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆపాత శిల్పం... మహిమ అమోఘం - యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తాజా వార్తలు

దేవుడు ఒక్కడే...రూపాలే అనేకం అంటారు ఆధ్యాత్మికవేత్తలు. దైవీభావం ఒకటే … కల్పించుకునే రూపాలే బహువిధం అని కూడా పురాణవేత్తలు శలవిస్తారు. పురాతన కాలం నాటి ఆలయాల మూర్తులు అస్పష్టంగా ఉంటాయి. నేటి ఆధునిక శిల్పుల వలే స్పష్టమైన ఆకృతిని ఆనాటి శిల్పులు ఇవ్వలేకపోయారు. స్వయంభువై వాటంతటవే వ్యక్తమైన విగ్రహాలు కూడా అస్పష్టంగా ఉన్నాయని, వాటిని అమూర్త స్వరూపాలని చెబుతారు. అమూర్త స్వరూపాలకు అమోఘమైన మహిమలుంటాయని అనాదిగా వస్తున్న ఓ విశ్వాసం. యాదాద్రి దేవస్థానంలోనూ అటువంటి అమూర్త దేవతా విగ్రహాలున్నాయి. పంచనారసింహ స్వరూపాల్లో గండభేరుండ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం అమూర్త్యశిల్పంగా దర్శనమిస్తుంది. ఆ విగ్రహం ఎంతో విలక్షణంగా, మహిమాన్వితమైనదిగా భక్తజన పూజలందుకుంటోంది. "ఆపాత శిల్పం... మహిమ అమోఘం" అన్నరీతిలో అటువంటి విగ్రహాలు నేటికీ విరాజిల్లుతున్నాయి.

Laxmi Narasimha swamy
యాదాద్రి

By

Published : May 24, 2021, 7:54 PM IST

ఆపాత శిల్పం... మహిమ అమోఘం

యాదాద్రిని వైభవయాదాద్రిగా తీర్చిదిద్దాలనుకున్న యాదాద్రి ఆలయ అభివృద్ధి సాధికార సంస్థ ఒక ముఖ్యమైన అంశాన్ని పరమనిష్ఠగా పాటించింది. పురాతన నారసింహుని ఆలయంలోని ప్రధాన సంప్రదాయాలను, విశ్వాసాలను, మూలవిరాట్టులను ఏమాత్రం ముట్టకుండా, వాటి కేంద్రకంగా వాటి చుట్టూ వైభవ విస్తరణ చేశారు. అలనాటి ప్రాచీన దేవునికే కొత్తకోవెలను విస్తరించి విన్నూత్న రూపాన్ని సంతరింపజేశారు. పురావైభవానికి నూత్న వైభవాన్ని కల్పించారు. అందుకే ఆనాటి అస్పష్ట విగ్రహాలు, అమూర్త ప్రతిమలు, స్వయంగా వ్యక్తమయిన మూలవిరాట్టులకు ఏ విఘ్నవిఘాతాలు లేకుండా కాచికాపాడి, వాటిచుట్టూతా నిర్మాణాలు మాత్రమే చేశారు. దీనివల్ల యాదాద్రీశుని ఆగమ వాస్తు విశేషాలకు ఎటువంటి అవాంతరమూ వాటిల్లలేదు. చినజీయరుస్వామివారి నుంచి ఆలయ అర్చకులు, స్తపతులు అందరూ ఈ జాగ్రత్త పాటించి ఆలయ సంప్రదాయత, పవిత్రతలను కొనసాగింపజేశారు.

ఆంజనేయుడి సహకారంతోనే ఉగ్రనారసింహుని దర్శనం

పురాతన కాలం నాటి విగ్రహాలు, మూలవిరాట్ స్వరూపాలు, క్షేత్రపాలకుని విగ్రహం, ఆలయమూ అలాగే , అదే ప్రదేశంలో ఈ నూతన యాదాద్రి దేవస్థానంలో మనకు దర‌్శనమిస్తున్నాయి. ఈ ఆలయ క్షేత్రపాలకుడైన భక్తాంజనేయస్వామి అదే విగ్రహరూపంలో యథాతథంగా తీర్థయాత్రీకుల దర్శనార్థమై ఉన్నారు. ఆ మందిర విస్తరణను గమనిస్తే... పాత కాలపు కొండ అచ్చాదన అలాగే మనకు కనిపిస్తుంది. దానికి కొద్దిపాటి ఆధునిక నిర్మాణ విస్తరణ కానవస్తుంది. యాదాద్రి క్షేత్రపాలకుని మందిర తలుపులు తెరిస్తే కనిపించే స్వామి అలనాటి ఏకశిలా సింధూర వర్ణరంజిత మూర్తియే. ఒకపక్కకు తిరిగి నమస్కారముద్రతో ఉన్నఆంజనేయుని పాత విగ్రహమే దర్శనమిస్తుంది. అస్పష్ట ఆకృతిలో, ప్రాచీనత్వంతో ఈ మూర్తి అలరారుతోంది. నృసింహుని ఉగ్రరూప దర్శనం కోసం యాదమహర్షి తపమాచరించగా ఈ ఆంజనేయుడి సహకారంతోనే ఉగ్రనారసింహుని దర్శనం అయిందని స్థలపురాణం చెబుతోంది.

