సమైక్య పాలకుల పాలనలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని సీఎం కేసీఆర్ (Cm Kcr) అన్నారు. సమైక్య పాలనలో ఆధాత్మిక అంశంలో నిరాదరణకు గురైందన్నారు. గతంలో పుష్కరాలు కూడా తెలంగాణలో నిర్వహించలేదని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కర శోభ ప్రపంచానికి తెలియజేసినట్లు సీఎం వివరించారు. ఆధ్యాత్మిక సంపద ఉన్న ప్రాంతం తెలంగాణ అని సీఎం చెప్పారు. 50 ఏళ్ల క్రితం బాల్యంలో యాదాద్రి(Yadadri)కి తొలిసారి వచ్చినట్లు సీఎం గుర్తుచేసుకున్నారు.
ఆధ్యాత్మిక ఉపాసకులు నడయాడిన ప్రాంతం తెలంగాణ అని కేసీఆర్ (Cm Kcr) అన్నారు. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి గతంలో ప్రాచుర్యం కల్పించలేదన్న సీఎం... పుష్కరాల్లో తాను జోగులాంబ ఘాట్‌లోనే పుణ్యస్నానం ఆచరించినట్లు తెలిపారు. యాదాద్రి అభివృద్ధి కోసం నాలుగైదేళ్ల క్రితం బీజం వేసినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మహోత్కృష్టమైన ఆలయాల్లో ప్రముఖమైనది యాదాద్రి ఆలయమని పేర్కొన్నారు. 50 ఏళ్లుగా అభివృద్ధి పనులతో తిరుమల నేడు దివ్యక్షేత్రంగా దర్శనమిస్తోందని సీఎం అన్నారు. ఆగమ నియమ నిబంధనల మేరకు యాదాద్రి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.