రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ త్వరలో పూర్తిస్థాయిలో తెరచుకోనున్నాయి. భక్తుల మొక్కులు తీరనున్నాయి. కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను ప్రారంభించడానికి దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు మార్గదర్శకాల రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వైరస్ విజృంభణతో ఆరునెలలుగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు నిలిచిపోయాయి. ఆలయాలకు రాబడి బాగా తగ్గింది. ఉద్యోగుల వేతనాల చెల్లింపులు కష్టంగా మారాయి.
అనుమతి కోసం ప్రయత్నాలు
యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, బాసర, కొండగట్టు, కొమురవెల్లి ఆలయాల్లో ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలని దేవాదాయ శాఖ యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అతి త్వరలో ఉత్తర్వులు వెలువడవచ్చని అభిప్రాయపడుతున్నారు.