పంచనరసింహాకృతులలో గండభేరుండ లక్ష్మీనారసింహుని ఆకృతి

ఈ క్షేత్రపాలక ఆంజనేయుని మందిరానికి ఓ పక్కన ఉన్న కుడ్యంలోనే మహా మహిమాన్వితమైన విగ్రహ దర్శనం అవుతుంది. ఆ విగ్రహాచ్ఛాదన దర్శనం కోసమే భక్తులు ఎంతో తపించిపోతారు. అదే పంచనరసింహాకృతులలో గండభేరుండ లక్ష్మీనారసింహుని ఆకృతి. ఇది కూడా అస్పష్టరూపంలో స్పష్టమైన రూపురేఖలుండని అమూర్త శిల్పంలో గండభేరుండ నరసింహుల వారు కనిపిస్తారు. గుహల్లోనే ఆవిర్భవించిన నృసింహావతారానికి కచ్చితమైన ఆకృతిగా ఈ శిల్పరాజాన్ని చెబుతారు. ప్రతిమాశాస్త్రంలోనూ ఇటువంటి అమూర్తశిల్పాల గురించి విశ్లేషించారు. స్తపతులు కూడా ఇదే అంశాన్ని పరమభక్తిగా వ్యక్తపరుస్తున్నారు. దేవతా ప్రతిష్టితాలు, ఋషిప్రతిష్టితాలు, మానవప్రతిష్టితాలుగా ఈ ఆలయ విగ్రహాలను వర్గీకరిస్తారు. స్వయంగా వ్యక్తమైన విగ్రహాలు సహజసిద్ధమైన రాతిలో, భూమిలో మృత్తికాశిల్పాలుగా ఆవిర్భవిస్తాయని శిల్పశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

నిశింగణాపూర్‌లోని 9 అడుగుల ఎత్తున ఉన్న కఠిన కృష్ణశిల

ఆధ్యాత్మిక వేత్తలు ఇదే విషయాన్ని స్వామి తన రూపాన్ని అలా సహజసిద్ధమైన వాటిలో తమ రూపాన్ని కలిగిస్తారు. అలా తమ అంశల్ని వాటిలో ప్రత్యక్షం చేస్తారని అందుకే అవి స్పష్టమైన రూపంతో కాకుండా... భక్తుల ఊహల్లో స్వామి రూపాన్ని గ్రహించగలిగేలా ఉంటాయని చెబుతున్నారు. శ్రీశైలంలోని వృద్ధమల్లికార్జున లింగం స్వయంవ్యక్తమైనదే. అందుకే ఆ లింగంపై ముసలితనపు ముడతలు అగుపిస్తాయిని అంటారు. లింగం వరకు స్వయంవ్యక్తమూర్తి అయితే , దాని పానవట్టం క్రియామూర్తి. శనిశింగణాపూర్‌లోని 9 అడుగుల ఎత్తున ఉన్న కఠిన కృష్ణశిల శనైశ్చరుని అమూర్త రూపమే. అటువంటి ఎవ్వరూ చెక్కని స్వయం భూ, అస్పష్ట అమూర్త విగ్రహాలలో ఎంతో దైవశక్తి ఇమిడి ఉంటుందని ఓ పరమవిశ్వాసం. ఆ విశ్వాసానికి సాక్షాత్కార రూపమే ఈ గండభేరుండ లక్ష్మీనారసింహ స్వామి వారి అమూర్త మూర్తి. ఇదే రీతిలో ఆలయ ప్రధాన మూలవిరాట్టుగా నారసింహస్వామి గుండ్రాతి రూపంలోనే వ్యక్తమయ్యారని అర్చకస్వాములు భక్తులకు వివరిస్తున్నారు.

శ్రీవైకుంఠప్రతిరూపం ... నవగిరి యాదాద్రి విస్తరణా వైభవం

ఈ విధంగా స్వయం వ్యక్త దైవస్వరూప అమూర్త విగ్రహాలు అలాగే ఉంచి ఈ యాదాద్రి వైభవవిస్తరణ చేశారు. ఇదే ఆలయంలో అలనాటి గుహాంతర్భాగంలో తపమాచరించిన ఋషులచే ప్రతిష్టితాలు, ఋషి అర్చితమూర్తులూ ఉన్నాయి. మానవ ప్రతిష్టితాలుగా శిల్పులు చెక్కిన క్రియామూర్తులు వేలాది విగ్రహాలుగా ఈ భవ్యమందిరంలో నెలకొని ఉన్నాయి. అందుకే ఈ యాదాద్రి అపురూపమేకాదు... అరుదైన నల్లరాతి శిల్పాల ఉద్యానవనం అనాల్సినంతటి బృహద్దాలయం. తొమ్మిది కొండలలో నెలకొన్న శ్రీవైకుంఠప్రతిరూపం ... నవగిరి యాదాద్రి విస్తరణా వైభవం.

ఇదీ చదవండి:యాదగిరి గుట్ట చుట్టూ వినూత్నంగా ప్రదక్షిణా పథం

యాదాద్రి వెండిశిల్పఫలకాలపై ప్రహ్లాదచరితం

శైవవైష్ణవ సంగమ యాదాద్రి.. నూతనత్వంతో వినూత్న సొబగులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details