తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ(Yadadri temple) ఉద్ఘాటన పర్వానికి అడుగులు పడుతున్నాయి. పునర్నిర్మితమైన హరి, హరుల ఆలయాల్లో ముందస్తు కైంకర్యాలను యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(యాడా), ఆలయ నిర్వాహకులు శనివారం చేపట్టారు. ప్రధాన ఆలయంలోని పంచనారసింహుల సన్నిధిలో స్వర్ణ కలశాలకు, అనుబంధ శివాలయంలో రాగి కలశాలకు, రెండింటిలో ధ్వజస్తంభాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చినజీయర్ స్వామి సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు యాడా వైస్‌ఛైర్మన్ కిషన్‌రావు, ఈవో గీత తెలిపారు.
Yadadri temple : యాదాద్రి ఆలయ ఉద్ఘాటన వైపు అడుగులు - yadadri temple inauguration soon
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం(Yadadri temple) ఉద్ఘాటన పర్వానికి సమయం ఆసన్నమైంది. హరిహరుల ఆలయాల్లో ముందస్తు కైంకర్యాలు ప్రారంభించి, ప్రసాదాల తయారీ యంత్రాల ట్రయల్ రన్ నిర్వహించారు.
ప్రధానాలయ ముఖ మండపంలో స్వర్ణ కలశాలతోపాటు ధ్వజస్తంభం, బంగారు తొడుగులకు ప్రత్యేక శుద్ధి పూజలు చేశామన్నారు. మరోవైపు ప్రసాదాల తయారీ యంత్రాల ట్రయల్ రన్ (ప్రయోగాత్మక పరిశీలన) చేపట్టారు. అక్షయ పాత్ర సంస్థ రూ.13 కోట్ల వ్యయంతో ఈ యంత్రాలను ఏర్పాటు చేసింది. ట్రయల్ రన్‌లో స్వామివారి లడ్డూ, పులిహోర ప్రసాదాలను తయారు చేశారు. ఈ కార్యక్రమాల్లో వంశపారంపర్య ధర్మకర్త నరసింహమూర్తి, పూజారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
యాదాద్రి క్షేత్రం(Yadadri temple) విశ్వఖ్యాతి చెందేలా రూపొందించాలన్న కల.. హరిహరుల ఆలయాల పునర్నిర్మాణంతో సాకారం కాబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉద్ఘాటన పర్వాన్ని చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.