తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లాలో దశాబ్దకాలంలోనే ఈ సీజన్‌లో అత్యధిక వర్షపాతం

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలు పైకి ఉబికివచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని 71 మండలాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని తాజాగా భూగర్భ జల శాఖ వెల్లడించిన నివేదికలో పేర్కొనడం విశేషం.

Yadadri district has received the highest rainfall during the season in a decade
జిల్లాలో దశాబ్దకాలంలోనే ఈ సీజన్‌లో అత్యధిక వర్షపాతం

By

Published : Sep 19, 2020, 5:59 PM IST

కరవు పీడిత, ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు లేని యాదాద్రి జిల్లాలో గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వర్షాలు కురిశాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ జిల్లాలోని మొత్తం 17 మండలాల్లో అన్ని మండలాల్లోనూ 40 శాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడం గమనార్హం. ఏడేళ్ల అనంతరం ఎగువన కురిసిన వర్షాలతో డిండి ప్రాజెక్టు అలుగు పోస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని పెద్ద, మధ్యతరహా, చిన్ననీటి వనరుల్లోనూ ప్రస్తుతం నీటి నిల్వలు ఉన్నాయి.

వరికి మేలే..

గత నెలలో కురిసిన వర్షాలకు మూడు జిల్లాల వ్యాప్తంగా దాదాపు 5 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తాజా వర్షాలతో జరిగిన నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 11.5 లక్షల ఎకరాలకు పైగా పత్తి పంటను రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల మొదటగా నష్టపోయేది పత్తి పంటే. 20 వేల నుంచి 25 వేల వరకు పత్తి పంటకు నష్టం వాటిల్లవచ్చని.. వర్షాలు మరో రెండు మూడు రోజులు కొనసాగితే మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. తుంగతుర్తి, దేవరకొండ, ఆలేరు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో పత్తి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లవచ్చని అధికారులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో మినుము, పెసర పంటలకు నష్టం వాటిల్లగా...యాదాద్రి, నల్గొండ జిల్లాలో పత్తి పంట ఎక్కువగా నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టుతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ వరి విస్తీర్ణం పెరిగినా వర్షాలతో మేలే చేకురూతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 321 మంది రైతులకు చెందిన వరి 3172 ఎకరాలు, పత్తి 1664 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.

అలుగు పోస్తున్న చెరువులు..

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ, చింతపల్లి, డిండి, తిప్పర్తి, కట్టంగూరు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలో మఠంపల్లి, పాలకవీడు, పెన్‌పహడ్, యాదాద్రి జిల్లాలో బొమ్మలరామారం, భువనగిరి, యాదగిరిగుట్ట, మోటకొండురు, రాజపేట మండలాల్లో సాధారణం కంటే 20 శాతం ఎక్కువగా నమోదైంది. యాదాద్రి జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే దాదాపు 45 శాతం ఎక్కువ వానలు కురిశాయి. వానాకాలం సీజన్‌ (జూన్‌ నుంచి నవంబరు)లో కురవాల్సిన వర్షపాతం ఇప్పటికే పూర్తయిందని.. ఇక నుంచి కురిసేది అంతా సాధారణం కంటే అధిక వర్షపాతమని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మూడు జిల్లాల్లోని 4 వేల చెరువుల్లో ఇప్పటికే 2500 చెరువులు 70 శాతానికి పైగా నిండగా దాదాపు 500 చెరువులకు పైగా అలుగు పోస్తున్నాయి. మరో వేయి చెరువుల్లో సగానికి పైగా నీటి నిల్వలు ఉన్నాయి. రానున్న రబీలో చిన్న నీటి వనరుల కింద సాగు చేసే పంటలకు నీటి కొరత ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

ABOUT THE AUTHOR

...view details