Yadadri Temple : గండిచెరువు వద్ద కట్టడాల నిర్మాణం వేగవంతం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచేలా తీర్చిదిద్దుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో.. కొండ కింద గండిచెరువు వద్ద చేపట్టిన కట్టడాల నిర్మాణాలు వేగవంతం చేశారు. క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. సకల సౌకర్యాలను కొండకింద సమకూరుస్తున్నారు.
యాదాద్రి క్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండకింద గండిచెరువు వద్ద చేపట్టిన కట్టడాల నిర్మాణాలను వేగవంతం చేశారు. గండిచెరువు వద్ద 10.20 ఎకరాల్లో రూ.66.43 కోట్ల వ్యయంతో కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం, లక్ష్మీ పుష్కరిణి, వ్రత మండపంతో పాటు అన్నప్రసాద భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. కొండపై ఆలయాలతో పాటు విష్ణు పుష్కరిణి, ప్రసాదాల సముదాయం ఏర్పాట్లు దాదాపు పూర్తికావొచ్చాయి. క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు కావాల్సిన సకల వసతులు గుట్టకింద సమకూరుస్తున్నారు.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో చేపట్టిన ఆ పనులు..
- స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసే దీక్ష భక్తుల మండపం పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఆర్నమెంటల్ పనులు కొనసాగుతున్నాయి.
- భక్తులు తలనీలాలను సమర్పించేందుకు కల్యాణకట్ట కట్టడంలో స్లాబ్(కప్పు) పనులను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 33 వేల చ.అ. స్లాబ్ వేశారు. ఇంకా 22 వేల చ.అ. స్లాబ్ వేయాల్సి ఉంది.
- భక్తుల పుణ్యస్నానాలకై లక్ష్మి పుష్కరిణి ఏర్పాటులో 70 శాతం పనులు పూర్తయ్యాయి. గదులు, ఆర్నమెంటల్, రేలింగ్ పనులను చేపట్టారు.
- 279 పిల్లర్లతో అన్నప్రసాద భవనం నిర్మాణాలు జరుగుతున్నాయి.
- శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతాల మొక్కులను తీర్చుకొనేందుకు భక్తులకు అనుగుణంగా మండపం నిర్మాణంలో పుట్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ కట్టడాలను ఎప్పటికప్పుడు ఆర్ అండ్ బి శాఖ పర్యవేక్షిస్తోంది.