యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో దర్శన వరుసల భవనాన్ని విస్తరిస్తున్నారు. ఇందులోనే సీసీ కెమెరాల పుటేజీని వీక్షించే గదిని నిర్మిస్తున్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు. కొండపైన అన్ని శాఖలు, పరిసరాల్లో బిగించిన కెమెరాలను.. ఈ భవనంలో ఏర్పాటుచేసిన గదిలోని టీవీలకు అనుసంధానం చేస్తారన్నారు.
ఆసుపత్రి:దర్శన వరుసల సముదాయంలోనే దేవస్థానం ఆసుపత్రి ఏర్పాటుకానుంది. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అనారోగ్య సమస్యలు ఎదురైతే వైద్యం అందించడానికి ఆసుపత్రిని ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
చెప్పుల స్టాండు: ఈ భవనంలోనే భక్తుల పాదరక్షలను ఉచితంగా భద్రపరచుకోవడానికి విశాలమైన గదులను కేటాయించనున్నారు. చెప్పులు పెట్టుకోవడానికి చిన్నచిన్న పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు.
యాదాద్రిలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా గర్బాలయ ముఖ మండపం పైభాగాన ఆలయంలోనికి ప్రవేశించే ద్వారంపై శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఫ్లోరింగ్, రథశాల, ఆలయానికి తలుపుల బిగింపు, సాలహారాల్లో విగ్రహాల అమరిక, స్వామి వారి కల్యాణ మండపం, స్వాగత తోరణం, మండపాలకు కృష్ణ శిలను పోలిన రంగు ప్రాకారాల పనులు పూర్తయ్యాయి. ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి.